కుంభకర్ణుడు అన్న పేరు వినగానే.. మనకు గుర్తుకు వచ్చేది అతినిద్ర. ఎవరైనా ఎక్కువ గా నిద్రపోతున్న సరే.. వాళ్ళను కుంభకర్ణుడు తో పోలుస్తూ ఉంటారు. కుంభకర్ణుడు ఏడాది లో ఆరు నెలల పాటు నిద్రపోతు ఉంటారట. ఆయన ఆరునెలలకు సరిపడా ఆహారాన్ని తీసుకుని నిద్రపోతారట. అసలు కుంభకర్ణుడు ఎందుకు అన్ని నెలల పాటు నిద్రపోతాడో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రహ్మను మెప్పించడం కోసం.. సోదరులు, కైకసి పుత్రులు అయిన రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు పదివేల సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశారట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం లో తమ తపస్సులు చేసారు. రావణుడు ప్రతి వేయి సంవత్సరాలకు ఒకసారి తపస్సు పూర్తి అయ్యాక.. తన ఒక్కొక్క తలని పూర్ణాహుతి కావిస్తూ వచ్చాడట. అలా.. పదివేల సంవత్సరం పూర్తి కాగానే, పదవ తలని కూడా ఆహుతి చేయబోతున్న సమయం లో బ్రహ్మ ప్రత్యక్షం అయి వరం కోరుకోమన్నాడు.

అయితే, తనకు చావు లేకుండా వరం ఇవ్వాలని కోరుకున్నాడు. అయితే, బ్రహ్మ అది సాధ్యపడదని..మరేదైనా వరం కోరుకోవాలని సూచించాడు. దానికిగాను, మానవులు నిమిత్త మాత్రులేగాని దేవతల చేతిలో మరణం లేకుండా వరం కావాలన్నాడు రావణుడు. అందుకు బ్రహ్మ కూడా సరే అన్నాడు. అందుకే రావణుడు మానవరూపం లో ఉన్న శ్రీరాముని వలన మరణం వచ్చింది.

మరో వైపు.. విభీషణుడేమో.. తాను ఎంత కష్టకాలం లో ఉన్నా ధర్మాన్ని వీడకుండా ఉండేలా వరం కావాలని కోరుకున్నాడు. వీరిద్దరూ ఇలా ఉంటె.. కుంభకర్ణుడు కూడా ఎండాకాలం అగ్నిలోను, శిశిర ఋతువులో నీటి మధ్యలోను నిలబడి ఘోర తపస్సు చేసాడు. అయితే, అతనికి వరమివ్వడానికి దేవతలు ఒప్పుకోరు. ఈ సమయం లో సరస్వతిని అతని నాలుకపై కి పంపి వరం కోరుకోమని బ్రహ్మ అడుగుతాడు. సరస్వతి దేవి ప్రభావం వలన అతను నిర్దయ కోరబోయి తనకు నిద్దర కావాలని కోరాడట. బ్రహ్మ కూడా అందుకు తధాస్తు అన్నాడు. అందుకే కుంభకర్ణుడి అంతలా నిద్ర వస్తూ ఉంటుంది.

ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసారు. కానీ, వారి బుద్ధి మేరకే వారికి వరాలు లభించాయి. రావణుడు తాను చిరంజీవి గా మిగలాలని కోరుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. విభీషణుడు తాను కోరుకోకపోయినా చిరంజీవిగా మిగిలాడు. కుంభకర్ణుడు మాత్రం నిద్రపోతూనే ఉన్నాడు. చివరకు మరణించాడు.










