సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో వెండితెరకి మరికొన్ని అందాల రంగులు అద్దే బాధ్యత హీరోయిన్ మీదే ఉంటుంది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు.
తెలుగు తెర మీద ఆ గ్లామర్ మోతాదు ఇంకొంచెం ఎక్కువే అని చెప్పుకోవచ్చు. కానీ రొమాంటిక్ సన్నివేశాల కు, ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూ వెండి తెర మీద తన మార్క్ నటనతో కొనసాగిన కథానాయికలను వేళ్ళ మీద లెక్కించొచ్చు.
సావిత్రిగారు, వాణి శ్రీ గారు, సౌందర్య గారి పేర్లు మాత్రమే ఆ కోవలోకి వచ్చే హీరోయిన్లు గా తెలుగు ప్రేక్షకులు గుర్తిస్తారు. కానీ ఇపుడు ఆ జాబితాలోకి మరొక పేరు కూడా చేరుస్తున్నారు. తెలుగు సినీ అభిమానులు. ఆమె మరెవరో కాదు మన మలార్ టీచర్ సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాలో మలర్ టీచర్ గా తన అద్భుత నటనతో మొదటి సినిమాకే “బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా” ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది సాయి పల్లవి. అక్కడి నుండి ఆమె కెరీర్ మొత్తం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంది. మిగిలిన హీరోయిన్ లు అంతా ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే చందాన ఫామ్ లో ఉన్నప్పుడే నాలుగు పెద్ద సినిమా లలో, గ్లామర్ ఒలకబోసి తమ కెరీర్ కి బలమైన పునాదులు వేసుకోవాలని చూస్తుంటే ఈమె మాత్రం సినిమాలో తన పాత్ర నచ్చితేనే చేస్తుంది.
తన పాత్ర ప్రాధాన్యం లేకపోతే ఎంత పెద్ద సినిమా అయిన తిరస్కరిస్తుంది. తెలుగులో తాను నటించిన మొదటి సినిమా ‘ఫిదా’ లో సినిమా చూసి వెళ్లిన ప్రతి ఒక్కరికి భానుమతి క్యారెక్టర్ గుర్తుండిపోయేలా నటించింది. తర్వాత ధనుష్ మారి 2 లో కూడా ఆమె నటన కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో “రౌడీ బేబి” పాట యూ ట్యూబ్ లో సౌత్ లో అత్యధిక మంది చూసిన వీడియో సాంగ్ గా రికార్డ్ సృష్టించింది అంటే ఆ పాటలో ధనుష్ తో ఆమె చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కారణమని చెప్పుకోవచ్చు.
తర్వాత ఆమె నటించిన కొన్ని సినిమాలు అపజయం పొందినప్పటికీ, నటి గా ఆమె స్ధాయిని మరొక మెట్టు ఎక్కిస్తూనే ఉన్నాయి. తమిళ్ సూపర్ హిట్ మూవీ “వేదాళం” తెలుగు లో చిరు హీరోగా “భోళా శంకర్ “గా రాబోతుంది. ఈ సినిమాలో చిరు చెల్లిగా నటించే అవకాశాన్ని సాయి పల్లవి తిరస్కరించినట్టు చిరంజీవే స్టేజ్ పై చెప్పడం, ఆమె పక్కన హీరో గా నటించాలని ఉంది అని చెప్పడం హీరోయిన్ గా ఆమె ఏ స్ధాయిలో ఉందో చెప్పడానికి నిదర్శనాలు. అదే ఫంక్షన్ లో చిరు లాంటి గ్రేట్ డాన్సర్ ఆమె డాన్స్ కి నేను అభిమానిని, ఆమె డాన్స్ చేస్తుంటే, నేను హీరోని కూడా చూడలేదు. ఆమెనే చూస్తూ ఉండిపోయాను, అని చెప్పారు అంటే.. ఆమె డాన్స్ కి సాధారణ ప్రేక్షకుడు సైతం మైమరచిపోకుండా ఉండగలడా??
లెక్కల మాస్టర్ సుకుమార్ కూడా ఆమె గురించి మాట్లాడే సందర్భంలో, మీరు ‘లేడీ పవర్ స్టార్’ అని సంభోదించాడు అంటే ఆమె క్రేజ్ ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎలాంటి గ్లామర్ సన్నివేశాలు చేయకుండా, స్కిన్ షోకి ఆస్కారం ఇవ్వకుండా ఒక హీరోయిన్ కేవలం నటన, డాన్స్ తో అంత క్రేజ్ సంపాదించింది అంటే అది సాధారణ విషయం కాదు. అందకె ‘ఫిదా’ సినిమా లో ఆమె చెప్పినట్లు “సాయి పల్లవి మాములు అమ్మాయి కాదు, హై బ్రీడ్ పిల్ల, ఒక్కటే పీస్”,అంటున్నారు ఆమె అభిమానులు..