ఆ బస్సు డ్రైవర్ తో మాట్లాడిన తర్వాతే నాకు అర్ధమైంది…త‌క్కువ అంచ‌నా వేసి తప్పు చేశా?

ఆ బస్సు డ్రైవర్ తో మాట్లాడిన తర్వాతే నాకు అర్ధమైంది…త‌క్కువ అంచ‌నా వేసి తప్పు చేశా?

by Mohana Priya

Ads

ఏదైనా జడ్జ్ చేయాలంటే జడ్జ్ అవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఒక మనిషిని జడ్జ్ చేయడంలో అయితే అందరికీ చాలా అనుభవం ఉంటుంది. ఒక మనిషి సైలెంట్ గా ఉంటే చాలా మంచి వ్యక్తి, తన పని తాను చేసుకుంటున్నాడు అనుకుంటాం. అదే ఒక మనిషి వచ్చి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే అన్ని విషయాలు వాళ్లకే కావాలి అనుకుంటాం.

Video Advertisement

అవతల వ్యక్తి నీట్ గా డ్రస్ చేసుకుని ఉంటే చదువుకున్న వాడు అని, ఇస్త్రీ లేని చిరిగిన బట్టలు వేసుకుంటే చదువు లేని వాడు అని అంచనా వేసేస్తాం. ఇంక ఆడవాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.

ఒక అమ్మాయి డ్రెస్ సెన్స్ చూసి ఒకవేళ తను పద్ధతిగా రెడీ అయి ఉంటే చాలా మంచి అమ్మాయి అని, మోడ్రన్ గా రెడీ అయి ఉంటే చెడు అలవాట్లు ఉన్న అమ్మాయి అని, అబ్బాయి తో మాట్లాడితే బుద్ధి లేదు అని, మాట్లాడకపోతే చాలా మంచి పద్ధతి కల అమ్మాయి అని ముద్ర వేస్తుంది ఈ సమాజం.

ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా దేనినైనా మార్చే శక్తి మీడియాకి ఉంది. అందులో ముఖ్యంగా సినిమాలకి, సీరియల్స్ కి. కాబట్టి ఒక మనిషి ధరించే దుస్తులను చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పడం తప్పు అనే విషయాన్ని కూడా జనాల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కొంతవరకైనా వీటిలో ఉంది. కానీ అది జరగడం లేదు.

 

ముఖ్యంగా సీరియల్స్ లో అయితే హీరోయిన్ క్యారెక్టర్ పోషించే నటిని లంగా వోణి లలో, చీర లలో, లేదా చుడీదార్ లో చూపిస్తారు. అదే సీరియల్స్ లో నెగిటివ్ పాత్ర పోషించే నటిని మోడ్రన్ దుస్తులలో చూపిస్తారు. పాత సీరియల్స్ అంటే సరే. ఇప్పుడు కూడా ఇదే పద్ధతి కంటిన్యూ అవుతోంది.

వాటి సంగతి పక్కన పెడితే. ఇలాగే ఒక వ్యక్తి ఒక మనిషి ని చూసి తను ఎలాంటి వాడు అనేది డిసైడ్ చేశాడు. దాని గురించి అతను ఈ విధంగా చెప్పాడు. ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

“పొద్దున్నే లేచి రెడీ అయ్యి కాలేజ్ కి బయలుదేరాను. బస్ స్టాప్ లో బస్ ఎక్కాను. ఇంకో పావుగంటలో నేను దిగబోయే స్టాప్ వచ్చేస్తుంది. ఇంకో పావుగంటలో దిగుతా కదా. మళ్లీ వెనక్కి వెళ్లి కూర్చోడం ఎందుకులే అని అలాగే డ్రైవర్ పక్కన నిలబడ్డాను.

డ్రైవర్ బట్టలు మాసిపోయి అక్కడక్కడా చిన్న చిరుగులు కూడా ఉన్నాయి. గడ్డం, జుట్టు కూడా కొంచెం నెరిసిపోయింది. పక్కనే ఒక స్టీలు క్యారియర్, గోతం చుట్టి ఉన్న ఒక పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ లో నీళ్ళు నింపి ఉన్నాయి. చూస్తే ఆర్థికంగా నిలదొక్కుకోలేదేమో అనిపించింది.

నేను నా ముందు ఉన్న గ్లాస్ నుండి బయటికి చూస్తూ ఫోన్ లో పాటలు వింటూ నిల్చున్నాను. అప్పుడు సడన్ గా డ్రైవర్ నా వైపు తిరిగినట్టు అనిపించి నా కుడి వైపు తల తిప్పాను. చూస్తే ఆ డ్రైవర్ నన్ను ఏదో అడిగినట్టు నా సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టు నా వైపు చూస్తున్నాడు.

నేను ఇయర్ ఫోన్స్ తీసి ” ఏమైనా అడిగారా?” అని అడిగాను. దానికి డ్రైవర్ ” ఏ కాలేజ్ లో చదువుతున్నావు?” అని అడిగాడు. నేను చదివే కాలేజ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న టాప్ కాలేజ్ లలో ఒకటి. అందుకే గర్వంగా నా కాలేజ్ పేరు ఆ డ్రైవర్ కి చెప్పాను. “ఏ బ్రాంచ్?” అని అడిగాడు. సమాధానం చెప్పాను.

ఇంటర్ లో ఎంత పర్సంటేజ్ వచ్చింది అని అడిగాడు. 96% అని చెప్పాను. దానికి అతను ” మరి ఐఐటీ-జేఈఈ కి అప్లై చేయలేకపోయావా? అందులో అయితే జాబ్ రిక్రూట్మెంట్ కూడా బాగుంటుంది కదా?” అని అడిగాడు.

అతను అడిగిన ఆ ప్రశ్నకి నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అసలు అతనికి ఐఐటీ-జేఈఈ గురించి ఎలా తెలుసు అనే విషయం దగ్గరే నా మైండ్ ఆగిపోయింది. అది తెలుసుకుందామని క్యూరియాసిటీ తో “అసలు మీకు ఇవన్నీ ఎలా తెలుసు?” అని అడిగాను.

దానికి ఆ డ్రైవర్ “నా కూతురు ఐఐటీలో చదువుకుంది. ప్రస్తుతం యూఎస్ లో ఉద్యోగం చేస్తోంది. నా కొడుకు ఎన్ ఐ టి లో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు” అని చెప్పాడు. ఇంక నేను దిగే స్టాప్ రావడంతో ” అంకుల్! నా స్టాప్ వచ్చింది మళ్లీ కలిసినప్పుడు మాట్లాడుతాను” అని చెప్పి దిగేసాను. కానీ నా ఆశ్చర్యం మాత్రం దాదాపు ఆరోజు మొత్తం అలాగే ఉంది”.

ఇదంతా చదివిన మీకు కూడా ఒక మనిషి కనిపించే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వారు అనేది నిర్ణయించకూడదు అనే విషయం మళ్ళీ ఒకసారి రుజువు అయ్యుంటుంది. దాంతో పాటు ఇంకో విషయం కూడా ఈ కథ ద్వారా మనకి తెలిసింది. అదేంటంటే.

ఆ డ్రైవర్ ఉద్యోగం చేసేది ఆర్థిక ఇబ్బందుల వల్ల కాదు, లేదా వేరే ఉద్యోగం దొరక్క కాదు. ఆ  ఉద్యోగం అంటే ఆయనకు గౌరవం ఇంకా ఇష్టం కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా, తన పిల్లలు అంత స్థాయికి వచ్చినా కూడా అదే ఉద్యోగాన్ని చేస్తున్నారు.

మనలో చాలా మంది లేదా మన చుట్టుపక్కల చాలా మంది ఎన్నో సంవత్సరాలైనా కూడా ఉద్యోగం కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏదో ఒక ఉద్యోగం లో చేరమని ఎంత మంది సలహా ఇచ్చినా కూడా వినరు. దాని అర్థం వాళ్లు మొండి వాళ్లని, లేదా వాళ్లకి గర్వం ఎక్కువ అని కాదు.

వాళ్లకి ఒక ఆశయం అనేది ఉంది అని, వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం ఎన్ని సంవత్సరాలైనా ఓపికగా కష్టపడతారు అని, వాళ్లకి ఏది సూట్ అవుతుంది అనే విషయంపై వారికి స్పష్టత ఉంది అని, అందుకే ఇతర విషయాలపై దృష్టి మళ్లించకుండా వాళ్లకి ఏం కావాలో దాని కోసం కష్టపడి సాధిస్తారు అని అర్థం.

ఇదంతా ఒక రోజు ఖచ్చితంగా రుజువు అవుతుంది. అందుకే అలా కష్టపడే వాళ్ళు ఎప్పుడూ ఎవరికీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వరు. కానీ జనాలు దాన్నే పొగరు, గర్వం అని ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తారు.  కాబట్టి ఏ కోణం నుండి అయినా అవతల వ్యక్తి గురించి మనకి పూర్తిగా తెలియకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అంచనా వేయడం, అలా మనం అంచనా వేసిన ప్రకారం ఆ వ్యక్తితో వ్యవహరించడం అనేది సరైనది కాదు.

రోజు ఇస్త్రీ బట్టలు వేసుకుని వ్యక్తి, ఆ రోజు ఇస్త్రీ చేసిన బట్టలు లేక మామూలు బట్టలు వేసుకొని రావచ్చు. అలాగే రోజు ఇస్త్రీ లేని బట్టలు వేసుకుని వ్యక్తి ఆరోజు ఎందుకో ఇస్త్రీ బట్టలతో రావచ్చు. అలా ప్రతి మనిషి వెనుక మనకు తెలియని ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి ఈసారి నుండి ఎవరి గురించి అయినా ఒక అంచనాకి వచ్చే ముందు లేదా ఎవరితోనైనా మాట్లాడే ముందు డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుందాం.


End of Article

You may also like