Ads
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరో అంటే ఆరడుగుల ఎత్తు, ఎలాంటి డైలాగ్ అయిన అత్యద్భుతం గా చెప్పగల నేర్పు, ఎటువంటి భావోద్వేగాన్ని అయినా అలకవోగా పలికించే సామర్ధ్యం, చూడగానే ఆకర్షించే రూపం ఇవి ఖచ్చితమైన కొలమానాలుగా ఉండేవి.
Video Advertisement
మెగాస్టార్ చిరంజీవి రాకతో డాన్స్ లో గ్రేస్, ఫైట్స్ లో వేగంలాంటి మరికొన్ని లక్షణాలు ఆ కొలమానాలకి తోడు అయ్యాయి.
కానీ ఆ లక్షణాలు అన్ని లేకపోయినా, సన్నని రివట లాంటి శరీరం తో, చూడగానే మన వీధిలో ఆడుతూ పాడుతూ తిరిగే అల్లరి అబ్బాయి లా కనిపిస్తూ, అసాధారణ శక్తులు ఏమీ లేకపోయినా, తనకున్న ఆటిట్యూడ్ తో, ఒక సాదాసీదా తెలుగింటి కుర్రాడు కూడా హీరో కావొచ్చు అని నిరూపించిన వ్యక్తి “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్”.
మొదటి సినిమా “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”తో చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఆయన క్రేజ్ తో నెట్టుకోచ్చేయాలని చూడకుండా తనకి ప్రావీణ్యం ఉన్న మార్షల్ ఆర్ట్స్ లో భాగంగా నేర్చుకుని చేసిన, రాళ్ళని గుండెలపై పెట్టి పగలగొట్టించుకోవడం, చేతులపై కార్లు ఎక్కించుకోవడంలాంటి సాహస కృత్యాలు టాలీవుడ్ లో అప్పట్లో బాగా చర్చనీయాంశం అయ్యాయి.
తర్వాత ఆయన నటించిన గోకులం లో సీత, సుస్వాగతం సినిమాలు పవన్ లో నటుడిని పూర్తిగా ప్రేక్షకులకి పరిచయం చేశాయి. సుస్వాగతం క్లైమాక్స్ సన్నివేశాలలో పవన్ నటన అయితే ప్రతి ప్రేక్షకుడిని కంట తడి పెట్టించక మానదు. గోకులంలో సీత లో క్లైమాక్స్ సన్నివేశాల లో ప్రేమించిన అమ్మాయి కోసం తపన పడే పవన్ లో, ప్రతి ప్రేమికుడు తనని తాను తప్పక చూసుకుంటాడు.
పవన్ కళ్యాణ్ కి హీరో గా మర్చిపోలేని గుర్తింపునిచ్చిన తొలి ప్రేమ, తర్వాత వచ్చిన తమ్ముడు చిత్రాల్లో పూర్తి పక్కింటి అబ్బాయి పాత్రల్లో కనిపిస్తూ, ఫుల్ లెంగ్త్ కామెడీ చేస్తూ కనిపిస్తాడు పవన్. ఆయనలోని ప్రేమికుడిని పరిచయం చేసే క్లాసిక్ మూవీగా తొలిప్రేమ ఉంటే, ఆయన కామెడీ టైమింగ్ ఎంత అద్భుతం గా ఉంటుందో తెలియజెప్పే సినిమా తమ్ముడు.
పూరి జగన్నాధ్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ.. పవన్ హీరో గా నటించిన ‘బద్రి’ లో యాంగ్రీ యంగ్ మేన్ గా, ఇద్దరు ప్రియురాళ్ల మధ్య నలిగే ప్రేమికుడిగా తనలోని మాస్ ఆటిట్యూడ్ ని ఈ సినిమా లో మనం చూడొచ్చు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించి పవన్ కెరీర్ లో మరొక మైలు రాయిగా నిలిచింది.
కేవలం, యాక్షన్ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలుస్తూ పరిశ్రమని ఏలుతున్న రోజుల్లో ‘ఖుషి’ లాంటి స్వచ్ఛమైన ప్రేమ కథ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి బాక్స్ ఆఫీస్ కి కొత్త లెక్కలు నేర్పడం తో పాటు, మూస ధోరణి లో సాగిపోతున్న సినీ పరిశ్రమ కి కొత్త దారి చూపించాడు పవన్.
ఆయన దర్శకత్వంలో వచ్చిన జానీ నిరాశ కలిగించినా సినిమాలలో కొత్త దనం కోసం ప్రయత్నించిన పవన్ కి ప్రశంస లు మాత్రం దక్కాయి. ఆ తర్వాత చాలా సంవత్సరాలు పవన్ తన స్ధాయికి తగిన హిట్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది.
ఆ సమయంలో వచ్చిన గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం సినిమాలు సాధారణంగా ఆడినా కొన్ని వర్గాల్లో పవన్ క్రేజ్ సంపాధించడానికి దోహదం చేసాయి. జల్సా తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కినా పులి, పంజా, తీన్మార్ సినిమాలు అభిమానులకి నిరాశ మిగిల్చాయి.
ఒక్కసారి పవన్ తన స్ధాయిలో నటించి, మెప్పిస్తే సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో ఈతరం కుర్రాళ్ళకి తెలియ జెప్పింది ‘గబ్బర్ సింగ్’ సినిమా. జల్సా తో హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తో మళ్ళీ ‘అత్తారింటికి దారేది’ అంటూ తనలోని ఎమోషనల్ నటుడిని బయటకు తీసి పవన్ ఇండస్ట్రీ రికార్డ్ లని తిరగరాసాడు. సాధారణ కథతో, ముందే ఆన్లైన్ లో సగం సినిమా రిలీజ్ అయిపోయినా ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిలవడంతో కళ్యాణ్ క్రేజ్ ఏ స్ధాయిలో ఉందో ప్రతి తెలుగు ప్రేక్షకుడికి అర్ధం అయ్యింది.
గోపాల గోపాల, కాటమరాయుడు, వకీల్ సాబ్ భీమ్లా నాయక్ లాంటి సినిమాలతో పవన్ తన సినీ ప్రయాణాన్ని తప్పక కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. కానీ పవన్ ఒక్కసారి మనసు పెట్టి సినిమా చేస్తే సాధారణ సినిమా కూడా అసాధారణ హిట్ గా మారుతుంది అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
దివంగత నటులు ఏ.వి.ఎస్ గారు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను చూసిన కమర్షియల్ హీరోల్లో, కామెడీ అద్భుతం గా పండించగలిగే హీరో పవన్ కళ్యాణ్ ఒక్కరే అని చెప్పడం జరిగింది.
ఒకప్పటి ఫుల్ జోష్ లో ఉండే పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు వెండితెర మీద చూస్తామా? ఫుల్ మీల్స్ లాంటి సినిమా క్రిష్ ‘హరి హర వీర మల్లు’ తో అందిస్తాడా? లేక హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ తో మళ్ళీ ఆ బాధ్యతను తానే తీసుకుంటాడా అని పవన్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి ఆయన అభిమానుల్ని సంతృప్తి పరిచి, వాళ్ళ గుండెల్లో స్ధానం సంపాదించే డైరెక్టర్ ఎవరో వేచి చూద్దాం.
Disclaimer: This contributed activity was prepared or accomplished by NAGA BABU in
his personal capacity. The opinions expressed in this article are the author’s own and do not reflect the view of TeluguAdda
End of Article