Ads
కలర్ ఫోటో సినిమాతో హీరోగా పేరు సంపాదించుకున్నారు సుహాస్. డిఫరెంట్ పాత్రలని ఎంచుకుంటూ, కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలని చేస్తున్నారు. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : అంబాజీపేట మ్యారేజి బ్యాండు
- నటీనటులు : సుహాస్, శివాని, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న.
- నిర్మాత : ధీరజ్ మొగిలినేని
- దర్శకత్వం : దుష్యంత్ కాటికనేని
- సంగీతం : శేఖర్ చంద్ర
- విడుదల తేదీ : ఫిబ్రవరి 2, 2024
స్టోరీ :
అంబాజీపేట అనే ఒక ప్రాంతంలో 2007 లో కథ మొదలవుతుంది. ఆ ఊరిలో ఉండే మల్లి (సుహాస్) అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో ఒక సభ్యుడు. అతని అక్క పద్మ (శరణ్య ప్రదీప్) అక్కడే ఉన్న ఒక స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. అదే ఊరిలో ఉండే వెంకట్ బాబు (నితిన్ ప్రసన్న) ఊరిలో పెద్దమనిషి అని చెప్పుకుంటూ అందరి మీద అధికారం చెలాయిస్తూ ఉంటాడు. ఆ ఊరిలో ఉండే ఎంతో మంది వెంకట్ దగ్గర అప్పులు తీసుకొని బతుకుతారు. అయితే వెంకట్ కి, పద్మకి ఏదో సంబంధం ఉంది అని, వెంకట్ వల్లే పద్మకి ఉద్యోగం వచ్చింది అని ఆ ఊరిలో ఒక పుకారు వస్తుంది.
మరొక పక్క వెంకట్ చెల్లెలు లక్ష్మి (శివాని), మల్లి ప్రేమించుకుంటూ ఉంటారు. వెంకట్ కి, పద్మకి గొడవలు అవుతాయి. ఆ తర్వాత లక్ష్మి, మల్లి ప్రేమ కథ కూడా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ గొడవలు ఇంకా పెరుగుతాయి. కోపంతో వెంకట్ పద్మ మీద పగ తీర్చుకోవాలి అని ఒక రోజు రాత్రి పద్మని స్కూల్ కి పిలిచి అవమానిస్తాడు. అప్పుడు మల్లి ఏం చేశాడు? వెంకట్ కి బుద్ధి చెప్పాడా? లక్ష్మితో మల్లి ప్రేమ కథ ఎలా సాగింది? ఈ గొడవల మధ్య వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఈమధ్య గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలకి ఆదరణ పెరిగింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలా అంబాజీపేట అనే ఒక ప్రాంతంలో నడుస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఎక్కడ అందులో ఉన్నది నటీనటులు అన్న విషయం గుర్తుకురాదు. చాలా సహజంగా నటించారు. సినిమా చిత్రీకరణ కూడా అంతే సహజంగా ఉంది. అయితే, ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న కథలు మనం అంతకుముందు చూసాం. కులం అనే పేరుతో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి.
హీరో తక్కువ కులానికి చెందిన వారు అవ్వడం, హీరోయిన్ వాళ్ళు ఎక్కువ కులానికి చెందిన వాళ్ళు అవ్వడం, వారి మధ్య ప్రేమ, గొడవలు, ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చాలా భాషల్లో వచ్చాయి. అయితే దర్శకుడు ఎలా ప్రజెంట్ చేస్తాడు అనే దానిమీద సినిమా ఆధారపడి ఉంటుంది. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే, సరదాగా సాగిపోతున్న సినిమాలో ఇంటర్వెల్ దగ్గర గొడవ మొదలవుతుంది. అక్కడి నుండి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. అయితే సినిమా పోస్టర్లలో కానీ, ట్రైలర్ లో కానీ సుహాస్ హీరో అన్నట్టు చూపిస్తారు.
కానీ సినిమా చూశాక సోదరి పాత్ర చేసిన శరణ్య ప్రదీప్ కి కూడా సమానమైన ప్రాముఖ్యత ఉంది అని అర్థం అవుతుంది. సినిమా మొత్తం కూడా పద్మ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో శరణ్య నటన చాలా బాగుంది. పర్ఫామెన్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చేశారు. సుహాస్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని తెలుస్తోంది. నిజంగా ఒక ఊరిలో ఒక సాధారణంగా ఉండే కుర్రాడు ఎలా ప్రవర్తిస్తారో సుహాస్ ఈ సినిమాలో అలాగే నటించారు.
హీరోయిన్ శివాని కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. వెంకట్ బాబుగా నటించిన నితిన్ ప్రసన్న కూడా బాగా నటించారు. అలాగే సినిమా మొత్తానికి మరొక హైలైట్ పాత్ర అయిన పద్మ పాత్రలో శరణ్య చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన సినిమాకి హైలైట్ అయ్యింది. పాటలు సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. వాజిద్ బేగ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ సినిమా కథ మాత్రం తెలిసిపోతుంది. క్లైమాక్స్ వరకు వచ్చాక కూడా చివరికి ఎలా ముగిస్తారు అనే విషయం ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చూసిన ప్రేక్షకులకు అర్థం అవుతుంది. పెద్దగా ట్విస్ట్ లాంటివి ఏమీ ఉండవు.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పర్ఫార్మెన్స్
- కొన్ని ఎమోషనల్ సీన్స్
- 2007 టైంని చూపించిన విధానం
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- ఆసక్తికరంగా అనిపించని లవ్ ట్రాక్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
కథపరంగా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఒక మంచి ఎమోషన్స్ తో సాగే సినిమా చూద్దాం అని అనుకునే వారిని ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలు ఇష్టపడే వారికి, అందులోనూ ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న ప్రేమ కథలు ఇష్టపడే వారికి అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఇప్పటి వరకు చూడని హాస్య బ్రహ్మ “బ్రహ్మానందం” అరుదైన ఫోటోలు..!
End of Article