Ads
పట్టుదల ఉన్నట్లయితే పేదరికం కూడా అడ్డురాదని, చదువుకోవాలనే తపన ఉంటే కుటుంబ పరిస్థితులు ఆటంకం కాదని భారతి అనే మహిళ నిరూపించింది. పేదరికాన్ని పోగొట్టాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు మాత్రమే అనే మాటలను నిజం చేసింది.
Video Advertisement
కూలీపని చేసే ఒక మహిళ పీహెచ్‌డీ పట్టాను సాధించిన అద్భుతమైన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. రోజు కూలి పనులకు వెళ్తూ, పిహెచ్‌డి పూర్తి చేసిన మట్టిలో మాణిక్యం భారతి. ఒక రోజు కూలికి వెళ్తే, మరోక రోజు కాలేజీకి వెళ్లి చదువుకుంటూ పీహెచ్‌డీ పూర్తి చేసిన సాకే భారతి గురించి ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలోని శింగమనల నాగుల గడ్డకు చెందిన సాకే భారతి, ఆమె భర్త ప్రోత్సాహంతో శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీలో కెమిస్ట్రీలో పిహెచ్‌డి పూర్తి చేసి, గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకోవడంతో ఆమె వెలుగులోకి వచ్చింది. ఆమె ఎలాంటి కోచింగ్ కు వెళ్లలేదు. కెమిస్ట్రీని చదివి, పీహెచ్‌డీ చేసింది. ఆమెకు శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ పీహెచ్‌డీ పట్టాను అందచేశారు.
వేదిక పైకి భారతి భర్త, కూతురుతో కలిసి వచ్చింది. పారగాన్ చెప్పులు వేసుకుని, సాదా చీర ధరించి వచ్చిన భారతి ఆహార్యాన్ని చూసిన వేదిక పైన పెద్దలు, అతిథుల ముఖాల్లో ఆశ్చర్యం. ఆ తరువాత లక్ష్యసాధనకు పేదరికం అడ్డంకి కాదని నిరూపించిన భారతిని చూసి సంతోషపడ్డారు. భారతి చిన్నతనం నుండే బాగా చదువుకోవాలని కోరుకునేది. టెన్త్ క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకుంది.ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో భారతి పెద్దది. బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో ఆమెకు మేనమామ శివప్రసాద్‌తో పెళ్లి చేశారు. ఆమె భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నది. కానీ వాటి గురించి భర్తకు చెప్పలేదు. కానీ శివప్రసాద్ భారతి కోరికను అర్థం చేసుకుని, పై చదువులు చదివడానికి ప్రోత్సాహన్ని అందించాడు. భారతి తమ జీవితాలను మార్చుకోవడం కోసం ఇదే ఒక మంచి అవకాశం అని భావించింది. కానీ భర్త ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. దాంతో ఆమె కొన్నిరోజులు కూలీ పనులకు వెళ్ళేది. మరి కొన్ని రోజులు కాలేజీకి వెళ్తూ డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. అప్పటికే ఆమెకు ఒక కూతురు. ఆమె ఆలనా పాలనా చూస్తూనే భారతి అటు చదువు, ఇటు కులీ పనులు, ఇంటి పనులు సమన్వయం చేసేది. రోజూ అర్ధరాత్రి వరకూ చదువుకునేది. మళ్లీ పొద్దున్నే లేచి మళ్ళీ చదువుకునేది. ఇక కాలేజీకి వెళ్లాలంటే ఆమె ఉండే ఊరి నుండి 28 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి.
వారిది రవాణా ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి. దాంతో భారతి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే గార్లదిన్నె ఊరు వరకు నడిచి, అక్కడ బస్సు ఎక్కేది. ఇన్ని కష్టాల మధ్య ఆమె డిగ్రీ మరియు పీజీ మంచి మార్కులతో పాస్ అయ్యింది. ఆమె ప్రతిభను చూసిన భర్త శివప్రసాద్, ప్రొఫెసర్లు భారతిని పీహెచ్‌డీ చేసే దిశగా ఆలోచించమని చెప్పారు. అలా ప్రయత్నించగా ఆమెకు ప్రొఫెసర్ డా.ఎంసీఎస్ శుభ వద్ద ‘బైనరీ మిక్చర్స్’ అనే అంశం పై పరిశోధనకు అవకాశం వచ్చింది.పీహెచ్‌డీ కోసం వచ్చే ఉపకార వేతనం ఆమెకి కొంత వరకు సాయపడింది. అయినా భారతి కూలి పనులు చేయడం మానలేదు. ‘‘డాక్టరేట్ చేస్తే యూనివర్సిటీ స్థాయిలో జాబ్ పొందవచ్చు. ఆ ఉద్యోగం మా జీవితాలను బాగు చేస్తుంది. తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఎందరికో పంచే అవకాశం ఉంటుంది. తాను సాధించిన విజయం తన లాంటి వారెందరికో ప్రేరణను ఇస్తుంది” అని భారతి చెప్పుకొచ్చారు.
Also Read: డాక్టర్లకే అర్ధం కానిది.. మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుంది..? ఈ యువతుల కథ ఏంటంటే..?
End of Article