డబ్బుని దాచుకోవడానికి బంగారం కొనడం కూడా ఓ మార్గమే. మహిళలు కొత్త ఆభరణాలు ధరించడం కోసం బంగారం కొనాలి అనుకుంటూ ఉంటారు. బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది. బంగారం కొని పెట్టుకున్నాం అంటే.. డబ్బుని దాచుకున్నట్లే. అయితే.. బంగారం కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం కొంటున్న ఆభరణాలు ఒరిజినల్ వేనా? నకిలీవా? అన్న సందేహం కలుగుతూనే ఉంటుంది.
అంత ఖరీదు పెట్టి బంగారం కొనుక్కుంటున్నపుడు మోసపోతే చాలా నష్టం జరుగుతుంది. అందుకే కొనేముందు జాగ్రత్త పడాలి. మనం కొనే బంగారం స్వచ్ఛమైనదా? కాదా? అని ఎలా తెలుసుకోవాలి..? ప్రజలకు ఈ సందేహాలు ఉండకూడదనే ప్రభుత్వము హాల్ మార్కింగ్ ను తప్పనిసరి చేసింది. మనం కొనే బంగారం పై తప్పనిసరిగా ఈ మార్క్ లు ఉండాలని ఆదేశించింది. ఇప్పుడు వీటిని ఎలా చూడాలో తెలుసుకుందాం.
BIS మార్క్:
ఈ మార్క్ ను BIS సంస్థే ఇస్తుంది. ఇది బంగారాన్ని టెస్ట్ చేసి స్వచ్ఛతను నిర్ధారించి మార్క్ ను ఇస్తుంది. ఈ ఏజెన్సీ ని ప్రభుత్వమే ఆమోదించింది. ఈ ఏజెన్సీ టెస్ట్ చేసిన బంగారం పై త్రిభుజాకారం లో మార్క్ ఇవ్వబడుతుంది. అందుకే ఎవరైనా బంగారం కొనే ముందు ఈ మార్క్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
క్యారెట్స్:
అలాగే మనం బంగారం కొనే ముందు దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ సమాచారాన్ని ఫైనాన్స్ నెంబర్, క్యారెట్ ల ప్రాతిపదికన ఇస్తారు. ఈ సమాచారం లో ఫైనాన్స్ నెంబర్ తో పాటు, ఆ బంగారం లో ఎన్ని క్యారెట్ లు ఉన్నాయో చెబుతారు. 24 లేదా 18 అనో, 24 లేదా 22 క్యారెట్ అని రాస్తారు.
జ్యువెలరీ ఐడెంటిఫికేషన్ మార్క్:
బంగారం తయారు చేసిన స్వర్ణకారులు ఈ గుర్తుని ఇస్తారు. అయితే.. BIS మార్క్ ఉన్న బంగారానికి మాత్రమే ఈ గుర్తు ఇవ్వబడుతుంది.