ఎన్ని సార్లు చెప్పినా వినట్లేదు… ఇలాగే చేస్తోంది..! తనని ఎలా ఆపాలి..?

ఎన్ని సార్లు చెప్పినా వినట్లేదు… ఇలాగే చేస్తోంది..! తనని ఎలా ఆపాలి..?

by Harika

Ads

సాధారణంగా మనవాళ్లు అనుకుంటే ఏదైనా మాట్లాడొచ్చు అని ఒక స్వాతంత్రం ఉంటుంది అని అనుకుంటాం. కానీ అది అబద్ధం. అసలు నిజం కాదు. మన వాళ్ళ దగ్గర అన్ని మాట్లాడలేం. ఒకవేళ అలా మాట్లాడితే అది వాళ్ళకి తప్పుగా అర్థం అయితే తర్వాత చాలా గొడవలు అవుతాయి. ఇప్పుడు నా పరిస్థితి అలాగే జరుగుతుంది. నా పేరు రవి. ఒక చిన్న ఊర్లో పెరిగాను. తర్వాత సిటీలో చదువుకున్నాను. అక్కడే ఉద్యోగం కూడా తెచ్చుకున్నాను. ఇన్ని చేశాక ఇంట్లో వాళ్ళు సైలెంట్ గా ఎందుకు ఉంటారు. నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నాకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగారు.

Video Advertisement


ఎంత సిటీలో ఉన్నా కూడా నా ఊరి వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్ నాకు ఉంటుంది. అందుకే మా ఊళ్లోనే పెరిగిన అమ్మాయి అయితే బాగుంటుంది అని నేను అనుకున్నాను. ఆ అమ్మాయి ఇక్కడ నాతో ఉంటే మా ఊరి వాళ్ళు నాతో ఉన్నట్టే అనిపిస్తుంది అనే ఒక ఆలోచన వచ్చింది. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పాను. మా వాళ్లు కూడా ఊర్లో అయితే తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు అని, కాబట్టి వాళ్ళకి నన్ను ఇచ్చి పెళ్లి చేయడం అనే విషయం గురించి సులభంగా మాట్లాడే అవకాశం ఉంటుంది అని అనుకున్నారు.

కొంత కాలం వెతికి వెతికి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. తన పేరు సుజాత. ఇంటర్ వరకు చదువుకొని ఆపేసింది. పెళ్లి చూపులకు వెళ్లి నేను ప్రైవేట్ గా మాట్లాడాను. తనకి నాతో సిటీకి వెళ్లినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని, తన వాళ్ళని ఎప్పుడు కలవాలి అనుకుంటే అప్పుడు వెళ్లే ఏర్పాటు చేస్తాను అని చెప్పాను. సుజాత, తనకి సినిమాలు చూడడం చాలా ఇష్టం అని చెప్పింది. రోజంతా టీవీ చూస్తూ ఉంటాను అని చెప్పింది. దాని వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు అని నేను చెప్పాను. సీరియల్స్ కూడా చాలా చూస్తాను అని చెప్పింది. దాని వల్ల కూడా నాకు సమస్య లేదు అని చెప్పాను.

తను మాట్లాడే విధానం చూస్తే చాలా అమాయకంగా అనిపించింది. చాలా మంచి అమ్మాయి అని అక్కడే అర్థం అయిపోయింది. తనకి కూడా నేను నచ్చడంతో మా పెళ్లి జరిగింది. కొన్నాళ్లు బాగా ఉన్నాం. వీకెండ్ వస్తే తనని బయటికి తీసుకెళ్లే వాడిని. సిటీ కొత్త కాబట్టి ప్రతి ప్రదేశాన్ని వింతగా చూసేది. అవన్నీ చూస్తూ ఆనందపడేది. తనకి ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను. సుజాత వాళ్ళ పుట్టింటికి కూడా అలాంటి ఒక స్మార్ట్ ఫోన్ పంపించాను. వాళ్లతో రోజు వీడియో కాల్ మాట్లాడుతూ ఉండేది. ఇలా ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలో ఒకసారి మా ఇద్దరి మధ్య ఏదో ఒక చిన్న విషయానికి గొడవ అయ్యింది.

ఆ తర్వాత నేను ఆఫీస్ కి వెళ్ళిపోయాను. కానీ నేను ఇంటికి వచ్చి చూసేటప్పటికి సుజాత ఏడుస్తూనే ఉంది. ఈ గొడవ గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను. కానీ తను అలా ఏడవడం చూసి నాకు బాధగా అనిపించింది.  “ఇలాంటి చిన్న వాటికి బాధపడకు” అని నేను తనకి చెప్పాను. తర్వాత అంతా మామూలు అయిపోయింది.  మరుసటి రోజు నాకు మా ఇంటి నుండి కాల్ వచ్చింది. మామూలుగా కాల్స్ మాట్లాడుతూ ఉంటాను కాబట్టి అలాగే వాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టాను.కానీ మా అమ్మ మాత్రం నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. అందుకు కారణం సుజాత ముందు రోజు జరిగిన గొడవకి బాధపడి, వాళ్ళ పుట్టింటికి వీడియో కాల్ చేసి ఏడుస్తూ కూర్చుంది.

అది చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు భయపడి, మా అమ్మ వాళ్ళకి చెప్పారు. వాళ్లు నన్ను తిట్టారు. కొత్త కదా. అందుకే ఇలా బాధపడి ఉంటుంది అని అనుకున్నాను. పెళ్లై సంవత్సరమైనా కూడా ఇది మారలేదు. మా ఇంట్లో ఏ చిన్న విషయం అయినా కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తుంది. మా ఇద్దరి మధ్య ఉండాల్సిన కొన్ని విషయాలు కూడా వాళ్లకి చెప్తుంది.వాళ్లు అక్కడితో ఆగకుండా వెళ్లి మా అమ్మ వాళ్లకు చెప్తారు. మాది చిన్న ఊరు. ఎవరి ఇంట్లో ఏ విషయం అయినా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది.

నేను సిటీలో ఉంటూ చేసే పనులన్నీ, మా ఇద్దరి మధ్య జరిగే గొడవలు అన్నీ కూడా మా ఊర్లో వాళ్ళకి తెలుస్తున్నాయి. ఈ విషయం మీద నేను సుజాతతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే, “నా పుట్టింటి వాళ్ళకి నేను ఏ విషయం చెప్పకుండా ఎలా ఉంటాను? ఇక్కడికి వచ్చాను అని చెప్పి వాళ్ల గురించి పట్టించుకోవడం వదిలేయలేను. అలా అని వాళ్ళ దగ్గర నేను అన్ని రహస్యాలు పెట్టలేను. వాళ్లు కూడా నాకు చాలా ముఖ్యమైన వారు” అని ఏదో ఎమోషనల్ గా చెప్పింది. కానీ అసలు నేను చెప్పిన దానికి, తను ఇచ్చిన సమాధానానికి పొంతన లేదు.

మ్యారేజ్ కౌన్సిలింగ్ లో ఇలాంటి విషయాల మీద అవగాహన వచ్చేలాగా చెప్తారు అని విన్నాను. ఇద్దరం కలిసి ఒకసారి కౌన్సిలర్ దగ్గరికి వెళ్లి ఈ విషయాల గురించి తెలుసుకుందాం అని సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించాను. అప్పుడు కూడా ఏడ్చి, గొడవ చేసి, “నాకేమైనా పిచ్చి అనుకున్నావా? అందుకే ఇలా చెప్పి నన్ను ట్రీట్మెంట్ కి తీసుకెళ్తున్నావా? నువ్వు మనిషివేనా? నన్ను అర్థం చేసుకోలేవా?” అని తిట్టింది. ఈ విషయం నాకు చాలా చిరాకు తెప్పిస్తోంది. ఇంటి నుండి ఫోన్ వస్తుంది అంటేనే భయం వేస్తుంది. ఇలా జరుగుతుంది అనుకుంటే నేను అసలు మా ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకునే వాడిని కాదు. ఈ సమస్యకి పరిష్కారం లేదా. ఇంటికి వెళ్లాలన్నా కూడా ఇంతే చిరాకుగా అనిపిస్తోంది.


End of Article

You may also like