హెచ్ఐవి ఎయిడ్స్ అనంగానే అందరిలో ఏదో ఒక రకమైన భావన మొదలవుతుంది. వారికి సహాయం అందించడానికి ఎక్కడో కొంత మంది తప్ప, ఎక్కువగా ఎవరూ ముందుకు రారు. అలా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు తన వంతు సహాయం అందించారు అక్సా. ఈనాడు వసుంధర కథనం ప్రకారం అక్సా పిఠాపురంకి చెందినవారు. తండ్రి నాటకాల్లో మేకప్ మాన్. తల్లి గృహిణి.
అక్సా డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు ఊరిలో స్వరాజ్య అభ్యుదయ సేవ సమితి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు సహాయం అందిస్తుంది. అక్సా కూడా ఈ సంస్థలో వాలంటీర్ గా చేరారు. చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో హెచ్ఐవి బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చేవారు. రోగులని ఆసుపత్రికి తీసుకెళ్లేవారు. ఆర్థిక సహాయం కూడా అందించేవారు.
అదే సంస్థలో పనిచేసే అమీర్ పాషా ని ఇష్టపడి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు అక్సా. అమీర్ పండ్ల వ్యాపారం చేస్తారు. వీరిద్దరూ పారా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేస్తున్నారు. వీరికిి ఇద్దరు కూతుళ్లు. హెచ్ఐవి ప్రచారం కోసం, బాధితులకు అవగాహన కల్పించడం కోసం అక్సా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మొదట్లో వాళ్ళు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తే చాలా మంది వద్దు అన్నారు. కానీ తర్వాత అక్సా వారికి నచ్చ చెప్పారు.
లాక్డౌన్ సమయంలో అక్సా సేవలు మరింత విస్తృతం అయ్యాయి. ఉపాధి కోల్పోయిన వారు, సొంత వారు కాదు అంటే రోడ్డున పడ్డ వారు, కరోనా పాజిటివ్ రావడంతో ఇంట్లో నుండి బయటకు వచ్చిన వారు, అంతిమ సంస్కారం చేసేవారు లేకపోవడంతో వదిలేసిన కోవిడ్ మృతదేహాలు ఇవన్నీ అక్సాని కదిలించాయి. దాంతో వారందరికీ తనవంతు సాయం చేద్దామని అనుకున్నారు.
భర్తతో కలిసి మొదటిదశలో హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ, భోజనం కోసం ఇబ్బంది పడుతున్న వారికి, యాచకులకి, వలస కూలీలకి ఆహారాన్ని వండుకొని తీసుకెళ్లి అందించారు. రెడ్ జోన్ లో ఉన్న వారికి మందులను, అలాగే అవసరమైన సామాగ్రిని కూడా అందించారు. అలా సుమారు 9000 మందికి తమ భోజన సహాయాన్ని అందించారు.
దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రాజమహేంద్రవరం చుట్టుపక్కల గ్రామాల్లో వారికి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. ఒంటరి వృద్ధులను వైద్య పరీక్షలకు తీసుకెళ్లడం చేశారు. కరోనా రెండవ దశలో ఆరు ఆక్సిజన్ సిలిండర్ లను ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ దొరక్క ఇబ్బంది పడుతున్న పేషంట్లకి అందజేశారు.
అక్సా సేవా కార్యక్రమాలను చూసి ఎంతో మంది బంధువులు ఆర్థిక సహాయాన్ని అందించగా, ఇంకా కొంత మంది అక్సాని స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం వారి బృందంలో 20 మంది ఉన్నారు. ఆమిర్ కూడా కరోనాతో మరణించిన వందల మందికి ఆయన బృందంతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.