Ads
వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగానే ప్రపంచానికి తెలుసు. కానీ, ఆయన అధ్యక్షుడు కాకముందు కమెడియన్ గా చేశారన్న సంగతి చాలా మందికి తెలియదు. గతంలో ఓ సారి వొలొదిమిర్ జెలెన్‌స్కీ యుక్రెయిన్ దేశ అధ్యక్షుడిగా ఓ డ్రామాలో నటించారు.
Video Advertisement
కల నిజం అయినట్లు.. ఆ పాత్ర నిజంగానే నడిచి వచ్చినట్లు.. 2019 ఏప్రిల్ నెలలో ఆయన నిజంగానే అధ్యక్షుడు అయిపోయారు. 4.4 కోట్ల జనాభా ఉన్న ఉక్రెయిన్, మరో వైపు పొరుగు దేశం రష్యా సైనిక ముప్పుని ఎదుర్కొంటు ఆయన నాయకత్వం వహిస్తూ వస్తున్నారు.
ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటు ఆయన పాలన చేసారు. గతంలో ఆయన “సర్వెంట్ ఆఫ్ ది పీపుల్” అనే కామెడీ సిరీస్ లో నటించారు. ఇందులో ఆయన ఎంతో అణకువగా ఉండే హిస్టరీ ప్రొఫెసర్ పాత్రని చేసారు. అయితే, ఇందులో అవినీతికి వ్యతిరేకంగా ఆ ప్రొఫెసర్ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనితో అనుకోకుండా ఆ ప్రొఫెసర్ కి పాపులారిటీ వస్తుంది.
ఆ క్రమంలో అనుకోకుండా ఆయన దేశాధ్యక్షుడు అవుతారు. నిజానికి ఈ సిరీస్ అంతా ఓ కల్పిత కథ. ఉక్రెయిన్ రాజకీయాలపై ప్రజలకున్న భ్రమలపై సంధించిన అస్త్రం లాంటి సిరీస్. ఈ సిరీస్ తోనే జెలెన్‌స్కీ రాజకీయాల్లోకి వచ్చారు. ఈ సిరీస్ మోటోనే పార్టీ మోటో గా చెప్పుకుంటూ రాజకీయ అవినీతి ప్రక్షాళన చేస్తామని జెలెన్‌స్కీ ప్రచారం కూడా చేసారు. ఈ క్రమంలో ఆయన అధ్యక్షుడు కూడా అయ్యారు.
ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఏర్పడ్డ సంక్షోభం ఆయనని చిక్కులలో పడేసింది. వాస్తవానికి ఆయన అధ్యక్షుడు అవ్వాలని ముందు నుంచి అనుకున్నది కాదు. జిలెన్స్కీ ఉక్రెయిన్ నగరం క్రివీ రిహ్‌లో యూదు తల్లిదండ్రులకు జన్మించారు. కీవ్ నేషనల్ ఎకనామిక్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీని పొందారు. ఆ తరువాత కామెడీ రంగంవైపు ఆయనకీ అభిరుచి ఏర్పడింది. దీనితో రష్యన్ టివి నిర్వహించిన ఓ కామెడీ పోటీల్లో పాల్గొనే వారు. 2003 లోనే ఆయన తన బృందంతో కలిసి ‘క్వార్టల్ 95T’ అనే సంస్థని కూడా ఏర్పాటు చేసారు.
ఇది ఇలా ఉండగానే, లవ్ ఇన్ ది బిగ్ సిటీ (2009), ర్జవ్‌స్కీ వెర్సస్ నెపోలియన్ (2012) లాంటి సినిమాల్లో కూడా నటించారు. 2015 అక్టోబర్‌లో ప్రసారం అయిన “సర్వెంట్ ఆఫ్ ది పీపుల్” సిరీస్ ఆయనకు మరింత ఫాలోయింగ్ ను పెంచింది. ఈ సిరీస్ లో లాగానే ఆయన రాజకీయ జీవితం అంచలంచెలుగా ఎదిగింది. 2014 నుంచి 2019 వరకు ఉక్రెయిన్ కు అధ్యక్షుడిగా కొనసాగిన పెట్రో పోరోషెంకో పై జెలెన్స్కి విజయం సాధించారు.
End of Article