కట్టుకున్న భర్త కు అనారోగ్యం.. అయినప్పటికి గుండె దిటవు చేసుకుని ఆ సంసారాన్ని నెట్టుకొస్తోంది ఆ ఇల్లాలు. ఇంటి పోరే తప్పేటట్లు లేదనుకుంటే.. దానికి తోడు మామ వేధింపులు. ఇవన్నీ భరించలేక పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకుంది. పిల్లలతోనే బకింగ్‌హామ్‌ కెనాల్‌ లాకుల వద్ద ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చింది. నాన్న దగ్గర ఉండొద్దు.. అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోదాం.. అంటూ ఆమె కన్నకూతురు ఎంతగానో బతిమిలాడింది.

women

కానీ తనను ఆదరించే వారు ఎవరు లేరు అనుకుందో ఏమో.. ఆత్మహత్య కు ప్రయత్నించింది. కూతురు, కొడుకు ని తోసేసి.. ఆ తరువాత తానూ నీటిలోకి దూకేసింది. పిల్లలు మాకు ఈత రాదు అని వారిస్తున్నా వినలేదు. అదే సమయం లో వారిని చూసిన హెడ్ కానిస్టేబుల్ వారిని ఆపడానికి ప్రయత్నించారు. అంతలోనే వారు దూకేశారు. అదే కెనాల్ లో చేపలు పడుతూ ఉన్న యాకోబు, యేసు, నాగరాజు, క్రిష్టియన్ బాబు లు నీళ్ళలోకి దూకి వారిని రక్షించారు.

ఆమెను రక్షించగానే.. ఎందుకు కాపాడారంటూ ఆమె భోరున విలపించింది. ఆమె తన పేరు శాంతి ప్రియా అని చెప్పి, తన పరిస్థితులు చెప్పుకొచ్చింది. మూడేళ్ళ క్రితం తన భర్తకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. అయితే.. అతనికి కిడ్నీ దానం ఇవ్వడానికి భర్త తండ్రి కానీ, భర్త తమ్ముడు కానీ ముందుకు రాలేదు. దీనితో ఆమె తన కిడ్నీలలో ఒకదానిని దానం చేసింది. అప్పటినుంచి ఆమె ఆరోగ్యం కూడా దెబ్బ తింది. అయినా ఇంటి పనంతా చూసుకుంటూ సంసారాన్ని లాక్కొస్తోంది.

ఇది ఇలా ఉండగానే.. మరో వైపు మామ వేధిస్తుండడం తో.. ఆమె మరింత అసహనానికి గురైంది. ఈ విషయం భర్తకు చెప్పినా చేసేదేమి లేకపోవడం తో తనలో తానే కుమిలిపోయింది. పుట్టింటి వారితో చెప్పి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. తనలో తానే బాధపడుతూ.. చివరకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తన రెండో కూతురు మరిది తో కలిసి బయటకు వెళ్లడం తో.. పెద్దకూతురును, కొడుకుని తీసుకెళ్లి నీటిలో తోసేసి.. తానూ దూకేసింది.

విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమె కుటుంబసభ్యులను పిలిపించారు. ఆమె మామ రామకృష్ణ వస్తూనే.. నీ మొగుడిని.. కూతురుని కూడా తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకుంటే పీడా విరగడ అయ్యేది అనడం తో హతాశురాలైంది. పోలీసులు కలగచేసుకుని వారికి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆ తరువాత శాంతిప్రియ తల్లితండ్రులను పిలిపించి ఆమెను, ఆమె పిల్లలను కూడా తల్లితండ్రుల వద్దకు పంపించారు