Ads
ఒక చిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. మనం ఎలా ఆచరిస్తున్నాం అనేదే ముఖ్యం. నీతూ యాదవ్, కీర్తి జంగ్రా.. వీరిద్దరూ ఢిల్లీ లో ఐఐటి చదువుకున్నారు. రూమ్మేట్స్ కూడా.. వీరిద్దరికి ఏదైనా కొత్తగా చేయాలి అనే ఆలోచన చదువుకునే రోజుల నుంచే ఉండేది. కానీ, చదువైపోగానే ఉద్యోగాల్లో చేరారు. నీతూ బెంగళూరు లో ప్రతిలిపి ఆఫీస్ లో పని చేసేది. కీర్తి గుర్‌గావ్‌లో ‘పెంగ్విన్’ పబ్లిషింగ్ హౌస్ లో ఉద్యోగం చేస్తోంది.
Video Advertisement
ఈ ఇద్దరికీ ఉద్యోగం సంతృప్తి ఇవ్వడం లేదు. ఏదైనా కొత్తగా చేయాలి, విజయం సాధించాలి అన్న తపనే వారిద్దరిలోను మెదులుతోంది. ఆ తపనే వారికి కొత్త ఐడియా ను ఇచ్చింది. పశువులను ఆన్ లైన్ లో విక్రయించడం కోసం వీరు ప్రత్యేకం గా యాప్ ను తయారు చేయాలనుకున్నారు. సాధారణంగా పశువుల విక్రయాలు పల్లెటూర్లలో ఎక్కువగా జరుగుతాయి. వారు వీటిని దగ్గరగా చూసి, పరిశీలించాకే కొనుక్కుంటారు.
కానీ, ఆన్ లైన్ లో కొనాలంటే వారికి అంత సౌలభ్యం ఉంటుందా? అన్నది అనుమానమే. ఈ విషయాన్నే కీర్తి, నీతూ కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నించారు. మంచి ఉద్యోగాలు వదులుకుని ఇదేమి పని? అంటూ ప్రశ్నించారు. ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతారా? అంటూ బంధువులు కూడా హేళన చేసారు. కానీ వారు వెనుకాడలేదు. తమ తల్లితండ్రులకు అర్ధమయ్యేలా వివరించారు.
వారి ఆలోచన నచ్చి ఎందరో ఏజెన్సీ లు ఫండ్ లు కూడా ఇచ్చారు. అలా యాప్ ను ప్రారంభించారు. వీరు చేసే పని ఏంటంటే.. ఎవరైతే పశువులను అమ్మాలనుకుంటున్నారో.. ఎవరైతే కొనాలనుకుంటున్నారో.. వారిద్దరిని తమ యాప్ ద్వారా ఒక చోటకి చేరుస్తారు. 2019 ఏడాది చివరి లో బెంగళూరు లోనే ఓ చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. తమ యాప్ కు “యానిమల్” అన్న పేరు పెట్టారు. ఆ గదిలోనే వారి ఆఫీస్ మొదలైంది. యానిమల్ కార్యాకలాపాలను నిర్విఘ్నం గా కొనసాగించారు.
మొదట్లో అంతగా కలిసిరాలేదు.. కానీ, లాక్ డౌన్ టైం లో మాత్రం వీరి వ్యాపారం బాగా పుంజుకుంది. వారి యానిమల్ సంత అనేది ఎక్కువ మందికి చేరింది. ఈ వర్చువల్ సంతకు తక్కువ టైం లోనే పాపులారిటీ వచ్చేసింది. 2019 ఆఖరుకి వీరు కేవలం యాభై పశువుల్ని మాత్రమే అమ్మగలిగారు. కానీ 2020 డిసెంబర్ వచ్చేసరికి 40 వేల పశువుల్ని వీరు అమ్మగలిగారు. దాదాపు 80 లక్షల మంది రైతులు ఈ యానిమల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరి లక్ష్యం నచ్చి ఇన్వెస్టర్లు కూడా ముందుకొచ్చారు. ఆన్ లైన్ లో పశువుల విక్రయానికి డిమాండ్ కూడా పెరుగుతూ వచ్చింది. వేల కోట్ల రూపాయల్లో ఈ వ్యాపారం సాగుతోంది. ఒక ఐడియా జీవితాన్నే మార్చేయడం అంటే ఇదే మరి.
End of Article