Ads
కరోనా కలవరం మనసులలోనుండి పోనేలేదు, భయంతో కంటి నిండా నిద్రే లేదు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దెబ్బ మీద దెబ్బలా ఒకవైపు కరోనా, ఇంతలో గ్యాస్ లీకేజ్ ఘటన వైజాగ్ వాసులను భయకంపితులను చేస్తోంది.ప్రస్తుత కరోనా భయంతో రేపనేది ఉంటుందా అని ఆలోచిస్తూ పడుకున్న పెద్దవారిని, రేపటి గురించి కలలు కంటూ పడుకున్న అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులని మొత్తం పదకొండు మందిని పొట్టన పెట్టుకుంది…వందలాదిమందిని హాస్పిటల్స్ పాలు చేసింది..వేలాదిమందిని భయంతో బిక్కుబిక్కుమంటూ బతికేలా చేసింది. విశాఖ ప్రమాదంలో ఒక్కొక్కరిది ఒక్కో దీనగాధ..
Video Advertisement
విశాఖపట్నంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్ జి పాలిమర్స్ లో జరిగిన ప్రమాదంలో గ్యాస్ రిలీజైన విషయం తెలిసిందే. ప్రమాదం సంభవించింది తెల్లవారుఝామున కావడంతో కొందరు గాఢనిద్రలో ఉన్నవారు నిద్రలోనే, మరికొందరు తమ తమ పనుల రిత్యా బయటికి వచ్చినవారు ఎక్కడివారక్కడే స్పృహతప్పిపడిపోవడం… ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నవారు.. ప్రమాదవశాత్తు మేఘాద్రి గడ్డలోని కాలువలో పడి మృతి చెందినవారు. తల్లి ఒక బిడ్డని, తండ్రి ఒక బిడ్డని తీసుకుని కాపాడంటూ పరుగులు పెడుతున్న విజువల్స్ తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశం మొత్తాన్ని కదిలించాయి.
కడుపున పుట్టిన బిడ్డకి అనారోగ్య రిత్యా ఇంజక్షన్ ఇప్పించాల్సి వస్తేనే కన్నపేగు కదిలిపోతుంది..అలాంటిది కళ్లముందే బిడ్డలు పిట్టల్లా రాలిపోతుంటే , చనిపోయిన పిల్లలకు పోస్టుమార్టం చేయాల్సి వస్తే ఆ తల్లులు పడే నరకయాతన ఎంత భయంకరంగా ఉంటుంది.. ఈ దుర్ఘటనలో మొత్తం 11మంది మృతి చెందగా వారిలో ఇద్దరు చిన్నారులున్నారు. చనిపోయిన చిన్నారుల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం..
ఇద్దరిలో ఒకరైన ఆరేళ్ల కుందన శ్రేయ హాస్పిటల్ కి వెళ్లే లోపే మరణించింది. కూతురు మరణించిందని తెలిసిన వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన హాస్పిటల్ కి బయల్దేరి వెళ్లారు..కూతురిని పోస్టుమార్టం చేయడానికి తీస్కెళ్లారని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు “మా బిడ్డకు పోస్టు మార్టం చేయొద్దు అంటూ ఏడుస్తూ, పోలీసులను , డాక్టర్లను వేడుకున్నారు..తన బిడ్డ తట్టుకోలేదంటూ కన్నీరు మున్నీరయ్యారు..తమ బిడ్డకి జీవం లేదనే విషయాన్ని కూడా ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. తర్వాత పోలీసులు, డాక్టర్లు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
మరో చిన్నారి గ్రీష్మ కూడా ఈ ఘటనలో మరణించింది..గ్రీష్మ చనిపోయిందనే విషయం తండ్రికి తెలిసినప్పటికి,తల్లికి చెప్పడానికి వెనకాడారు బంధువులు. తల్లిదండ్రులిద్దరూ అస్వస్తతకు గురయి హాస్పిటల్లోనే ఉండడంతో బంధువలకు పాప మృతదేహాన్ని అప్పగించారు. హాస్పిటల్ దగ్గర గుమిగూడిన బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. కోటి రూపాయలు ఎవరికి కావాలి రెండు కోట్లు ఇస్తాం పాపని తెచ్చివ్వండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..ఈ సృష్టిలో ఎన్ని కోట్లు పెట్టిన తిరిగి తీసుకురాలేనిది ఏదైనా ఉందా అంటే ప్రాణం మాత్రమే… విశాఖ ఘటనలో మృతి చెందిన వారికి జగన్ కోటి ప్రకటించిన విషయం తెలిసిందే..
source: eenadu , 10tv
End of Article