Ads
పెళ్లి ఎవరి జీవితం లో అయినా ఎంతో ముఖ్యమైనది. మనం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారు పెళ్లి అయిన తరువాత మునుపటి లా ప్రేమించకపోతే మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది. ఇలా చాలా కుటుంబాల్లో జరుగుతూనే ఉంటుంది. కానీ కారణం ఏంటి అనేది ఎవరు ఆలోచించుకోరు. ఓ భార్య.. తన భర్తతో కూర్చుని మాట్లాడుకుని ఈ సమస్యని ఎలా పరిష్కరించుకుందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
ఓ సెలవు రోజున ఇంట్లో తన భర్త మొబైల్ లో చూస్తూ ఉన్న సమయం లో పక్కన వెళ్లి కూర్చుంది. మీతో మాట్లాడాలి.. ఈ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయమని కోరింది. మొదట నిరాకరించినా.. తన భార్య ఫేస్ డల్ గా ఉండడం చూసిన ఆ భర్త ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసాడు. ఆ తరువాత విషయమేమిటని అడగగా.. భార్య చెప్పడం స్టార్ట్ చేసింది.. “మీరు పెళ్ళికి ముందు చాలా సరదాగా ఉండేవారు. నాపై ప్రేమ గా చూసేవారు.. కవ్వించేవారు.. కానీ.. ఇప్పుడు మీరు రోజులో ఎక్కువ సేపు ఆఫీస్ వర్క్ లేదా ఫోన్ ని మాత్రమే చూస్తూ సమయం గడిపేస్తున్నారు..
నన్ను ఇంత దూరం పెట్టడానికి కారణమేంటి..? నాలో నేను ఏదైనా మార్చుకోవాలి అంటే మార్చుకుంటా..” అంటూ ఆ భార్య చెప్పడం ఆపింది. దానికి ఆ భర్త ఒక చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాడు. ఇది సహజం గా అందరి కుటుంబాల్లోనూ జరిగేదేనని వివరించాడు. చిన్నప్పుడు తన అంకుల్ తనకు చెప్పిన ఉదాహరణను తన భార్య కి కూడా చెప్పాడు. “ఇప్పుడు మనం ఏదైనా బంగారం కొన్నాము అనుకో.. దానిని కొంతకాలం మాత్రం అపురూపం గా చూస్తాం. అందరికి చూపించుకుని మురిసిపోతాం. తరువాత బీరువాలో లాకర్ లో పెట్టుకుంటాం..
అంతే తప్ప.. అస్తమానం దానిని తీసి చూస్తూ కూర్చోలేము కదా..” అంటూ ఆ భర్త వివరించాడు. అతను ఈ మాటలు చెప్పగానే.. ఆ భార్య గలగలా నవ్వింది. ఆమె ఎందుకు నవ్వుతోందో భర్తకి అర్ధం కాలేదు.. నవ్వడం ఆపి.. ఆ భార్య ఇలా చెప్పింది.. ” చాలా బాగా కంపేర్ చేస్తున్నారు. కనీసం నన్ను ఎదో ఒక వస్తువు తో పోల్చకుండా బంగారం తో పోల్చినందుకు సంతోషం. అది వస్తువు.. కానీ..నేను మనిషిని. నన్ను కూడా లాకర్ లో పెట్టి ఎలా ఉంచుకుంటారు..? అని ప్రశ్నించింది. ఆమె భర్త ఆలోచనలో పడ్డాడు.
ఆమె చెప్పడం కొనసాగించింది. “ఇప్పుడు ఒక మొక్క ఉంది అనుకోండి. దానిని తీసుకొచ్చి నాలుగు రోజులు మురిసిపోయి, తిరిగి లాకర్ లో పెట్టుకోవడం కుదురుతుందా..? లాకర్ లో పెడితే అది వాడిపోతుంది. దానికి రోజు నీళ్లు పోసి.. ఎండా తగిలే ప్రదేశం లో ఉంచి.. రోజు పట్టించుకుంటేనే అది పెరుగుతుంది.. అని చెప్పుకొచ్చింది. అయినా బంగారాన్ని ఉంచుకుంటాం.. మొక్కలని పెంచుకుంటాం.. ఈ ఒక్క వాక్యం లోనే తేడాని అర్ధం చేసుకోవచ్చు.
మనుషులు కూడా అంతే అండి.. వారితో బంధాన్ని ప్రేమానురాగాలతో పెంచుకోవాలె కానీ బొమ్మల్లా ఇంట్లో ఉంచుకోకూడదు..” అంటూ చెప్పడం ఆగింది. ఆమె ఏమి చెప్పదల్చుకుందో అర్ధం చేసుకున్న ఆ భర్త.. ఆమె వైపు చూసి ప్రేమ గా నవ్వాడు.. గతం లో అతను నవ్వే జీవం లేని నవ్వుకి.. ఇప్పుడు ఆమె వైపు కురిపిస్తున్న ప్రేమతో కూడిన నవ్వులకు ఉన్న తేడాను ఆమె స్పష్టం గా గుర్తించింది. సంతృప్తిగా అతని గుండెలపై వాలింది.
NOTE: All the images used are for representative purpose only
End of Article