ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ఆశయంతో ముందుకు వెళితే ఎవరైనా విజయం సాధించగలరు. యానీ శివ జీవితం కూడా అంతే ఎన్నో అవరోధాలను దాటుకుని కేరళలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయ్యారు. అయితే ఆమె పదేళ్ళ క్రితం ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు వంటివి అమ్మేవారు.
ఆమెకి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇంటి నుండి పారిపోయి ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. కానీ రెండేళ్ల తర్వాత కొడుకు పుట్టడం..తర్వాత తన భర్త ఇద్దరిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆమె తన ఆరునెలల కొడుకు శివ సూర్యతో ఒంటరిగా పోరాటమే చేసింది.
ఆమె కుటుంబం తిరిగి ఆమెని అనుమతించ లేదు. కానీ ఆమె అమ్మమ్మ ఆమె రావడానికి ఒప్పుకున్నారు. ఆమె తో ఉండడానికి కూడా ఆమె సరే అన్నారు. అప్పటినుండి కూడా చాలా రకాల ఉద్యోగాలు ఆమె చేస్తుండేది. మొదట ఆమె సబ్బులు, డిటర్జెంట్ పౌడర్లు ఇంటింటికి వెళ్లి అమ్మేవారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఏజెంట్ కింద ఆమె పనిచేశారు.
బండిమీద ఇంటింటికి వెళ్లి కూరగాయల్ని కూడా ఈమె అమ్మేవారు. ఇలా తనకోసం తన కొడుకు కోసం ఎన్నో పనులు చేశారు. కొన్ని కొన్ని రోజులు అయితే ఆమె ఒక పూట తినేవారు. తన కొడుకు ఆకలితో ఎన్నోసార్లు ఏడ్చాడు కూడా. ఇలా పని చేసుకుంటూ ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత కేరళ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఆమె చేరడం.. పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2016 లో ఆమె పాస్ అవడం.. సర్వీస్ లో జాయిన్ అవ్వడం జరిగింది.
ఆ తర్వాత ఆఫీసర్ పరీక్షని 2019 లో రాసి అందులో కూడా విజయం సాధించారు. ఒకటిన్నర సంవత్సరాల పాటు ట్రైనింగ్ అయిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయ్యారు. తన కుటుంబం ఎప్పుడూ కూడా ఐపీఎస్ ఆఫీసర్ కింద ఆమెను చూడాలనుకున్నారు అని ఆమె అన్నారు.
ఏది ఏమైనా ఆమె పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. జూన్ 25, 2021 లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఆమె నియమితులయ్యారు. పదేళ్లక్రితం ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు వంటివి అమ్మిన అదే చోట ఇప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను అని ఆమె ఎంతో ఆనందపడ్డారు. ఇటువంటి వాళ్లు నిజంగా ఎందరికో ఆదర్శం.