2023 వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు . సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఓడిపోవడాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ ఒక పక్క అభిమానుల కలచివేస్తోంది. రోహిత్, కోహ్లీ కన్నీరు పెట్టుకుంటుంటే చూడలేకపోయారు. దీంతో మ్యాచ్ ముగిసిన ఆదివారం రాత్రి నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు.
ప్రస్తుతం ఎక్కడా చూసిన భారత్ ఓటమి గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు అభిమానులు టీమిండియా ఓటమికి అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగడం వల్లే ఓడిపోయిందని అభిప్రాయపడుతున్నారు.
అక్కడ కాకుండా మరే ఇతర స్టేడియంలో మ్యాచ్ జరిగినా ఇండియా గెలిచేది అని అంటున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇవే కామెంట్లు వినిపిస్తున్నాయి. పలువురు విశ్లేషకలు కూడా ఈ కామెంట్లకు మద్దతిస్తున్నారు.నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ మొదట బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో పిచ్ చాలా స్లోగా ఉంది. బంతి ఏ మాత్రం బ్యాట్ మీదకి రాలేదు. దీంతో టీమిండియా బ్యాటర్లకు పరుగులు చేయడం సాధ్యం కాలేదు. పిచ్ మొదటి ఇన్నింగ్స్ అంతా బౌలింగ్ కే సహకరించింది. దీంతో ఆసీస్ బౌలర్లు చెలరేగిపోయారు. అదే సెకండ్ ఇన్నింగ్స్ విషయానికొస్తే దీనికి పూర్తిగా భిన్నంగా పిచ్ మారిపోయింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లకు సహకరించింది. ఏ మాత్రం బౌలర్లకు సహకరించలేదు. ప్లడ్ లైట్ల వెలుతురులో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. దీనికి తోడు రాత్రి 7:30 గంటల నుంచి పిచ్‌పై డ్యూ వచ్చింది. దీంతో భారత బౌలర్లకు పట్టు దొరకలేదు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్, లబుషేన్ పండుగ చేసుకున్నారు. చక్కగా క్రీజులో కుదురుకుని ఆస్ట్రేలియా కి గెలుపు ఖాయం చేశారు.నిజానికి నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ గతంలో బ్యాట్, బాల్‌కు సమానంగా సహకరించేది. ఎప్పుడు బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసిన ఓపికతో ఆడి, చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారికే మంచి ఫలితం వచ్చేది.
అసలు మ్యాచ్ ఫలితంలో టాస్ ప్రభావం ఉండేదే కాదు. ముఖ్యంగా ఈ ప్రపంచకప్‌లో ఈ పిచ్ వన్ సైడేడ్‌గా వ్యవహరించింది. ఫైనల్‌కు ముందు ఇక్కడ జరిగిన 4 లీగ్ మ్యాచ్‌ల్లోనూ 3 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటర్లకు పిచ్ పెద్దగా సహకరించలేదు. కానీ సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రం బాగా సహకరించింది. ఫైనల్లోనూ ఇదే జరిగింది. దీంతో టీమిండియా ఓటమిపాలైంది. అయితే టీమిండియా ఓటమికి పూర్తిగా పిచ్‌ను మాత్రమే నిందించలేం కానీ మొదటి దెబ్బ పడింది మాత్రం అక్కడే.
2011లో మన జట్టు ప్రపంచకప్ గెలిచిన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ పెట్టి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. పైగా అక్కడ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ను చూసుకుంటే రెండు ఇన్నింగ్స్‌ల్లో పిచ్ ఇరు జట్లకు సమన్యాయం చేసిందని అంటున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 397 పరుగులు చేస్తే.. తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కూడా 327 పరుగులు చేసింది.
ఒకానొక దశలో కివీస్ లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లకు సమన్యాయం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 212 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 48వ ఓవర్లో కానీ చేధించలేదు. ఈ పిచ్ రెండు ఇన్నింగ్స్ ల్లో స్లోగానే ఉంది. అందుకే ఫైనల్ మ్యాచ్‌ను కోల్‌కతాలో లేదా ముంబైలో పెట్టాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:ఆస్ట్రేలియా”తో వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా ఓడిపోవడానికి 10 కారణాలు ఇవే…ఆ స్ట్రాటజీ పని చేయలేదు.!