Ads
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “పుష్ప ది రైజ్” గతేడాది చివరిలో విడుదలై ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా, అస్సలు పబ్లిసిటీనే చేయకుండా రిలీజ్ అయ్యి 100 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ నిపుణులను సైతం నివ్వెర పోయేలా చేసింది.
Video Advertisement
అంతేకాదు.. క్రికెటర్లు, ఇతర దేశ క్రీడాకారులు కూడా మైదానంలో అల్లు అర్జున్ వేసిన సిగ్నేచర్ స్టెప్పులు వేసారు అంటే పుష్ప రాజ్ అందరిని ఎంతగా ఆకట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. “పుష్ప ది రైజ్” (పార్ట్ 1) సినిమా చూసిన వాళ్ళందరూ పుష్ప సీక్వెల్ లో భాగంగా వచ్చే “పుష్ప ది రూల్” (పార్ట్ 2) కోసం ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరి “పుష్ప ది రూల్” కూడా బాలీవుడ్ లో అంతటి విజయాన్ని సాధిస్తుందా..? మన సౌత్ ఇండియా నుంచి హిందీలోకి డబ్బింగ్ చేయబడి విజయాన్ని అందుకున్న ‘సీక్వెల్ సినిమాల” ట్రేడ్ లెక్కలపై ఓ లుక్కేద్దాం.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన, శంకర్ దర్శకత్వంలో 2010లో వచ్చిన “రోబో” (పార్ట్ 1) హిందీలో 22 కోట్లు వసూలు చేయాగా, అదే కాంబినేషన్ లో అక్షయ్ కుమార్ కూడా నటించిన, 2018 లో రిలీజ్ అయిన “2.O” (పార్ట్ 2) ఏకంగా 180 కోట్లు వసూలు చేసింది.
మన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా 2015లో వచ్చిన “బాహుబలి ది బిగినింగ్” చిత్రం హిందీలో 115 కోట్లు వసూలు చేయగా, సీక్వెల్ గా 2017 లో రిలీజ్ అయిన “బాహుబలి ది కంక్లూజన్” 510 కోట్లు వసూలు చేసి సినిమా పండితులని సైతం నివ్వెరపోయేలా చేసింది.
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన “కె జీ ఎఫ్ చాప్టర్ 1” 2018 లో విడుదలై హిందీలో 45 కోట్లు వసూలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది, ఇక ఈ ఏప్రిల్ లో రిలీజ్ అయిన “కె జీ ఎఫ్ చాప్టర్ 2” ఏకంగా 435 కోట్లు వసూలు చేసి హిందీ ట్రేడ్ వర్గాలకు మన సౌత్ సినిమా అంటేనే జలసీ పుట్టేలా చేసింది.
ఈ లెక్కలని గమనిస్తే హిందీ ప్రేక్షకులు మన సౌత్ ఇండియన్ సీక్వెల్ సినిమాలని ఎంతగా ఆదరిస్తున్నారో అర్థమవుతుంది. ఇక మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “పుష్ప ది రూల్” రిలీజ్ అయితే బాక్స్ ఆఫీసు దగ్గర వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో అని ట్రేడ్ నిపుణులు ఇప్పటి నుంచే లెక్కలు కట్టడం మొదలు పెట్టారు. పుష్ప2 లో నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించనున్నట్టు సమాచారం. అదే నిజం అయితే పుష్ప2 కి విజయావకాశాలు మరింత మెరుగైనట్టే. ఈ సీక్వెల్ సినిమాల విజయపరంపర బాలీవుడ్ లో అలాగే కొనసాగాలని సౌత్ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.
End of Article