Ads
తెలంగాణ గ్రామీణ ప్రాంత పరిస్థితులకు అద్ధం పట్టే కథతో రూపొందిన ‘బలగం’ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. కమెడియన్ వేణు రూపొందించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ దీనికి సంగీతాన్ని అందించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు.
Video Advertisement
అయితే ఈ చిత్రం లో కొమురయ్య అల్లుడి పాత్రలో మెప్పించిన మురళీధర్ గౌడ్ తన నటనతో అందరికీ ఆకట్టుకున్నాడు. ఆయన ఇదివరకు నటించిన డీజే టిల్లు సినిమాలోనూ అందరినీ అలరించాడు. ఆ మూవీ లో బాధ్యత లేని కొడుక్కి తండ్రిగా నటించి మెప్పించారు మురళీధర్ గౌడ్. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయే మురళీధర్ గౌడ్ సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం..
మురళీధర్ గౌడ్ ది మెదక్ జిల్లా రామాయంపేట. ఆయన తండ్రి కులవృత్తి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. వీరు మెదక్ జిల్లాలోని గజ్వేల్, సిద్ధిపేట ప్రాంతాల్లో కొంతకాలం నివాసం ఉన్నారు. స్కూల్ డేస్ లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రదర్శనలో భాగంగా మురళీధర్ గౌడ్ గౌడ్ మేకప్ వేసుకున్నారు. ఆ తర్వాత డిగ్రీ చదివే రోజుల్లోనే దాసరినారాయణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడానికి లెటర్ రాశారు. కానీ ఆ అవకాశం దొరకలేదు. ఇక మురళీధర్ గౌడ్ చదువు పూర్తయిన తరువాత పలు వ్యాపారాలు చేసారు.
ఇంతలోనే అప్పటి ఏపీ పరిధిలో ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి కాల్ లెటర్ వచ్చింది. దీంతో ఆయన జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా కొలువు కొట్టేశాడు. అనూహ్యంగా వచ్చిన ఈ ఉద్యోగాన్ని మురళీధర్ గౌడ్ వదులుకోలేదు. ఇలా 27 ఏళ్లపాటు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. రిటైర్ అయ్యిన తర్వాత మురళీధర్ గౌడ్ 60 ఏళ్ల వయసులో ఇండస్ట్రీ గడప తొక్కారు.
ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత మురళీధర్ గౌడ్ ఇంట్లో వాళ్లకు చెప్పకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. కొన్ని రోజుల పాటు సీరియళ్లలో నటించిన తరువాత ‘డీజె టిల్లు’ సినిమాతో గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఆయనకు అవకాశాలు తలుపు తట్టాయి. ఇప్పుడు ‘బలగం’ సినిమాలో అల్లుడి పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం లో ఆయన నటనకు ప్రశంసలతో పాటు.. వరుస అవకాశాలు కూడా దక్కుతున్నాయి.
End of Article