ఉదయం వాట్సప్‌లో ఒక వీడియో వచ్చింది.. ఆ వీడియోలో ఒక వ్యక్తి హోటల్లో భోజనం చేస్తుంటాడు..ఇంతలో మరో వ్యక్తి వచ్చి అతని పక్కనే కూర్చుని భోజనం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. కాసేపటికి భోజనం చేస్తున్న పక్క వ్యక్తి తను తినడం అవ్వగానే లేచి , చేయి కడుక్కుని వెళ్లిపోతాడు.. భోజనం కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తి ఆ పక్క వ్యక్తి వదిలి వెళ్లిన ప్లేట్ దగ్గరికి తీసుకుని, తననెవరూ గమనించట్లేదని నిర్దారించుకున్న తర్వాత అందులో మిగిలి ఉన్న ఆహారాన్ని తింటాడు.
తిన్న తర్వాత తన దగ్గర ఉన్న కొద్ది డబ్బుని ఆ హోటల్ బిల్ కౌంటర్ దగ్గర ఉన్న డబ్బాలో వేసి వెళ్లిపోతాడు..తన దగ్గర భోజనానికి డబ్బులు లేక తన దగ్గర ఉన్న డబ్బులని చారిటి కోసమో, మరేదానికో ఏర్పాటు చేసిన ఆ డబ్బాలో వేసి వెళ్లిపోతాడు.. ఆ వీడియో చూస్తుంటే మొదట బాధ కలిగింది.. తర్వాత అతడు చేసిన పనికి సంతోషం వేసింది..
మళ్లీ వెంటనే వాట్సప్‌లో మరో మెసేజ్ వచ్చింది..
సస్పెండెడ్_కాఫీ అంటే మీకు తెలుసా ….. అంటూ వచ్చిన ఆ మెసేజ్ ఒకసారి మీరు చదవండి.
నార్వే లో ఒక రెస్టారెంట్ కౌంటర్ లో డబ్బులు ఇస్తూ ఒక మహిళ,“Five coffee, two suspended” అంటూ
ఐదు కాఫీలకి సరిపడ డబ్బు ఇస్తూ,మూడు కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళింది.
మరొకరు వచ్చి,“Ten coffee, five suspended”,అని పదికి డబ్బు కట్టి, ఐదు కాఫీలు పట్టుకుపోయాడు.
అలాగే మరొకరు,“Five meals, two suspended”, అని ఐదు భోజనాలకి డబ్బు కట్టి, మూడు భోజనం ప్లేట్లు తీసుకున్నారు.
ఇదేమిటో అర్థం కాలేదా……? కాసేపటికి ఒక ముసలాయన, చిరిగిన బట్టలతో కౌంటర్ దగ్గరకు వచ్చి,“Any suspended coffee?” అని అడిగాడు.కౌంటర్ లో ఉన్న మహిళ, “Yes”, అని,వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చింది.
ఇంకొక కడు పేదవాడు వచ్చి “Any suspended Meals” అని అడిగిన వెంటనే ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తి ఎంతో గౌరవంతో వేడి వేడి అన్నం పార్సెల్ మరియు నీళ్ళ బాటిల్ చేతిలో పెట్టాడు.
చదువుతుంటే ఒక్కసారిగా మనసంతా సంతోషంతో నిండిపోయింది. ముందు చూసిన వీడియో మళ్లీ కళ్ల ముందు కదిలింది.ప్రస్తుతం లాక్ డౌన్ కాలంలో పనులు లేక పస్తులుంటున్నవారెందరో, ఆత్మాభిమానం చంపుకుని దానం చేయమని అడగలేరు.. ఎవరైనా దానం చేస్తుంటే తీసుకోవడానికి అదే ఆత్మాభిమానం అడ్డొచ్చి పస్తులతోనే పోయే ప్రాణాలెన్నో. . నార్వే నుండి మన పక్క దేశం నేపాల్ వరకు ఈ సస్పెండెడ్ కాఫీ, సస్పెండెడ్ మీల్స్ అలవాటు వచ్చేసింది.. మనకి ఎప్పుడొస్తుందో. మన దేశంలో కూడా వస్తే బాగుంటుంది కదా. మనకు తెలిసిన వారికి సాయం చేయడం వేరు, ఏ పరిచయం లేని, ముక్కూ ముఖం తెలియని వారికి సాయం చేసే పెద్ద మనసు ఉండడమే కదా మానవత్వం అంటే..