కుటుంబ కలహాలతో ఒక రైతు ఆ-త్మ-హ-త్య చేసుకుని అపస్మారక స్థితిలో ఉంటే ఆ వ్యక్తిని రెండు కిలోమీటర్లు పొలం గట్లపై తన భుజాలు మూసుకుంటూ వెళ్లి ఆసుపత్రిలో చేర్చి అతని ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు పొందుతున్నాడు ఒక కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ బాధ్యతకి, డెడికేషన్ కి ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, భేతిగల్ కి చెందిన కుర్ర సురేష్ బుధవారం ఇంట్లో గొడవపడి కోపంగా పొలం వద్దకు వచ్చి పురుగుల మందు తాగాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వగా బ్లూ కోల్డ్స్ కానిస్టేబుల్ జయపాల్, హోమ్ గార్డ్ కిన్నెర సంపత్ లు అక్కడికి చేరుకున్నారు. అయితే సమయస్ఫూర్తిగా వ్యవహరించి అపస్మారక స్థితిలో పడి ఉన్న సురేష్ ని జయపాల్ భుజాన వేసుకొని ఏకంగా రెండు కిలోమీటర్ల వరకు పొలాల గట్ల మీద మోసుకుంటూ వచ్చారు.
అనంతరం కుటుంబ సభ్యుల సహాయంతో జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రమించి రైతు ప్రమాణాలు కాపాడిన బ్లూ కోల్డ్స్ కానిస్టేబుల్, ఇతర సిబ్బందిని ఎస్ఐ వంశీకృష్ణ, స్థానిక నేతలు అభినందించారు. ఇంకా ఇలాంటి డెడికేషన్ ఉన్న ఉద్యోగులు ఉన్నారు కాబట్టే ఆయా వ్యవస్థలని ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు.
చెయ్యి తడవకపోతే పని జరగని ఈ రోజుల్లో, ఆ పని చేస్తే మాకు ఏంటి లాభం అని ఆలోచించే ఉద్యోగులు ఉన్న సమాజంలో ఇలాంటి ఉద్యోగులని చూస్తే నిజంగా సమాజం మీద, మనుషుల మీద నమ్మకం ఏర్పడుతుంది. ఏమాత్రం ఫలితం ఆశించకుండా సమయం స్ఫూర్తిగా వ్యవహరించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన జయపాల్ లాంటి ఉద్యోగులు పలువురు ఉద్యోగులకి ఆదర్శం అంటూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. హ్యాట్సాఫ్ టు జయపాల్