Ads
పూజ, శుభకార్యం ఏదైనా ముందు పసుపు గణపతిని పూజించడం ఎప్పటినుంచో ఆనవాయితీ గా వస్తోంది. పెళ్లి వంటి శుభకార్యాల ముందు కూడా పసుపు కొట్టడం తో ప్రారంభిస్తారు. వధువుని చేసిన తరువాత గౌరీపూజ చేసే ముందు కూడా పసుపు గణపతికి పెద్ద పీట వేస్తారు. పూజ ఏదైనా.. పసుపు గణపతిని అప్పటికప్పుడు చేసి పెట్టుకుని.. పూజించడం సంప్రదాయం గా వస్తోంది.
Video Advertisement
అయితే.. విఘ్నేశుడు గణాధిపతి. విఘ్నాలను తొలగిస్తాడు కాబట్టి.. ఏ పూజ, శుభకార్యం ప్రారంభించినా అవి నిర్విఘ్నం గా కొనసాగాలని ఆయనను ప్రార్దిస్తుంటాము. అయితే.. ఏ పూజ లో అయినా సరే వినాయకుని విగ్రహాన్ని వాడము. అవి కేవలం పూజ గదిలోనో.. లేక హాల్ లోనో ఉంచి పూజిస్తాం. కేవలం అప్పటికప్పుడు పసుపుతోనే గణపతిని చేయడం వెనుక పురాణాల్లో ఓ కథ ఉంది. ఈ కథ వల్లనే.. పూజల్లో పసుపు గణపతినే పెట్టె సంప్రదాయం వచ్చిందని చెబుతుంటారు.
పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు తపస్సు చేసి బ్రహ్మ వద్ద నుంచి వరాలు పొందారు. ఆ తరువాత లోకాలను హింసించడం మొదలు పెట్టారు. ఆకాశం లో మూడు నగరాల్ని నిర్మించి అక్కడే ఉంటూ.. ముల్లోకాలను బాధించసాగారు. వీరి బాధ పడలేక ప్రజలంతా శివుడిని ప్రార్ధించారు. అప్పుడు శివుడు తన వాహనమైన నందిని ఈ మూడు నగరాలను కొమ్ములతో ఎత్తి పట్టుకోవాల్సింది గా ఆజ్ఞాపించాడు. నందీశ్వరుడు అలానే చేయగా.. ఆ మూడు నగరాలతో పాటు ఆ ముగ్గురు రాక్షసులను కూడా శివుడు అంతమొందించాడు.
అయితే.. ఆ సమయం లోనే నంది కొమ్ము ఒకటి సగం విరిగి భూభాగం పై పడింది. అదే పసుపు కొమ్ము గా వాడుకలోకి వచ్చింది. అయితే తన కొమ్ము విరిగినందుకు నందీశ్వరుడు బాధపడేవాడట. అతని బాధను చూసిన విఘ్నేశ్వరుడు ఈ కొమ్ము ఎక్కడపడిందో చూసి తీసుకొచ్చి ఇచ్చాడట. అయితే నంది కొమ్ము పడిన ప్రాంతం లో మరిన్ని కొమ్ములు మొలిచాయి. వీటిని పసుపు కొమ్ములుగా పేర్కొన్న శివుడు ఈ పసుపు కొమ్ములను చూర్ణం చేస్తే వచ్చిన పసుపు తో ఎవరైతే గణపతిని చేసి ఆరాధిస్తారో వారికి ఎట్టి విఘ్నాలు కలగవని పరమశివుడు వరమిచ్చాడు.
అప్పటి నుంచి ఈ పసుపు కొమ్ములను పవిత్రమైనవి గా భావిస్తూ.. వాటి నుంచి పసుపు ను తయారు చేసి.. ఆ పసుపు తో పూజలు, శుభకార్యాలకు ముందు పసుపు గణపతిని చేసి ఆరాధించడం మొదలైందట. ఇలా పసుపు గణపతిని చేసి.. ఆయనకు ఎదురుగా స్థిరం గా కూర్చుని పూజ చేసేవాళ్ళంటే వినాయకుడికి మహా ఇష్టమట. అందుకే ఆయన పూజల్లో కూడా ప్రారంభం లో “స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ.. స్థిరాసనం కురు” అంటూ చదువుతారు.
End of Article