యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత చాలా కాలం పాటు పరాజయాల తో ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ‘టెంపర్’ నుంచి హిట్ ట్రాక్ ఎక్కి వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. ఇక, ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.
వరుస ప్లాపులతో సతమతమవుతున్న టైంలో ‘టెంపర్’ చిత్రం ఎన్టీఆర్ కి లైఫ్ ఇచ్చింది అని చెప్పాలి. ఆ చిత్రంలో దయ అనే పాత్రలో నట విశ్వరూపం చూపించాడు ఎన్టీఆర్. దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ చిత్రాన్ని తెరకెక్కించిన విధానానికి కూడా క్లాప్స్ కొట్టకుండా ఉండలేము. కోర్టు ఎపిసోడ్, ఎయిర్ పోర్ట్ సీన్, పోలీస్ స్టేషన్ ఫైట్ అన్నీ అద్భుతంగా ఉంటాయి ఈ చిత్రం లో. వక్కంతం వంశి దీనికి కథను అందించగా.. బండ్ల గణేష్ నిర్మించారు.
అయితే ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను డైరెక్టర్ మెహర్ రమేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. “గతంలో రవితేజతో నేను రెండు సినిమాలు చేయాల్సి ఉంది. మొదట ఓకె అనుకున్నా.. కానీ తర్వాత ఆయనకు స్క్రిప్ట్ నచ్చక వదిలేశారు. అందులో ‘టెంపర్’ ఒకటి. ‘పవర్’ అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నాను. టైటిల్ పోస్టర్ తో అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాము. ‘షాడో’ తర్వాత చేయాల్సిన మూవీ అది కానీ చేయలేకపోయాను. తర్వాత ‘టెంపర్’ ఎన్టీఆర్ – పూరి చేశారు. ‘పవర్’ టైటిల్ తర్వాత రవి తేజ గారి మరో చిత్రానికి వాడుకున్నారు.” అని చెప్పి షాక్ ఇచ్చాడు మెహర్ రమేష్.
ప్రస్తుతం మెహర్ రమేష్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ సెట్స్ పై ఉంది. తమిళంలో అజిత్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘వేదాలం’ కి ఇది రీమేక్. చిరు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరుకి చెల్లెలిగా కనిపించనుంది.