ప్రస్తుతం మన ఇండస్ట్రీలో టాప్ స్థానంలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఇది కూడా ఒక ప్రశ్నేనా? అనుష్క,కాజల్, సమంత, తమన్నా, రకుల్. వీళ్లలో తెలుగు వాళ్ళు ఎంతమంది? సున్నా. మన వాళ్ళని మనం ఆదరించడం అనేది అస్సలు జరగదు. అప్పట్లో డబ్బింగ్, డైలాగ్ ప్రామ్ప్టింగ్ ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి తెలుగు హీరోయిన్లు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు హీరోయిన్ డైలాగు చెప్పే భాష ఒకటి. డబ్బింగ్ ఆర్టిస్ట్ మాట్లాడే భాష ఒకటి. హీరోయిన్ తన మాతృభాషలో డైలాగులు చెబుతూ ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుగులో డబ్బింగ్ చెబుతుంది.
Video Advertisement
మన తెలుగు వాళ్ళు మాత్రం ఎంత బాగా నటించినా కూడా సహాయనటి పాత్రలకు మాత్రమే పరిమితమై పోతారు. అందుకే చాలామంది తెలుగు హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో తప్ప మిగిలిన ఇండస్ట్రీల్లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
#1 సావిత్రి – చిర్రావూరు
#2 జమున – హంపి
#3 ఊర్వశి శారద – తెనాలి
#4 భానుప్రియ – రంగంపేట
#5 విజయశాంతి – చెన్నై
#6 జయసుధ – చెన్నై
#7 జయప్రద – రాజమండ్రి
#8 గౌతమి – నిడదవోలు
#9 మాధవి – ఏలూరు
#10 రోజా – తిరుపతి
#11 రంభ – పెద్దాపురం
#12 లయ – విజయవాడ
#13 సమీరా రెడ్డి – రాజమండ్రి
#14 అంజలి – రాజోలు
#15 ఐశ్వర్య రాజేష్ – చెన్నై
#16 రీతు వర్మ – హైదరాబాద్
#17 శ్రీ దివ్య – హైదరాబాద్
#18 కలర్స్ స్వాతి – రష్యా
#19 ఈషా రెబ్బ – హైదరాబాద్
#20 ఆనంది – వరంగల్
#21 శోభితా ధూళిపాళ – తెనాలి
#22 అదితి రావు హైదరి – హైదరాబాద్
#23 షాలిని వాడ్నికట్టి – హైదరాబాద్
వీళ్లే కాకుండా వాణిశ్రీ, రాశి, మధు శాలిని, దివ్యవాణి ఇంకా చాలామంది ఉన్నారు. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏదైనా ఎక్స్పెరిమెంటల్ సినిమా వస్తే అప్పుడు చూడకుండా ఒక ఐదు సంవత్సరాల తర్వాత “ఈ సినిమా హిట్ అవ్వాల్సిన సినిమా. ఎలా ఫ్లాప్ అయిందో అర్థం కావట్లేదు. అసలు మన ఆడియన్స్ కి టేస్టే లేదు. అండర్ రేటెడ్ సినిమా, కల్ట్ క్లాసిక్, మాస్టర్ పీస్” అని అంటాం.
అలాంటి సినిమానే వేరే భాష వాళ్ళు తీస్తే “మన దగ్గర ఇలాంటి సినిమాలు ఎందుకు రావో. ఇలాంటి సినిమాలు మన హీరోలకు పడితే ఎంత బాగుంటుందో. ఎప్పుడు ఒకటే రొటీన్ సినిమాలు తీస్తారు. అదే స్టోరీ. అవే ఫైటింగులు. అవే ఎలివేషన్స్.” అని అంటాం.
అలాగే వేరే భాష హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లయినా అందరికీ నమస్కారం (అది కూడా సరిగ్గా పలకరు) అనే మాట తప్ప ఇంకొకటి రాదు. వాళ్లను చూసి “ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా తెలుగు రాదు” అని అనుకుంటాం. కానీ మళ్లీ వాళ్ల సినిమాలే చూస్తాం.
అందరూ అలానే ఉండరు కొంతమంది తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎంతైనా భాష మీద పట్టు ఉండదు కాబట్టి బ్రోకెన్ తెలుగు మాట్లాడుతారు. వాళ్ళని చూసి ” అబ్బా వేరే భాష ఆమె అయినా తెలుగు ఎంత బాగా మాట్లాడిందో!” అని అనుకుంటాం. దాని బదులు డైరెక్ట్ గా తెలుగు మాట్లాడే వాళ్ళనే తీసుకోవచ్చు కదా?
పైన చెప్పిన వాళ్లలో ముందు తరం హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హోదా లో ఉండేవారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పటి హీరోయిన్ల పరిస్థితి ఏంటి? పైన చెప్పిన ఇప్పటి హీరోయిన్లు తమ డబ్బింగ్ తాము చెప్పుకోగలరు. భాషని అర్థం చేసుకొని నటించగలరు.
కానీ తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో సినిమాలు చేస్తున్నారు. శోభిత లాంటివాళ్ళు కమర్షియల్ తెలుగు సినిమా లో హీరోయిన్ పాత్రలు ఎలా ఉంటాయో అందుకే వాళ్ళు తెలుగు సినిమాలు చేయకపోయినా పెద్దగా బాధ పడటం లేదు అని భయం లేకుండా చెప్పేశారు.
అసలు ఒక తెలుగు నటికి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది. మహానటి కి వచ్చింది కదా? అని మీకు అనిపించవచ్చు. మహానటి తెలుగు సినిమా కావచ్చు కానీ కీర్తి సురేష్ తెలుగు ఆమె కాదు. ఇందాక చెప్పినట్టు ఎవరో వేరే భాష వాళ్ళు వచ్చి మన భాష నేర్చుకొని మాట్లాడితే అభినందిస్తాం. మన భాష వాళ్ళను మాత్రం మనం గుర్తించలేము.
మనం తెలుగు హీరోయిన్లని గుర్తించనంతకాలం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తెలుగు రాని హీరోయిన్లను పరిచయం చేస్తూనే ఉంటారు. వాళ్లు వాళ్ళకు వచ్చిన భాషలో డైలాగులు చెబుతూనే ఉంటారు. తెరవెనుక తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ లు తమ డబ్బింగ్ తో మేనేజ్ చేస్తూనే ఉంటారు.