ఫోన్ లో గేమ్ ఆడడమే మేలు చేసింది…ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన విశాఖ కుర్రాడు.!!

ఫోన్ లో గేమ్ ఆడడమే మేలు చేసింది…ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన విశాఖ కుర్రాడు.!!

by Anudeep

Ads

అర్దరాత్రి వరకు ఫోన్లో గేమ్ ఆడుతున్న ఆ కుర్రాడికి ఒక్కసారిగా బయట నుండి ఏదో వాసన రావడంతో , వెంటనే కుటుంబ సభ్యులను నిద్రలేపాడు.. తన స్నేహితులకు కాల్ చేసి విషయం చెప్పాడు.. ఒక్కసారిగా అందరిని అలర్ట్ చేయబట్టే తన కుటుంబ సభ్యులతో పాటు, కొన్ని వేల ప్రాణాలను కాపాడగలిగాడు.. ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజి ఘటన రోజున ఏం జరిగిందో “ఈనాడు”తో పంచుకున్న విశాఖ కుర్రాడు..

Video Advertisement

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కి వంద మీటర్ల దూరంలోనే నీలాపు కిరణ్ కుటుంబం ఉంటుంది. ఎల్జీ కంపెనీ నుండి స్టైరీన్ లీక్ అయిన ఘటన గురించి తెలిసిందే. ఆరోజు ఏం జరిగింది అనేది అతని మాటల్లోనే “బుధవారం అర్దరాత్రి వరకు ఫోన్లో గేమ్ ఆడుతూ, రాత్రి 2.20 అప్పుడు గాఢమైన పెయింట్ వాసన వస్తున్నట్టనిపించి వెంటనే నాన్న ను లేపాను. అమ్మ కూడా లేచింది.గ్యాస్ ఆఫ్ చేయలేదేమో అని కిచెన్లోకి వెళ్లి చూసింది. స్మెల్ ఎక్కువ అవుతుండడంతో పెరట్లో తలుపు ఓపెన్ చేసాము.ఒక్కసారిగా భరించలేనంత వాసన, బయటికి వెళ్లి చూస్తే చుట్టూ చీకటి, దట్టమైన పొగ..

మా ఇల్లు స్టైరీన్ లీకైన ట్యాంక్ కి వెనుక 100మీటర్ల దూరంలో ఉంటుంది.కంపెనీ వైపు నుండే పొగ వస్తుండడంతో ,కంపెనీలో ఏదో ప్రమాదం జరిగిందని అర్దమైంది. వెంటనే నా ఫ్రెండ్స్ సురేశ్ , సంతోష్ లకు ఫోన్ చేసి విషయం చెప్పాను.అక్కడ  నేను, అమ్మా,నాన్న, అక్క ఇంట్లోనుండి బయటికి పరుగు పెట్టాం. నేను అరుస్తూ చుట్టు పక్కల వాళ్లందరిని లేపే ప్రయత్నం చేస్తున్నా. నా కళ్ల ముందే నాన్నగారు కిందపడిపోయారు.

ఏం జరుగుతుందో తెలిసే లోపే అమ్మా, అక్కా కూడా కింద పడిపోయారు..అప్పటికి అందరూ ఇళ్ల నుండి బయటకి  వచ్చేశారు..ఎవరికి తోచినట్టుగా వాళ్లు పరుగులు పెడుతున్నారు.. నేను పరిగెడుతూ, పరిగెడుతూ వెళ్లి పక్కన కాలువలో పడిపోయా.. ఉదయం ఏడున్నరకి తెలివి వచ్చింది..మెల్లిగా లేచి రోడ్డుపైకి వచ్చాను. అప్పటికే అక్కడ  జనం అంతా ఎక్కడి వాళ్లక్కడ పడిపోతున్నారు..పోలీసులు వచ్చారు, అంబులెన్స్ లు వచ్చాయి.. ఏం జరిగిందో తెలియనేలేదు, రోడ్డుపై కుప్పకూలిపోయాను.

హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేశారో తెలీదు. స్పృహ వచ్చి చూసేలోపు హాస్పిటల్లో ఉన్నాను. బాగానే ఉంది కదా అని  డిశ్చార్జి రాయించుకుని, మా వాళ్లెక్కడున్నారా అని కనుక్కుంటే కెజిహెచ్ కి తీస్కెళ్లారని తెలిసింది.వెంటనే అక్కడికి వెళ్లాను అమ్మా, నాన్న అక్కా అందరూ క్షేమంగా ఉన్నారని తెలిసి సంతోషమేసింది. గేమ్ ఆడకుండా ఉండుంటే నిద్రపోతున్న వాళ్లం నిదట్లోనే చచ్చిపోయేవాళ్లం..మెలకునుండబట్టే మా వాళ్లని కాపాడుకోగలిగా, నా ఫ్రెండ్స్ కి చెప్పబట్టి మరికొంతమందిని కాపాడాగలిగాం అంటూ ఆ రోజు జరిగింది చెప్పుకొచ్చాడు నీలాపు కిరణ్.

source: eenadu


End of Article

You may also like