Ads
సినిమాకు హిట్ టాక్ వస్తే గానీ ఫ్యామిలీలు థియేటర్ బాట పట్టవు. ముఖ్యంగా ఆడవారు టెలివిజన్ వదిలి వెండితెర వైపు చూడరు. అందుకే యూత్ కి నచ్చే కథాంశాలతో వచ్చే సినిమాలే ఆడుతాయి. కానీ ఈ ట్రెండ్ ని బద్దలు కొడుతూ.. ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు, బంధాలు, బంధవ్యాలు, సంప్రదాయలు వీటిచుట్టూ అల్లిన కథాంశంతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చింది.
Video Advertisement
అందులోను విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి మల్టీస్టారర్ మూవీ చేసారు. పూర్తి గోదావరి యాసతో రూపొందిన ఈ చిత్రం ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇందులో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా విషయాలు చెప్పారు అవేంటంటే..
#1 ఒక బాగా బతికిన కుటుంబం తర్వాత కష్టాలు పడుతూ ఉంటుంది. అయినా సరే అంత మంచి కుటుంబంలో ఉన్న మనుషులు, వారి వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి అనేది చూపించారు.
#2 సినిమాలోని పాత్రలు పాత్రలలాగా అనిపించవు. నిజ జీవితంలో మనం ఎప్పుడూ ఎక్కడో ఒక చోట చూసే మనుషుల లాగానే వారు అనిపిస్తూ ఉంటారు. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఆ పాత్రను పోషించిన నటులు మనకి కనిపించరు. కేవలం ఆ పాత్రలు మాత్రమే కనిపిస్తారు.
#3 ఈ సినిమా ప్రేక్షకులకు అంత బాగా నచ్చడానికి ముఖ్యకారణం సంభాషణలు. పశ్చిమగోదావరి జిల్లాలో రేలంగి అనే పల్లెటూరులో, కృష్ణా విజయవాడ నేపథ్యం ఉన్న పాత్రలు కాబట్టి ఆ యాస పాత్రల్లో, వారి సంభాషణల్లో కనిపిస్తూ ఉంటుంది. దాంతో నిజంగా ఆ ప్రాంతం వాళ్ళు అలాగే మాట్లాడుకుంటారు అనే విషయాన్ని దర్శకుడు మనకు చూపించారు.
#4 ఈ సినిమాలో పాటలు గమనిస్తే ఒక పాటలో ఒక్క ఇంగ్లీష్ అక్షరం కూడా ఉండదు. కేవలం ఒక పాటలో సిమెంట్ అనే పదం ఉంటుంది అంతే. పాటలన్నీ కూడా సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నవారికి మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే అంత సులువుగా అర్థవంతంగా ఉంటాయి. పాటల్లో వచ్చే లిరిక్స్ కూడా ప్రోత్సహించేలాగా, ఏదో ఒక సందేశం ఇస్తున్నట్టు అనిపిస్తాయి.
#5 రేలంగి మామయ్య పాత్రని అందరూ ట్రోల్ చేస్తారు. కానీ ఆ పాత్రలో చాలా అర్థం ఉంది. సాధారణంగా మనమందరం మన స్వార్థం చూసుకుంటాం. బయటికి ఒకలాగా ఉంటూ, లోపల ఒకటి పెట్టుకొని మాట్లాడే మనస్తత్వం చాలామందికి ఉండదు. అందుకే ఎవరైనా నచ్చకపోతే వారితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాం. రేలంగి మావయ్య ఎక్కువగా ఆలోచించి ఏమవుతుందో అని భయపడే మనిషి కాదు. అందరిలో మంచి చూడడానికి ప్రయత్నిస్తాడు. అలాంటివాళ్లు ఉంటే డబ్బు ఉన్నా లేకపోయినా కూడా సంతోషంగా, ఆరోగ్యంగా బతకొచ్చు అని దర్శకుడు చెప్పాడు.
#6 సినిమా లో ఉన్న పాత్రలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా చాలామంది నిజజీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఇబ్బందులు, గొడవలు, ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య ఆర్థికంగా ఉన్న తేడా, దాంతో వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్యలు. ఒకవేళ ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు రేలంగి మామయ్యలాగా వదిలేసి వెళ్ళిపోవాలే కానీ, చిన్నోడు పెద్దోడు లాగా అవి మనసులో పెట్టుకొని ఇంకా సమస్యలు పెంచుకోవద్దు అని చెప్పారు.
#7 నిజంగా అన్నీ తెలిసిన అన్న, కొంచెం కొంటెగా ఉండే తమ్ముడు, అందరూ మన అనుకునే రేలంగి మావయ్య, అందరూ బాగుండాలి అనుకునే రేలంగి మామయ్య భార్య, జీవితం అంతా చూసేసి ఇప్పుడు ప్రశాంతంగా బతుకుదాం అనుకునే ఒక పెద్దావిడ, గలగలా మాట్లాడుతూ అందరితో కలిసిపోయే ఒక అమ్మాయి, మనకి అస్సలు నచ్చని కుటుంబానికి చెందిన, మనల్ని ఇష్టపడుతున్న ఇంకొక అమ్మాయి. ఇవన్నీ పాత్రలు కాదు. నిజజీవితంలో కనిపించే మనుషులు.
అందుకే ఈ సినిమా గత కొంత కాలంలో వచ్చిన సినిమాల్లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. దర్శకుడు కూడా ఈ సినిమాతో ప్రపంచాన్ని మార్చే సందేశం ఏమి ఇవ్వాలి అనుకోలేదు. పైన చెప్పినవన్నీ కలిస్తేనే కుటుంబం, ఇవన్నీ ఉంటేనే జీవితం అనుకునేలాగా చెప్పారు. అందుకే ఈ సినిమా అంటే చాలా మంది ప్రేక్షకులకి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.
End of Article