Ads
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు . గత శుక్రవారం కుప్పంలో టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రకి హాజరైన తారకరత్న కొద్దిసేపు నడవగానే తీవ్ర అస్వస్థకు గురై స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తరలించగా వైద్యులు గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన భార్య అలేఖ్య రెడ్డి కోరిక మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
Video Advertisement
తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఓ అలజడి మొదలైంది. క్షణ క్షణం ఆయన హెల్త్ అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు జనం. కాగా తారకరత్నకు మెలెనా అనే ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. తారకరత్న బాడీలో మల్టీఫుల్ గా ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు కారణం ఆయన మెలెనా అనే వ్యాధితో బాధపడుతుండమే అని తెలుస్తోంది. దీంతో అసలు ఏంటి ఈ వ్యాధి అని నందమూరి ఫాన్స్ ఆరా తీస్తున్నారు.
జీర్ణశయాంతర (గ్యాస్ట్రో ఇంటెస్టినల్) రక్తస్రావాన్ని మెలెనాగా పేర్కొంటారు. ఇదొక అరుదైన వ్యాధి. ఇది రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కడుపులో పుండ్లు, యాసిడ్ ఉత్పత్తి అధికంగా ఉండడం, రక్తనాళాల్లో వాపు, రక్తస్రావం, రక్త సంబంధిత వ్యాధుల వల్ల మెలెనా వస్తుంది. ఈ వ్యాధి వల్ల శరీరంలో రక్త స్థాయి తగ్గిపోతుంది. రక్తహీనతతో పాటు బలహీనమైపోతారు. కొన్ని సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అలసట, విపరీతమైన చెమటలు, గందరగోళం అనిపించడం, అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతాయి.
అంతే కాకుండా మెలెనా వల్ల కొన్ని సందర్భాల్లో రక్తస్రావం విపరీతంగా అవుతుంది. ముక్కు,చెవులు, నోరు సహా పలు చోట్ల నుంచి రక్తస్రావం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గుండెపోటు తర్వాత.. రక్తనాళాల్లో రక్తస్రావం అవుతుంది. మెలెనా వ్యాధి సోకిన వారికి పెప్టిక్ అల్సర్ ట్రీట్మెంట్ తో పాటు ఎండోస్కోపీ థెరపీ, సర్జికల్ థెరపీ, ఆంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, రక్తమార్పిడి చికిత్సలు చేస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధి కారణంగానే తారక రత్నకి చికిత్స చేసేందుకు కష్టమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ, వసుంధర, బ్రాహ్మణి, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కళ్యాణ్ రామ్, సుహాసిని, దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకొని తారకరత్న ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడారు.
End of Article