Ads
ఆస్తుల కోసం తల్లితండ్రుల్ని వేధించే పిల్లలు ఉన్న సమాజం ఇది. రెక్కలు ముక్కలు చేసుకుని ఓ వైపు ఆస్తుల్ని సంపాదిస్తూ.. పిల్లలకు కావలసినవి అమర్చి, పెంచి పెద్ద చేస్తే, తల్లి తండ్రులు ముసలి వాళ్ళు అయ్యాక చూసే పిల్లలు ఎంతమంది ఉన్నారు..? ఎక్కడో ఒక చోట తప్ప, చాలా మంది తల్లితండ్రుల ఆస్తులను మాత్రం తీసుకుని, వారిని వృద్ధాశ్రమాలలో చేర్పించేసేవారు కోకొల్లలు. ఆస్తులు చేతికి వచ్చేసాక, తల్లి తండ్రుల్ని రోడ్డుపైనే వదిలేసేవారు చాలామందే ఉన్నారు.
Video Advertisement
మగపిల్లలు కాదు, ఆడపిల్లలు కూడా పెళ్లయ్యాక తమకు పుట్టింటి నుంచి ఏమి వస్తాయి అని ఎదురు చూసే వారు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజుల్లో. అలాంటిది.. ఈ ముగ్గురు ఆడ కూతుళ్ళ కథ వింటే మీ హృదయం ద్రవిస్తుంది. ఒడిశా లోని నవరంగాపూర్ జిల్లాలో, నవ రంగోర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పుష్పాంజలి, గీతాంజలి, శ్రద్ధాంజలి అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వీరు తమ తల్లిని చివరి వరకు చూసుకుని, ఆమె చివరి కోరికను కూడా ఎలాంటి స్వార్ధం లేకుండా నెరవేర్చారు. ఆమె తల్లి పేరు మీద కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అయినా వారు ఎలాంటి స్వార్ధం లేకుండా ఆ కన్న తల్లి ఋణం తీర్చుకున్నారు.
ఆ కన్న తల్లి పేరు వైజయంతి మాల. ఆమె ఎంతో ఉన్నతమైన మనసు ఉన్నవారు. డిసెంబర్ 2 వ తేదీన ఆమె మరణించారు. మరో వైపు ఆమె భర్త అనారోగ్యం తో ఉన్నారు. ఆమె పిల్లలు వారికి కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆమె చివరి కోరిక ప్రకారం ఆమెకు ఉన్న ఆస్తులను ఆ ముగ్గురు కూతుళ్లు విరాళాలు గా ఇచ్చేసారు. నవ రంగోర్ లో ఉన్న జగన్నాధుని ఆలయానికి ఆమె ఆస్తిని విరాళం గా ఇవ్వాలని వైజయంతి మాల చివరి కోరిక కోరారట.
ఆమెకు ఇచ్చిన మాట ప్రకారమే, ముగ్గురు కూతుళ్లు ఆస్తిని దేవాలయానికి విరాళం గా ఇచ్చేశారట. ఆమెకు మూడంతస్తుల భవనం ఉంది. మొత్తం 25 గదులు ఉన్న ఆ భవనం లో, పది కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. వీరి నుంచి వచ్చే అద్దె మొత్తం ఇక పై జగన్నాధుని ఆలయానికి చెందుతుంది. అలాగే, వైజయంతీ మాల ఆభరణాలు అన్ని.. ఆలయం లోని పార్వతి దేవికి చెందాలని ఆమె కోరుకున్నారట. ఆమె కోరిక ప్రకారమే ఆమె కూతుళ్లు ఆ ఆభరణాలను పార్వతి దేవి కి సమర్పించేసారట.
జగన్నాధ ఆలయం నిర్మించి దాదాపు మూడు శతాబ్దాలకు పైనే అవుతోంది. కాలం గడుస్తోంది కాబట్టి, ఆలయాన్ని పునరుద్దరించాలని ఆలయ మండలి భావిస్తోందట. ఈ క్రమం లో వైజయంతి మాల ఇచ్చేసిన ఆస్తులు అందుకు సరిపోతాయని ఆలయ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
End of Article