Ads
కొన్ని సినిమాలని విడుదల అయినప్పుడు అంత పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ విడుదల అయ్యి, అందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినా కూడా, కలెక్షన్స్ పరంగా అటు ఇటు అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎన్ని సంవత్సరాలు అయినా గుర్తుండిపోతాయి. ఇటీవల కాలంలో అలా వచ్చి ప్రేక్షకుల మీద ప్రభావం చూపిన సినిమా జెర్సీ. నాని హీరోగా నటించిన ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించారు. సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మించారు. సాధారణంగా చాలా మంది జీవితంలో ఏదో సాధించాలి అనుకుంటారు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళు అనుకున్నవి చేయలేకపోతారు. అలాంటి వాళ్ళందరికీ ఒక మోటివేషన్ ఇచ్చిన సినిమా జెర్సీ.
Video Advertisement
జెర్సీ సినిమా చూసి కామెంట్స్ చేసే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఈ సినిమాకి కూడా నెగిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారా అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఉన్నారు. జెర్సీ సినిమాలో హీరోకి అనారోగ్య సమస్య ఉంది అనే కారణంగా క్రికెట్ ఆడటం ఆపేయమని చెప్తారు. హీరో కొడుకు చిన్న పిల్లాడు. లోకం తెలియదు. చిన్న పిల్లలు తెలిసి తెలియకుండా చాలా కోరికలు కోరుతారు. కానీ ప్రపంచం తెలిసిన తల్లిదండ్రులు అవి ఎంత వరకు నెరవేర్చగలరు అనేది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. “నువ్వు క్రికెట్ ఆడితే హీరో లాగా ఉంటావు” అనే ఒకే ఒక్క మాట కోసం, హీరో తన అనారోగ్య సమస్యని పక్కన పెట్టి క్రికెట్ ఆడాలి అని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది.
కానీ హీరో కోసం అంత కష్టపడుతున్న అతని భార్య పరిస్థితి ఏంటి. ఇప్పుడు క్రికెట్ క్రికెట్ ఆడితే అతని ప్రాణాలకు ప్రమాదం. ఆ తర్వాత అతను ప్రాణాలతో ఉండడు. అలాంటి సమయంలో అతని కొడుకు, భార్య పరిస్థితి ఏంటి. అప్పటికే భార్య తనకి ఉద్యోగం చేసి విసుగు వస్తోంది అని, అర్జున్ కి ఒక మంచి ఉద్యోగం వచ్చాక తాను విశ్రాంతి తీసుకుంటాను అని చెప్తుంది. ఇప్పుడు ఇలా వదిలి వెళ్ళిపోవడం వల్ల సారా, నాని పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది. అప్పటి వరకు అతని భార్య అర్జున్ జాబ్ కోసమే కష్టపడుతుంది. ఇప్పుడు ఆమె కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. అర్జున్ కి అలాంటి సమస్య ఉంది అనే విషయాన్ని కనీసం సారాకి అయినా చెప్పాలి.
సారా మొదట బాధపడినా కూడా, తర్వాత అర్జున్ అంత బాధలోకి వెళ్ళిపోకుండా అతనికి మద్దతు ఇచ్చేది. మానసికంగా అర్జున్ కి ఒక సహాయం దొరికేది. ఎవరికీ చెప్పకుండా తనలో తనే బాధపడి, క్రికెట్ ఆడలేను అనే విషయంతో తర్వాత జీవితాన్ని కూడా ఏదో కోల్పోయినట్టు గడుపుతాడు. సారాకి చెప్పి ఉంటే అతను అంత బాధ పడకుండా బయటికి తీసుకొచ్చేది. కొడుకు తెలిసి తెలియకుండా చెప్పిన ఒక్క మాట కోసం వారి భవిష్యత్తు కూడా లెక్కచేయకుండా అర్జున్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్య సమస్య ఉందని చెప్పిన డాక్టర్ సిగరెట్లు తాగద్దు అని కూడా చెప్పి ఉంటారు. కానీ అర్జున్ తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా సిగరెట్లు తాగుతూనే ఉంటాడు. తర్వాత క్రికెట్ కోసం ఆపుతాడు. కొడుకు తెలిసి తెలియకుండా జెర్సీ అడుగుతాడు.
కానీ అర్జున్ కూడా అంతే ఆలోచించకుండా సారా దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతాడు. తన కొడుకు అడిగిన విషయానికి కాదు అని చెప్పడం ఒక తండ్రికి ఇష్టం లేదు. కానీ ఇంట్లో పరిస్థితిని బట్టి, కొన్ని సార్లు కొన్ని విషయాలని ఆపాల్సి వస్తుంది. సాధారణంగా ఏ ఇంట్లో అయినా తల్లితండ్రులు చేసేది ఇదే. పిల్లలు వేరే వారిని చూసి, అది కావాలి, ఇది కావాలి అని అడుగుతుంటే ,ఒకవేళ అవి చాలా ఖరీదైనవి అయితే, ఏదో ఒక రకంగా వాళ్ళకి సర్ది చెప్పి ఆపుతారు. ఈ సినిమాలో అర్జున్ చేసిన పనులు అన్నీ కూడా ఆలోచించకుండా చేసిన పనులలాగానే అనిపిస్తాయి అంటూ చాలా మంది ఇప్పుడు ఈ సినిమా మీద కామెంట్స్ చేస్తున్నారు. నాణానికి రెండు వైపులు ఉంటాయి. ఇది మరొక వైపు ఏమో. ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు ఏమో.
ALSO READ : “ఆడవాళ్ళ” కి మాత్రమే కాదు… “మగవాళ్ళ” కి కూడా సమస్యలు ఉంటాయి అని చూపించిన 9 సూపర్ హిట్ సినిమాలు..!
End of Article