Ads
ఒక మనిషి జీవితంలో మార్పు అనేది చాలా సహజమైన విషయం. ప్రతి మనిషి జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ మార్పుని ఎదుర్కోవాల్సిందే. కానీ కొన్నిసార్లు ఆ మార్పు వల్ల ఆ మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. తాను తన లాగా కాకుండా వేరే ఎవరి లాగానే ఉంటూ ఉంటాడు. ఇందుకు ఉదాహరణ ఇప్పుడు మీరు చదవబోయే కథ.
Video Advertisement
సంధ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగంలో చేరిన కొన్ని సంవత్సరాలకి వాళ్ళ ఇంట్లో వారు తనకి పెళ్లి చేశారు. పెళ్లయిన తర్వాత సంధ్య తన భర్తతో, అత్తమామలతో కలిసి ఉంది. సంధ్య కి ఈవినింగ్ షిఫ్ట్. దాంతో సంధ్య షిఫ్ట్ ముగించేటప్పటికి దాదాపు తెల్లవారుజాము అవుతుంది. సంధ్య అప్పుడు పడుకొని 10 గంటల తర్వాత లేస్తుంది.
పెళ్లి కాక ముందు తను ఇలాగే చేసేది. పెళ్లయిన తర్వాత కూడా తను షిఫ్ట్ మూడు గంటలకి పూర్తవడంతో 3 గంటలకి పడుకుని 10 గంటలకి నిద్రలేచింది సంధ్య. నిద్ర లేచి, ఫ్రెషప్ అయ్యి, తన అత్త గారికి సహాయం చేద్దామని వెళ్ళింది. అత్త గారిని చూసి నవ్వుతూ పలకరించింది సంధ్య. కానీ అత్తగారి మొహంలో ఆ నవ్వు లేదు. సంధ్య “ఏమైంది అత్తయ్యా?” అని అడిగింది.
అందుకు సంధ్య వాళ్ళ అత్తగారు “ఇంత ఆలస్యంగా నిద్రలేవడం ఏంటి? 7 గంటలకు నిద్ర లేస్తే ఏమవుతుంది?” అని అడిగింది. అందుకు సంధ్య “అంటే నా షిఫ్ట్ తెల్లవారుజామున అయిపోతుంది అత్తయ్యా. అప్పుడు పడుకొని కొంచెం ఆలస్యంగా నిద్ర లేస్తాను” అని చెప్పింది. అందుకు వాళ్ళ అత్తగారు “ఇలాంటివన్నీ ఇంకా నడవవు. ఉదయం 7 గంటలకు నిద్ర లేవడం అలవాటు చేసుకో” అని సంధ్యని పైనుంచి కిందికి చూసింది. సంధ్య నైట్ డ్రెస్ లో ఉంది.
“ఇక మీదట ఇలాంటి బట్టలు వేసుకోవడం మానేసెయ్. ఇంట్లో మీ మామ గారు కూడా తిరుగుతూ ఉంటారు. తయారయ్యే విధానం మార్చుకో” అని చెప్పింది. సంధ్యకి నిద్ర చాలకపోయినా కూడా అలాగే 7 గంటలకి లేచి అత్తగారికి పనిలో సహాయం చేసేది. తన షిఫ్ట్ మొదలయ్యే టైం కి పని మొత్తం ముగించుకొని ఉద్యోగానికి వెళ్లబోతున్నా కూడా వాళ్ళ అత్తగారు ఆపి ఏదో ఒక పని చెప్పేది.
“ఉద్యోగానికి వెళ్ళాలి” అంటే అయినా “సమయం కాని సమయంలో చేసేది ఏం ఉద్యోగం? ఇలాంటి ఉద్యోగం చేయడం అవసరమా? మానేసి వేరే ఏదైనా చూసుకో” అని చెప్పింది. సంధ్యకి తన భర్త నుండి కానీ, తన మామగారి నుండి కానీ ఎటువంటి మద్దతు లభించలేదు. అంతే కాకుండా వాళ్లు కూడా సంధ్య అత్తగారు అన్న మాటకే మద్దతు ఇచ్చి సంధ్యని వేరే ఉద్యోగం చూసుకోమని చెప్పారు. దాంతో సంధ్య ఒక స్కూల్లో టీచర్ గా జాయిన్ అయింది.
ఇప్పుడు సంధ్య తన అత్తగారికి నచ్చినట్టు గానే జాబ్ చేస్తూ, ఇంట్లో అందరికీ సహాయం చేస్తోంది. దాంతో సంధ్య అత్తగారు, మామగారు, భర్త చాలా సంతోషంగా ఉన్నారు. సంధ్య అత్తగారు అయితే అందరికీ తన కోడలికి తనే ఒక మంచి దారి చూపించినట్టు, ఇలా సమయం కానీ సమయంలో చేసే సాఫ్ట్వేర్ జాబ్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది అని టీచర్ జాబ్ లో చేరాలా చేసినట్లు గొప్పగా చెప్పుకుంది.
వాళ్లందరూ కూడా సంధ్య అత్తగారిని చాలా పొగుడుతున్నారు. అందరూ బాగానే ఉన్నారు. కానీ సంధ్య మాత్రం తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడో కోల్పోయింది. సంధ్యకి క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ రాకపోయినా కూడా తనకి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనే ఇష్టం ఉండడంతో ఎంతో కష్టపడి ఎన్నో ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయినా కూడా మళ్లీ ప్రయత్నించి ఆ జాబ్ సంపాదించుకుంది.
సంధ్య చేసే హార్డ్ వర్క్ ని, పడే కష్టాన్ని చూసి తనతో ఉద్యోగం చేసే వారందరూ సంధ్యని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు. దాంతో సంధ్య మెల్లగా ప్రమోట్ అవుతూ కంపెనీలో టాప్ పొజిషన్ కి వెళ్ళింది. అలా అంత కష్టపడి టాప్ పొజిషన్ కి వెళ్ళిన సంధ్య ఉద్యోగం మానేసి వెళ్లిపోయింది అంటే వాళ్లు కూడా షాక్ అయ్యారు.
సంధ్య లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు. ప్రపంచ వరకు ఎందుకు మనలో కొంత మంది మన చుట్టూనే ఉన్న ఎంతోమంది సంధ్య ఎదుర్కొన్న సమస్యలను ఎదుర్కొంటుంటారు. అసలు ఇందులో సంధ్య చేసిన తప్పేంటి? అవతల వారి మీద తమ ఇష్టాలని రుద్దడం వల్ల జనాలకు ఏమొస్తుంది? వారికే తెలియాలి.
NOTE: images used in this article are just for representative purpose. But not the actual characters.
End of Article