రోజు రోజుకి కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొనాలంటే కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. కూరగాయలు కొనడానికి సాధారణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాటి ధరలు అంతగా పెరిగాయి. అంత ధర పెట్టి తీసుకొచ్చిన కూరగాయలు ఒక్క పూటకి వస్తాయి. దాంతో రోజు ఎంత ఖర్చు పెట్టి తినాలి అంటూ అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. టమాటా రేటు కేజీ 60 రూపాయలు ఉంది అని సమాచారం. రైతు బజార్ లో 30కి పైగా ఉంటుంది. పచ్చిమిర్చి ధర 50 రూపాయలు, కేజీ బెండకాయల ధర 45 రూపాయలు, చిక్కుడుకాయల ధర 85 రూపాయలు, కాకరకాయల ధర 55 రూపాయలు ఉంటున్నాయి.
బీన్స్ అయితే అన్నిటికంటే ఎక్కువ ధర పలుకుతోంది. కిలో 200 రూపాయలకి బీన్స్ ధర చేరింది. రైతు బజార్లలో 155 రూపాయలకి ఉంది. కట్ట కొత్తిమీర కూడా 10 రూపాయల వరకు పలుకుతోంది. మామూలుగా అయితే హైదరాబాద్ లో ఉన్న హోల్ సేల్ మార్కెట్లకి ఒక రోజులో 5000 క్వింటాళ్లలో కూరగాయలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వేసవి కాలం అవ్వడంతో అంత ఎక్కువగా కూరగాయలు రావట్లేదు. రోజుకి 2800 టన్నుల కూరగాయలు వస్తున్నాయి. కూరగాయల ధరలు తగ్గాలి అంటే మరొక 3300 టన్నుల కూరగాయలు అదనంగా రావాలి. కానీ అలా జరగట్లేదు. అందుకే కూరగాయల ధరలు ఇంత ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు అదనంగా కూరగాయలు తీసుకురావడం కూడా జరిగే విషయం కాదు.
వర్షాలు కురిస్తేనే ఎక్కువ కూరగాయలు హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. జూన్ నుండి ఖరీఫ్ మొదలవుతుంది కాబట్టి ఆ తర్వాత కూరగాయలు ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి అని విశ్లేషకులు చెప్తున్నారు. కూరగాయలు మాత్రమే కాదు. చికెన్ ధర కూడా వేసవి కాలంలో ఎక్కువగా ఉంది. ఇప్పుడు చికెన్ ధర కేజీ 300 రూపాయలు దాటింది. ఎండలు ఎక్కువగా ఉండడంతో బ్రాయిలర్ కోళ్లు ఎక్కువ కాలం ఉండట్లేదు, ఎక్కువ దాణా తీసుకోకపోవడం వల్ల కోళ్లు బరువు పెరగట్లేదు. అందుకే చికెన్ ధరలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. స్కిన్ తీసేసిన చికెన్ ధర అయితే కేజీ 320 కి పైగా ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే సామాన్య ప్రజలు కూరగాయలు కొనాలి అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు.