Ads
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ గడువు ఒకరోజు ముందే ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో 2006లో స్థాపించిన ట్విట్టర్.. ఇప్పుడు 2022లో ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లింది. అయితే ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, ట్విట్టర్ పాలసీ హెడ్ విజయా గద్దె సహా ట్విట్టర్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌ను తొలగించారు. తర్వాత పక్షికి విముక్తి లభించింది అని మస్క్ ట్వీట్ చేయడం గమనార్హం.
Video Advertisement
అయితే వీరిపై వేటు ముందే ఊహించిందే అయినా మస్క్ వీరిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది. అసలు విజయా గద్దె ఎవరు? ఈమె పేరు వింటేనే మస్క్‌కు ఎందుకంత కోపం? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలోనే మస్క్ ఇప్పుడు పరాగ్ అగర్వాల్, విజయా గద్దెను తొలగించాల్సి వచ్చిందా? చూద్దాం..
ఇన్ని రోజులు ట్విట్టర్ పాలసీ, లీగల్, ట్రస్ట్ హెడ్‌గా కొనసాగిన విజయా గద్దె భారత సంతతికి చెందిన అమెరికా మహిళ. ఈమె హైదరాబాద్‌లోనే జన్మించారు. 1974లో పుట్టిన విజయా.. ఆమె మూడేళ్ల వయసులోనే వారి కుటుంబం అమెరికాకు వెళ్లింది. ఆమె అక్కడే తన విద్యాభ్యాసం కొనసాగించారు. కార్నెల్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు. ఆమె ట్విట్టర్‌లో చేరకముందు న్యాయవాదిగా కొనసాగారు. విల్సన్ సోన్సినీ గుడ్‌రిచ్ అండ్ రోసాటి లా ఫర్మ్‌లో దశాబ్దం పాటు పనిచేశారు. ఆ తర్వాత వేర్వేరు శాఖల్లో పనిచేసిన విజయా.. 2011లో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో చేరారు.
ఈమె తన పనితీరుతో ట్విట్టర్‌లో మెల్లమెల్లగా ఒక్కో అడుగు ఎక్కుతూ ట్విట్టర్ లీగల్, పాలసీ, ట్రస్ట్ హెడ్ విభాగాధిపతిగా ప్రమోషన్ పొందారు. ఈమె ట్విట్టర్ లో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లీగల్ హెడ్‌గా ఈమె బాధ్యతలు ట్విట్టర్ సీఈఓ కంటే ఎక్కువ అనడంలో అతిశయోక్తి లేదు. ద్వేషపూరిత ప్రకటనలు, ట్వీట్లు, వేధింపులు, తప్పుడు సమాచారం, విద్వేష స్పీచ్‌లను ట్విట్టర్‌లో నియంత్రించడంలో ఈమె కీలకంగా వ్యవహరించారు.
అభ్యంతరకర ట్వీట్లు తీసేసే గైడ్ లైన్స్ మొదలు… లీగల్, ప్రైవసీ లాంటి ప్రతీ ఇష్యూనీ ఆమె తనదైన స్టైల్‌లో డీల్ చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల టైమ్ లో అయితే ఆమె ఇన్ ఫ్లూయెన్స్ గురించి ప్రపంచం చాలా మాట్లాడుకుంది.ట్విట్టర్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్న విజయా గద్దె.. ఇదే క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా బ్యాన్ చేయడంలోనూ కీలకంగా వ్యవహరించారు.
అప్పుడు ఈ చర్యను ఫూలిష్‌గా అభివర్ణించారు మస్క్. దీంతో.. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తారని వార్తలు వచ్చినప్పుడు ఈమెను తొలగిస్తారని సంకేతాలు అందాయి. ఇప్పుడు అదే చేసారు మస్క్. ఇందుకు గాను మస్క్ విజయకు 15 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
End of Article