Ads
త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, వాయు) స్వల్పకాలిక ప్రతిపాదకన సైనికులను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకమే “అగ్నిపథ్”. ఈ ఐడియా కేంద్రానికి బిపిన్ రావత్ ఇచ్చారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
Video Advertisement
అగ్నిపథ్ పథకం అంటే?
రక్షణశాఖ చెప్పిన వివరాల ప్రకారం.. యువతకు సైన్యంలో అవకాశం ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకమే అగ్నిపథ్ . ఇందులో భాగంగా నియమించే సైనికులను “అగ్నివీరులు” అంటారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేస్తారు. ఆ తర్వాత వారి పని బట్టి మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.
జీతం మరియు ఇతర అలవెన్సులు..
అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరేవారికి మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయలు ఇస్తారు. ఇందులో చేతికి 21 వేలు వస్తాయి. మిగిలిన 9 వేల రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం వస్తుంది. అందులో 30 శాతం అంటే 9900 రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో ప్రతి నెలా ఇచ్చే 36, 500లో 10980 కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం ఇస్తారు. ఇందులో 12000 కార్పస్ ఫండ్‌కి వెళ్తుంది. ఇలా నాలుగేళ్లలో మొత్తం 5 లక్షల రెండు వేల రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ అవుతాయి.
దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11.71 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్మీ నిబంధనల ప్రకారం ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది.
ఎవరు అర్హులంటే..
పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పథకం ద్వారా సైన్యంలో చేరవచ్చు. పదో తరగతి లేదా ఇంటర్ పాసైన యువతీ యువకులు అర్హులు. అయితే, ప్రస్తుతం అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అనంతరం అమ్మాయిలకు కూడా ఈ అవకాశం ఇస్తామని తెలిపారు.
సైన్యంలో ఉండగా చనిపోతే..
సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం అభ్యర్థులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు.
వైకల్యం సంభవిస్తే..
సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే పరిహారం అందిస్తారు. వైకల్యం 100 శాతం ఉంటే 44 లక్షలు, 75 శాతమైతే 25 లక్షలు, 50 శాతమైతే 15 లక్షల రూపాయల పరిహారంగా ఇస్తారు.
రక్షణమంత్రి ఏమన్నారంటే?
ఈ పథకం గురించి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. దీని వల్ల అవకాశాలు పెరగడంతో పాటూ దేశ రక్షణ బలోపేతం అవుతుందని అన్నారు. సైన్యంలో చేరాలన్న యువకుల కల సాకారమవుతుందని చెప్పారు. భారత సైన్యాన్ని మరింత యూత్‌ఫుల్‌గా, టెక్ సావీగా తీర్చిదిద్దడం కోసం యువత సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సైనికాధికారులు తెలిపారు.
End of Article