Ads
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితంలో ఎంతో అద్భుతమైన వేడుక. ఈ వేడుక కోసం అందంగా ముస్తాబు అవ్వాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకోసం షాపింగ్ కి వెళ్లి భారీగానే ఖర్చు పెట్టేస్తూ ఉంటుంది. మరి.. రెడీ అవడం కోసమైనా, మేక్ అప్ కోసం అయినా అంత ఖర్చు పెట్టలేని అమ్మాయిల పరిస్థితి ఏంటి?
Video Advertisement
అలాంటివాళ్ల గురించే ఆలోచించింది షెహరాబాను అనే అమ్మాయి. షెహరాబాను కర్ణాటకకు చెందిన అమ్మాయి. మడికేరి తాలూకాలోని ఛెత్తల్లి అనే కుగ్రామం లో ఆమె తల్లితండ్రులు అమీనా, మాను లతో కలిసి నివసిస్తోంది.
వారిద్దరూ దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. వారి కూలితోనే ఇల్లు గడుస్తూ ఉండేది. అయితే.. ఉన్నంతలోనే తన తోటివారికి సాయం అందించాలి అనే తపన షెహరాబానుది. పీయూసీ పూర్తి అయ్యాక ఆమె బ్యూటీషియన్ గా పని చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే తన స్నేహితుల పెళ్లిళ్లలో కూడా వారిని రెడీ చేయడంలో సాయం చేసేది. అయితే వారు తమకి నచ్చిన పెళ్లి దుస్తులను కొనుక్కోలేక ఉన్న డబ్బులతోనే ఉన్నవి కొనుక్కోవడం గమనించింది.
వారి స్నేహితుల ఇబ్బందిని గమనించాక షెహరాబానుకు ఓ ఆలోచన వచ్చింది. కేరళకు చెందిన పేద వధువు కోసం ఓ బోటిక్ ఉచితంగా పెళ్లి దుస్తులను అందించడం గురించి తెలుసుకుంది. కర్ణాటకలో కూడా అలాంటిది ఏమైనా ప్రారంభించాలని భావించింది. ఈ ఆలోచన రాగానే వాట్సాప్ గ్రూప్స్ లోను, ఇతర సామాజిక మాధ్యమాలలోను ఈ విషయాన్నీ వివరించింది. వీలైతే ఎవరి దగ్గరైనా పెళ్లి దుస్తులు ఉంటె అందించి సాయం చేయాలనీ కూడా కోరింది.
ఆమె అభ్యర్ధనకి విశేషమైన స్పందన లభించింది. అలా చాల మంది ఆమె వద్దకు దుస్తులను పంపించారు. కొందరు ఖరీదైన చీరలను కూడా విరాళంగా ఇచ్చేసారు. కొందరు తమ పెళ్ళికి వేసుకుని.. వాడకుండా ఉన్న దుస్తులను అందించారు. వీరిలో చాలా మంది మధ్యతరగతికి చెందినవారే. ఇలా వచ్చిన దుస్తులను షెహరాబాను పేదలకు ఉచితంగా అందిస్తుంది. అయితే.. ఆమె వద్ద పెళ్లి దుస్తులు తీసుకునే వారు తమ కుల పెద్ద నుంచి ఒక లేఖను, తమ ఆర్ధిక పరిస్థితి గురించి వివరించే పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. షెహరాబాను ఇలా ప్రారంభించిన నెలలోపే ఆమె బోటిక్ నుంచి చాలా మంది దుస్తులు తీసుకున్నారు. ఎంతో మంది తమ పెళ్లి వేడుక కోసం ఆమె వద్దకు వచ్చి సంతోషంగా తిరిగి వెళ్తుండడంతో ఆమె ఆనందం రెట్టింపైంది. ఆమెను నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.
End of Article