Ads
ఎవరైనా మనకు తెలియని సినిమా పేరు చెప్తే మనం ముందు అడిగే ప్రశ్న హీరో ఎవరు అని. ఒక సినిమా లో హీరోకి అంత ప్రాముఖ్యత ఉంటుంది. హీరో వల్లే ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది గుర్తింపు తెచ్చుకున్న కూడా తర్వాత ఎన్నో కారణాల వల్ల సినీ పరిశ్రమకి దూరమై పోతారు. అలా మన అందరిని ఎంతో కాలం అలరించి హఠాత్తుగా మాయమైపోయిన హీరోలు కొంతమంది వీరే.
Video Advertisement
ఆకాశ్
1999లో రోజా వనం అనే తమిళ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 2001లో రామ చిలకమ్మా తెలుగులో ఆకాష్ మొదటి సినిమా. అదే సంవత్సరంలో వచ్చిన ఆనందం ఆకాష్ కి బ్రేక్ ఇచ్చింది. తర్వాత పిలిస్తే పలుకుతా, మనసుతో, ఆనందమానందమాయే సినిమాలు చేశారు. అలాగే ఎన్నో తమిళ కన్నడ, ఒక మలయాళం సినిమాల్లో కూడా నటించారు. వసంతం, గోరింటాకు, ఢీ, నమో వెంకటేశా లాంటి ఈ సినిమాలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశారు.
నవ వసంతం లో నాలుగు హీరోల్లో ఒకరిగా చేశారు.2013లో ఆకాష్ నటించిన ఏక్ థా మే అనే సినిమా హిందీ తమిళ తెలుగు కన్నడ మలయాళం ఇంగ్లీష్ భాషలో విడుదలయింది. 2014లో దొంగ ప్రేమ అనే సినిమా చేశారు. హీరోగా ఆకాష్ చాలా సినిమాలు చేసినా కూడా గుర్తింపు పొందినవి కొన్ని సినిమాలే కావడంతో ప్రజలు ఆయనని ఆనందం సినిమాతోనే గుర్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం తమిళ్ లో నీతానే ఎన్థన్ పొన్ వసంతం అనే సీరియల్ లో నటిస్తున్నారు.
వడ్డే నవీన్
కోరుకున్న ప్రియుడు సినిమా తో ఇండస్ట్రీలోకి వచ్చారు నవీన్. పెళ్లి సినిమా తనకు ఎంతగానో పేరు తీసుకొచ్చింది. తర్వాత చాలా బాగుంది, తిరుమల తిరుపతి వెంకటేశ, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది, నా ఊపిరి ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు చేశారు. 2010 లో వచ్చిన శ్రీమతి కళ్యాణం అనే సినిమా నవీన్ హీరోగా నటించిన చివరి సినిమా. 2016 లో వచ్చిన ఎటాక్ సినిమాలో ముఖ్య పాత్ర చేశారు. అదే నవీన్ నటించిన చివరి సినిమా. మళ్ళీ తర్వాత తెరపై కనిపించలేదు.
దాసరి అరుణ్ కుమార్
దాసరి నారాయణరావు గారి కొడుకు అయిన అరుణ్ కుమార్ గ్రీకు వీరుడు సినిమాతో పరిచయమయ్యారు. తర్వాత చిన్నా, ఒరేయ్ తమ్ముడు సినిమాలు చేశారు. తర్వాత 2017 లో వచ్చిన ఒక్క క్షణం లో విలన్ రోల్ చేశారు. శైలజ రెడ్డి అల్లుడు లో ఒక సపోర్టింగ్ రోల్ చేశారు.
అనిల్ మేకా
మేక అనిల్ హీరో శ్రీకాంత్ తమ్ముడు. దేవుళ్ళు సినిమాలో రాముడి పాత్రలో నటించిన శ్రీకాంత్ తో కలిసి అదే సినిమాలో లక్ష్మణుడి పాత్ర లో నటించారు. తర్వాత శ్రీకాంత్ నటించిన విరోధి సినిమా ను నిర్మించారు.
వెంకట్
అన్నయ్య సినిమా లో చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లు లో నటించిన వెంకట్ మీకు గుర్తుండే ఉంటారు. వెంకట్ మొదటి సినిమా వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వం వహించిన సీతారాముల కళ్యాణం చూతము రారండి. తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. తమిళ్ హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. 2014లో స్నేహమే తోడుగా అనే సినిమాలో నటించారు వెంకట్. ఆ తర్వాత ఎక్కడా కనబడలేదు. వెంకట్ ఇప్పుడు ముంబైలో స్థిరపడ్డారు.
శివాజీ
శివాజీ ఎవరో మనందరికీ తెలుసు. 1997లో మాస్టర్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన శివాజీ ఎన్నో సినిమాల్లో హీరోగా సహాయ నటుడిగా మెప్పించారు. తెర మీదే కాకుండా తెర వెనకాల డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చేశారు శివాజీ. నితిన్ విజయ్ సేతుపతి యశోసాగర్ కి డబ్బింగ్ చెప్పారు. 2018లో గ్యాంగ్‌స్టర్ అనే వెబ్ సిరీస్ లో నటించారు శివాజీ. తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో అడుగుపెట్టారు.
అబ్బాస్
ఇప్పుడు అబ్బాస్ అంటే గుర్తొచ్చేది హార్పిక్ అడ్వటైజ్మెంట్. కానీ నటుడిగా ఎన్నో మంచి సినిమాలను చేశారు అబ్బాస్. అబ్బాస్ మొదటి సినిమా ప్రేమ దేశం. ఎంట్రీ ఏ శంకర్ దర్శకత్వం లో జరిగింది. ప్రేమ దేశం ఆ టైంలో పాత్ బ్రేకింగ్ సినిమా. ఇంక ఆ సినిమా తర్వాత అబ్బాస్ కి అతని హెయిర్ స్టైల్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
తర్వాత ఎన్నో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ చిత్రాల్లో నటించారు. 2014లో వచ్చిన అలా జరిగింది ఒక రోజు అబ్బాస్ చివరి తెలుగు చిత్రం. తమిళ్లో 2 సీరియల్స్ లో నటించారు. 2016లో ఒక మలయాళం సినిమా తో తన సినీ కెరీర్ కి స్వస్తి చెప్పారు అబ్బాస్. ఇప్పుడు న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు.
తరుణ్
చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలు పెట్టిన తరుణ్ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. లవర్ బాయ్ అన్న ఇమేజ్ ని సంపాదించుకున్న తరుణ్ 2014లో వేట అన్న సినిమా చేసి నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని మళ్ళీ 2018 లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తర్వాత మళ్లీ సినిమాల్లో కనబడలేదు తరుణ్. ఇప్పుడు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా రాబోతున్నారు అన్న రూమర్లు వినిపిస్తున్నాయి.
వేణు
1999లో స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు వేణు. మొదటి సినిమానే హిట్ కావడంతో వేణు కి చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో లాంటి ఎన్నో సినిమాల్లో నటించే జనానికి ఇంకా చేరువయ్యారు.
2012లో వచ్చిన దమ్ము సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. 2013లో వచ్చిన కన్నడ సినిమా రామాచారి చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. అందులో హీరోగా చేశారు వేణు. అదే వేణు చివరి సినిమా. ఆ సినిమా తరువాత సడన్‌గా మాయమైపోయారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు.
ఆర్యన్ రాజేష్
ఈవీవీ సత్యనారాయణ గారి కొడుకు ఆర్యన్ రాజేష్ హాయ్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సొంతం సినిమాతో హిట్ కొట్టి ఇంకా గుర్తింపు సంపాదించారు. ఆడంతే అదో టైపు, ఎవడి గోల వాడిది, లీలామహల్ సెంటర్, నువ్వంటే నాకిష్టం, అనుమానాస్పదం సినిమాల్లో నటించారు. అనుమానస్పదం సినిమా ఎలా ఉన్నా ఇళయరాజా పాటల వల్ల అందరికీ తెలిసింది. 2012లో వచ్చిన బాలరాజు ఆడి బామ్మర్ది తెలుగులో ఆర్యన్ రాజేష్ చివరిగా హీరోగా చేసిన సినిమా.
తర్వాత 2013 లో ఒక తమిళ్ సినిమా చేశారు.సిల్వర్ స్క్రీన్ కి దూరమైపోయినా డిజిటల్ స్క్రీన్ లో అంటే వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషించారు. 2018 లో వచ్చిన ముఖాముఖం అలాగే 2019 లో వచ్చిన ఎక్కడికి ఈ పరుగు వెబ్ సిరీస్ లో ఒక పాత్ర చేశారు. 2019 లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ కి అన్నగా నటించారు.
వంశీకృష్ణ
హ్యాపీ డేస్ శంకర్ పాత్రలో నటించిన అతను మీకు గుర్తుండే ఉంటాడు. అతనే వంశీకృష్ణ. తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన కూడా అవి అంతగా గుర్తింపు పొందలేదు. మహానటిలో ఒక జర్నలిస్టుగా, గద్దల కొండ గణేష్ లో ఒక యువ రాజకీయవేత్తగా సహాయ పాత్రలు పోషించారు.
తారకరత్న
2002 లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తర్వాత అమరావతి సినిమాలో ఆయన చేసిన నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్ర కి ఎంతో పేరు వచ్చింది. ఆ సినిమా కి నంది అవార్డు కూడా అందుకున్నారు. హీరోగా కొన్ని సినిమాలు చేశారు. మనమంతా లో ఒక ముఖ్య పాత్ర చేశారు. రాజా చెయ్యివేస్తే సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు. తారకరత్న చివరిగా 2017 లో వచ్చిన ఖయ్యుమ్ భాయ్ సినిమా లో కనిపించారు.
రోహిత్
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే పాట గుర్తుందా. ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అప్పట్లో ఆ పాట కున్న క్రేజ్ అలాంటిది మరి. పాటతో పాటు అందులో నటించిన హీరో కూడా గుర్తుండే ఉంటాడు. అతనే రోహిత్. తర్వాత సొంతం నేను సీతా మహాలక్ష్మి జానకి వెడ్స్ శ్రీరాం మా అన్నయ్య బంగారం సినిమా లో నటించారు. 2010 లో మా అన్నయ్య బంగారం సినిమా లో నటించిన తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకొని 2013లో ఎన్ఆర్ఐ , హాఫ్ బాయిల్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఎక్కడున్నారు ఎవరికీ తెలియదు.
రాజా
2002లో ఓ చినదానా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తర్వాత విజయం అప్పుడప్పుడు ఆనంద్ ఆ నలుగురు అర్జున్ బంగారం వెన్నెల స్టైల్ మాయాబజార్ మిస్టర్ మేధావి ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ కావడంతో అందరికీ ఇంకా చేరువయ్యారు. 2016 లో పార్కింగ్ అని ఒక సినిమా మొదలు పెట్టినా అది మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమాలకి దూరంగా భక్తి మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు రాజా.
రవి కృష్ణ
7/G బృందావన్ కాలనీ సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చారు. మొదటి సినిమాతోనే అలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకుని సాహసం చేసినా, సినిమా ఒక నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందటం, ఇంకా యూత్ కి కూడా ఎక్కువ కనెక్ట్ అవ్వడం తో తెలుగు తమిళ్ ఇండస్ట్రీలలో క్లిక్ అయ్యారు.
తెలుగులో ఈ సినిమా కాకుండా బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు రేపు అనే ఇంకో రెండు సినిమాలు చేశారు రవికృష్ణ. తర్వాత రెండు తమిళ సినిమాలు చేశారు. అందులో ఒకటి జాతీయ అవార్డు సంపాదించిన 2011లో వచ్చిన అరణ్య కాండం. ఆ సినిమాలో సహాయ పాత్రలో నటించారు. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పారు. ఇటీవల చాలా మారిపోయిన రవి క్రిష్ణ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
ఆదిత్య ఓం
2002 లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ధనలక్ష్మి ఐ లవ్ యు, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు సినిమాల్లో నటించారు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి కూడా దర్శకత్వం వహించారు.ద డెడ్ ఎండ్ అనే ఇంగ్లీష్ సినిమా ని రాసి దర్శకత్వం వహించారు. ఆ సినిమాకి అంతర్జాతీయ స్థాయి లో ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆదిత్య రాసిన స్క్రిప్ట్ ఎంతో ప్రసిద్ధమైన ఆస్కార్ లైబ్రరీలో పెట్టారు.
ఇప్పుడు ఆదిత్య చెరుపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ ఒక లైబ్రరీ కట్టించారు, అలాగే ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్లు కూడా నిర్మించారు. అవసరమైన వాళ్లకి లాప్‌టాప్‌లూ కూడా అందజేశారు. ఇంకా ఆ ఊరి లోని ప్రభుత్వ పాఠశాలలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయించారు. ఒక ఎన్జీవో సంస్థను నడుపుతున్నారు. దానిద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
రమేష్ బాబు
కృష్ణ గారి కొడుకైన రమేష్ బాబు బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టారు. తర్వాత హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. 1997లో వచ్చిన ఎన్కౌంటర్ నటుడిగా రమేష్ బాబు చివరి సినిమా. తర్వాత నిర్మాతగా మారారు. హిందీ సూర్యవంశం సినిమా కి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా చేశారు. అర్జున్, యూటీవీ మోషన్ పిక్చర్స్ తో కలిసి అతిథి, దూకుడు, ఆగడు సినిమాలు నిర్మించారు.
ఇలా ఇంకా చాలా మంది హీరోలు తన సినీ కెరీర్ ని హఠాత్తుగా ఆపేశారు. చాలామంది ఏదో ఒక పాత్రలో ఎన్నో సినిమాలు చేస్తూనే ఉంటారు కానీ గుర్తింపు పొందకపోవడం వల్ల ఆ సినిమాలు ఎక్కువగా తెలియకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది ముఖ్య పాత్రల్లో నటిస్తూ తమ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఇంకా కొంతమంది డైరెక్షన్ ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టారు. కొందరు సినిమా రంగానికి పూర్తిగా దూరంగా వేరే ప్రొఫెషన్లోకి వెళ్లిపోయారు.
End of Article