Ads
పరీక్షలో విఫలమైతే ఎందరో విద్యార్థులు తల్లితండ్రులను ఎదుర్కోలేక తనువు చాలిస్తున్నారు. ఎంసెట్ లో క్వాలిఫై అవ్వలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్థుల్లాపురం లో కలకలం రేపుతోంది.
Video Advertisement
“క్షమించండి అమ్మా నాన్నా.. నా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ నేను నిలబెట్టుకోలేకపోయాను..” అంటూ ఆ అమ్మాయి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శాబ్దుల్లాపురం కు చెందిన అరుణ, రవీందర్ రెడ్డి ల కూతురు స్నేహ ఓ ప్రైవేట్ కాలేజీ లో ఇంటర్ చదివింది. కొన్ని రోజుల క్రితమే ఎంసెట్ పరీక్షకు కూడా హాజరైంది. ఇటీవల ఫలితాలు రావడం తో తాను క్వాలిఫై అవ్వలేదు అన్న విషయాన్నీ స్నేహ తెలుసుకుంది.
దీనితో ఆమె తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఆమె తల్లి అరుణ ఏ ఎన్ ఎం గా పనిచేస్తున్నారు. రోజులానే బుధవారం కూడా ఆమె విధుల నిమిత్తం బయటకు వెళ్లారు. తండ్రి రవీందర్ రెడ్డి కూడా వ్యవసాయ పనులు ఉండడం తో పొలానికి వెళ్ళాడు. ఇంట్లో తల్లి తండ్రి ఇద్దరు లేని సమయం లో.. తల్లిని బండిపై ఇంటికి తీసుకురావాలంటూ తన తమ్ముడిని కూడా బయటకు పంపించేసింది.
అందరు ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే సమయం లో ఆమె తండ్రి కూడా వచ్చాడు. అయితే అతను పనులు ఉండడం తో బయటే కూర్చుని ఉండిపోయాడు. కొంతసేపటికి తల్లిని తీసుకుని తమ్ముడు రావడం తో.. అందరు లోపలికి వెళ్లారు. అప్పటికే లోపల స్నేహ ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకు దించినా.. ఆమె అప్పటికే ప్రాణాలు వదిలేసుకుంది. ఆ తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తాను వెంటనే ఇంట్లోకి వచ్చినా.. కూతురు దక్కేదని ఆ తండ్రి పడుతున్న వేదన చూసి స్థానికులు కలత చెందుతున్నారు.
End of Article