కేజీఎఫ్‌తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో, ప్రభాస్ హీరోగా రానున్న సలార్ మూవీ రెగ్యులర్ అప్డేట్స్ తో సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. ప్రభాస్ ఆరడుగల హీరోయిజాన్ని.. అంతటి విలనిజంతో ఢీకొట్టేందుకు మళయాల హీరోను రంగంలోకి దించారు. మళయాల లవర్ బాయ్‌గా చెప్పుకునే హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సలార్ లో విలన్ రోల్లో భయపెట్టనున్నాడు.
ఆదివారం పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా, సలార్‌లోని ఆయన ఫస్ట్‌లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఒంటినిండా మసి, మెడలో కడియాలు, ముక్కుకు పోగు తో పృథ్వీ భయంకరంగా ఉన్నారు. వరద రాజ మన్నార్ అనే పాత్రలో పృథ్వీరాజ్ భయపెట్టనున్నారని సినీ యూనిట్ తెలిపింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ..”ప్రభాస్-పృథ్వీ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ పాత్రకు పృథ్వీ రాజ్ తప్ప ఎవ్వరు న్యాయం చేయలేరు.” అని అన్నారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే పృథ్వీరాజ్ విలనిజం పీక్స్‌లో ఉండబోతుందని అర్థమవుతుంది.
అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ జగపతిబాబు కొడుకు పాత్రలో కనిపించబోతున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ఇది వరకే విడుదల చేసిన జగపతిబాబు పోస్టర్లో ఆయన పాత్ర పేరు రాజమన్నార్‌గా రివీల్ అయిన సంగతి తెలిసిందే. అంటే ఆయన కొడుకు లేదా సోదరుడి పాత్రలో కరుడుగట్టిన ప్రతినాయకుడి గా పృథ్వీరాజ్ పాత్ర ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. కె.జి.యఫ్, కాంతార వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కె.జి.యఫ్తో పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్స్ దుమ్ము దులిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో సలార్‌పై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.