ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగితో సమోసాలు అమ్మే కుర్రాడి సంభాషణ ఇది…5 నిముషాలు మాట్లాడే సరికి అతని పరిస్థితి అర్ధమయ్యింది!

ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగితో సమోసాలు అమ్మే కుర్రాడి సంభాషణ ఇది…5 నిముషాలు మాట్లాడే సరికి అతని పరిస్థితి అర్ధమయ్యింది!

by Mohana Priya

ఒక్కొక్కసారి మనిషి చేసే పని కంటే వాళ్ల హోదాకే విలువ ఎక్కువ ఇస్తారు. ఎలాగంటే ఒక మామూలు కిరాణా కొట్టు నడిపే వాళ్ళకంటే 12 గంటలు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి కి విలువ ఎక్కువ ఇస్తారు. అదేవిధంగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే గవర్నమెంట్ ఉద్యోగి అంటే ఎక్కువ గౌరవం ఇస్తారు.

Video Advertisement

ఇలా చేసే పనిని బట్టి మనిషి కి ఇచ్చే విలువ మారిపోతుంది. అలా చేసే పని చూసి మనిషి విలువను అంచనా వేయడం సరైనదేనా? ఒకసారి ఈ సంఘటన వింటే మీకే అర్థమవుతుంది.

ఒకతనికి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అందరికీ ఆ విషయం చెప్పగానే అంత పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడం అంటే చిన్న విషయం కాదు ఇంకా సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే సొసైటీలో గౌరవం ఉంటుంది జాయిన్ అయిన కొత్తలో పని కొంచెం కష్టంగా అనిపించొచ్చు కానీ భవిష్యత్తులో చాలా లగ్జరీ లు ఉంటాయి కాబట్టి ఏమీ ఆలోచించకుండా జాయిన్ అయిపోమని సలహా ఇచ్చారు.అతను కూడా ఆ మాటలు విని నిజమే అనుకొని ఉద్యోగంలో చేరిపోయాడు. కానీ రెండేళ్ల తర్వాత చూసుకుంటే వాళ్లు చెప్పిన వాటిలో ఒక్కటి కూడా నిజం అవ్వలేదు. కానీ అందరికీ తను ఉద్యోగం చేసే కంపెనీ పేరు చెప్తే చాలా గొప్ప కంపెనీ అని, అక్కడ జాబ్ తెచ్చుకున్నాడు అంటే అతను తెలివికలవాడు అని పొగుడుతున్నారు.

దాంతో కనీసం కంపెనీ వల్ల తనకు పేరైనా వస్తోంది అని అదే కంపెనీలో ఉండిపోయాడు. రోజు పొద్దున్నే లేచి తొమ్మిది గంటలకి సిటీ ట్రైన్ లో ఆఫీస్ కి వెళ్లడం మళ్లీ రాత్రికి అదే సిటీ ట్రైన్ లో అలిసిపోయి ఇంటికి రావడం. ఇదే ఆ ఉద్యోగి దినచర్య.ఒకరోజు ఎప్పటిలాగానే ఆఫీస్ పని అయిపోగానే ట్రైన్ ఎక్కాడు. దాదాపు రాత్రి సమయం కావడంతో అలానే పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్లే వాళ్ళు చాలామంది ఆ ట్రైన్ లో ఉన్నారు. ఇతనికి సీటు దొరకడంతో వెళ్ళి కూర్చున్నాడు.

ఉద్యోగి ఎదురుగుండా ఉన్న సీట్ మీద ఇద్దరు కూర్చుని వున్నారు. అందులో దాదాపు తన వయసే ఉన్న ఒక అతని చేతిలో పెద్ద ఖాళీ బుట్ట ఉంది. బుట్టలో నూనె పీల్చి ఉన్న ఒక న్యూస్ పేపర్ ఉంది. అది చూడగానే ఉద్యోగికి అర్థమైపోయింది అతను సమోసా వ్యాపారి అని. ఖాళీగా ఉండటం ఎందుకులే అని ఆ వ్యాపారితో మాట్లాడడం మొదలు పెట్టాడు.

ఉద్యోగి : ఏం తమ్ముడు సమోసాలు అన్ని అమ్మేశావా?

వ్యాపారి: అవును అన్నా.

ఉద్యోగి : బాగా కష్టపడుతున్నట్లు ఉన్నావుగా?

వ్యాపారి : ఏం చేద్దాం అన్నా? ఇల్లు గడవాలంటే తప్పదు కదా?

ఉద్యోగి : అవును అనుకో. ఒక్క సమోసా ఎంతకి అమ్ముతావు?

వ్యాపారి : ముప్పావలా కి అన్నా.

ఉద్యోగి : అవునా. ఒక్కరోజులో అలా ఎన్ని సమోసాలు అమ్ముతావు.

వ్యాపారి : దాదాపు 3000 అమ్ముతా. కొన్నిసార్లు కొనుక్కునేవాళ్లు ఎక్కువమంది ఉండరు. అప్పుడు 2000 దాకా అమ్ముతాను.

ఉద్యోగి (మనసులో) : రోజుకి రెండు వేలు అంటే ఒక్కరోజు కి పదిహేను వందల రూపాయలు. నెలకి 45000. వామ్మో రెండేళ్ల నుండి అంత పెద్ద కంపెనీలో కష్టపడుతున్నా కానీ నా జీతం 15000. ఒక మామూలు సమోసా వ్యాపారి నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడా?

ఉద్యోగి : రోజు మొత్తం కూర్చొని ఇన్ని సమోసాలు తయారు చేయడం అంటే చాలా కష్టం కదా?

వ్యాపారి : అయ్యో నేను తయారు చేయను అన్నా. మాకు ఒక యజమాని ఉన్నాడు ఆయనే ఇవన్నీ  తయారుచేయించి  మాకు ఇస్తాడు. వాటిని అమ్మితే వచ్చే డబ్బులు నేను తీసుకుంటాను.

ఉద్యోగి : ఇది కాకుండా ఇంక వేరే వ్యాపారాలు ఏమైనా చేస్తావా?

వ్యాపారి : ఈ మధ్యనే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మొదలుపెట్టా అన్నా. నేను కూడా మా ఊరిలో ఒక ఇల్లు కొనుక్కున్నా. ఇంటికి దగ్గరలోనే ఒక ఎకరం పొలం కూడా కొని కొంచెం కౌలుకి ఇచ్చి మిగిలినది మేము సాగు చేసుకుంటాము. పొలం కి సంబంధించిన పనులు అన్ని మా నాన్న చూసుకుంటాడు. అమ్మ అంతకుముందు కుట్టు మిషన్ పని చేసేది. ఇప్పుడు ఆపేసింది. చెల్లి పదవ తరగతికి వచ్చింది.

ఉద్యోగి : మరి నువ్వు ఎంత వరకు చదువుకున్నావు?

వ్యాపారి : ఆరవ తరగతి పూర్తిచేశా అన్నా. ఏడవ తరగతి సగంలోనే ఆపేసి పని చేయడం మొదలు పెట్టా.

ఉద్యోగి : నీకు ఎప్పుడు చదువుకుంటే బాగుండేది మంచి ఉద్యోగం వచ్చేది అని అనిపించలేదా?

వ్యాపారి : లేదన్నా.  ఎందుకంటే నేను చదువుకుంటే వచ్చే ఉద్యోగం నా పిల్లలకి ఇవ్వలేను. అదే నేను వ్యాపారం చేసి దీని గురించి అన్ని తెలుసుకుంటే అవే నా పిల్లలకి నేర్పి నా వ్యాపారం వాళ్లకి ఇవ్వగలుగుతాను. ప్రస్తుతం నేను ఈ వ్యాపారంలో బానే నేర్చుకున్నా. డబ్బులు సంపాదించగలను అనే ధైర్యం వచ్చింది. అందుకే ఇంక చదువుకోవాలి అని ఆలోచించలేదు.

అంతలోపు తను దిగాల్సిన స్టేషన్ రావడంతో ఉద్యోగి ట్రైన్ దిగేసాడు. కానీ ఆ వ్యాపారి చెప్పిన మాటలు మాత్రం అతని ఆలోచనల్లో నుండి పోవట్లేదు. “నలిగిపోయిన బట్టలతో చూడడానికి చాలా సాధారణంగా ఉన్నాడు కానీ ఎంత తెలివిగా ఆలోచించాడు. ఏదో నలుగురు మంచి కంపెనీ అని చెప్తే విని ఉద్యోగంలో చేరాను కానీ ఒక్కసారి కూడా ఆ ఉద్యోగం నాకు కరెక్టా కాదా అని ఆలోచించలేదు” అని అనుకున్నాడు.

ఈ సందేశాన్ని కథ రూపంలో చెప్పడం కోసం అవతల వైపు ఉన్న వ్యక్తిని సమోసా వ్యాపారి అని అనుకున్నాం కానీ అతని స్థానంలో వేరే ఎవరైనా ఉండొచ్చు. వారు కూడా అపియరెన్స్ పరంగా ఎలా ఉన్నా కానీ మనకంటే ఎక్కువ సంపాదించే వాళ్లే అయ్యుండొచ్చు.ఎప్పుడైనా ఒక మనిషి కి విలువ ఇవ్వాలి అంటే వాళ్ళ వ్యక్తిత్వం చూసి ఇవ్వాలి అంతే కానీ వాళ్ల ఉద్యోగం చూసి కాదు. ఉద్యోగంలో పెద్దది చిన్నది అని ఏది ఉండదు. ఎలాంటి ఉద్యోగమైనా వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తున్నారు అనేదే ముఖ్యం. అందుకే కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తికి సమానంగా గౌరవం ఇవ్వాలి.

Disclaimer: parts of this story are developed (in translation). Images used here are just for representative purpose only.


You may also like

Leave a Comment