Ads
మనలో చాలామంది గోళ్లను నిర్లక్ష్యం చేస్తుంటారు. మరికొంత మంది మాత్రం గోళ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడంతో పాటు కట్ చేసుకుంటూ ఉంటారు. గోళ్ల ను అందంగా తీర్చిదిద్దుకునేందుకు కొందరు ‘‘బ్యూటీ పార్లర్’’ లేదా ‘‘నెయిల్ సెలూన్’’లకు కూడా వెళ్తుంటారు.
Video Advertisement
అయితే పార్లర్లకు వెళ్లడం కంటే గోళ్లపై మనమే ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మన శరీరంలో దాగివున్న చాలా అనారోగ్య సమస్యల గురించి ఇవి ముందుగానే మనకు సంకేతాలు ఇస్తాయి. మనం గోళ్ల రంగును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. రంగు మారినట్లు అనుమానం వస్తే వెంటనే జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు మచ్చలు, గీతలు కూడా కనిపిస్తుంటాయి.
అయితే, అన్నిసార్లూ ఏర్పడే మచ్చలు, లేదా గీతలు వ్యాధులకు సంకేతంగా భావించకూడదు. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినప్పటికీ గోరు మీద ఇలాంటి తేడాలు కనిపిస్తుంటాయి. గోళ్లలో వచ్చే మార్పులు, వాటి వెనుక దాగివున్న కొన్ని వ్యాధుల గురించి తెలుసుకుందాం.
#1. తెల్లగా మారిపోవడం:
గోళ్లు తెల్లగా పాలిపోతే.. మైకోసిస్, సొరియాసిస్, న్యుమోనియా లాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నాయని వెంటనే గ్రహించాలి. ఒక్కోసారి హృద్రోగాలు లాంటి తీవ్రమైన వ్యాధులకూ గోళ్లు తెల్లగా పాలిపోవడానికి సంబంధం ఉంటుంది. శరీరంలో పోషకాలు తగ్గిపోవడం, ప్రోటీన్‌ను తక్కువగా తీసుకోవడమూ వల్ల కూడా ఇలా జరగొచ్చు. అందుకే గోళ్లు తెల్లగా కనిపించిన వెంటనే డెర్మటాలజిస్టును సంప్రదించాలి. వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి.
#2. పసుపు రంగు గోళ్లు:
ఒక్కోసారి గోళ్లు పసుపు రంగులోకి మారుతుంటాయి. దీనికి జన్యుపరమైన వ్యాధులు లేదా వయసు పైబడటం వల్ల కావొచ్చు. ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా జరగొచ్చు. కొన్నిసార్లు సొరియాసిస్, హెచ్ఐవీ, కిడ్నీ వ్యాధులు లాంటి తీవ్రమైన అనారోగ్యాలకూ ఇది సంకేతం కావొచ్చు. పొగ తాగే వారిలో కూడా గోళ్లు ఇలా పసుపు రంగులోకి మారుతుంటాయి.
#3. తెల్లని మచ్చలు:
గోళ్ల పై తెల్లని మచ్చలు కనిపించడాన్ని ‘‘పిటింగ్’’ అని అంటారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గోళ్ల పై ఈ మచ్చలు కనిపిస్తాయి. సొరియాసిస్, డెర్మటైటిస్ లేదా ఇతర చర్మ లేదా జుట్టు సమస్యల వలన గోళ్లపై ఇలా మచ్చలు వస్తుంటాయి. కొన్నిసార్లు సిఫిలిస్ లాంటి సుఖ వ్యాధి వల్ల కూడా ఇలా జరుగుతుంది.
#4. నీలం రంగులోకి మారితే:
చాలా మందిలో ఇలా గోళ్లు లేత నీలం రంగులోకి అప్పుడప్పుడు మారుతుంటాయి. కొన్ని రకాల టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఇలా జరుగుతుంటుంది. ముఖ్యంగా మలేరియా మందులు వేసుకున్నప్పుడు గోళ్లు ఇలా నీలం రంగులోకి మారుతుంటాయి. ఇలా రంగు మారినప్పుడు వైద్యులను సంప్రదించాలి. మందులను మార్చడం లేదా కొత్త చికిత్సా విధానాలను సూచిస్తారు.
#5. ఫంగల్ ఇన్ఫెక్షన్లు:
మైకోసిస్‌గా పిలిచే ఫంగల్ ఇన్ఫెక్షన్ గోళ్లకు వస్తుంటుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే ఇది మళ్లీమళ్లీ వస్తుంది. అందుకే దీని విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కాలి గోళ్ల పై ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకసారి దీనికి చికిత్స మొదలుపెడితే, ఆరు నెలల వరకు కొనసాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ చేతి గోళ్లకు ఈ ఇన్ఫెక్షన్ వస్తే మూడు నుంచి నాలుగు నెలలపాటు చికిత్స ఉంటుంది.
#6. గోళ్ల పై గీతలు ఉంటే:
కొన్నిసార్లు గోళ్లపై సన్నంగా, నీలువుగా గీతలు కనిపిస్తుంటాయి. హై ఫీవర్ లేదా కీమోథెరపీ లాంటి చికిత్సల తర్వాత ఇలాంటి గీతలు కనిపిస్తుంటాయి. ఇవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గోళ్లపై కూడా కనిపించొచ్చు. అయితే, ఒక్కోసారి మెలనోమాకు కూడా ఈ గీతలు సంకేతం కావొచ్చు. మెలనోమా ఒక చర్మ క్యాన్సర్.
#7. పెళుసుగా అయితే:
కొన్నిసార్లు గోళ్లు చాలా పెళుసుగా అయిపోతుంటాయి. ఏవైనా కెమికల్స్‌తో పనిచేసినప్పుడు ఇలా జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోళ్లపై క్రీమ్‌లు లాంటివి పూయాలి. అప్పుడు గోళ్లు తేమ కోల్పోకుండా ఉంటాయి. శరీరానికి తగిన ప్రోటీన్‌తో పాటు, బయోటిన్ లాంటి విటమిన్లు అందకపోవడం వల్ల కూడా గోళ్లు పెళుసుగా మారిపోతుంటాయి.
End of Article