ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ ప్రోగ్రాంకి అంత క్రేజ్ ఉంది. ఈసారి బిగ్ బాస్ తెలుగు-5 కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో జస్వంత్ పడాల ఒకరు.
మోడల్, యాక్టర్ అయిన జస్వంత్ బెజవాడలోనే పుట్టి పెరిగారు. బెంగుళూరులో ఫ్యాషన్ షోలు మరియు పోటీలలో పాల్గొంటూ, చిన్న చిన్న ప్రదర్శనలను ఇస్తూ మోడలింగ్ వృత్తి ని ప్రారంభించారు. 2017 లో మిష్టర్ ఏపీ ట్రెడిషనల్ ఐకాన్ గా నిలిచారు. ఆ తరువాత మోడల్ హంట్ సీజన్ 2 విన్నర్ గా కూడా నిలిచారు. అంతే కాదు.. సూపర్ మోడల్ ఇండియా 2018 టైటిల్ ను కూడా జస్వంత్ గెలుచుకున్నారు.
మోడల్ గా మంచి పేరు సంపాదించుకున్న జస్వంత్ కేవలం ఫ్యాషన్ షోలకే పరిమితం అవ్వకుండా సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. గిన్నిస్ రికార్డు ను సృష్టించడం కోసం చెన్నైలోని డ్రీమ్ జోన్ స్కూల్ ఆఫ్ క్రియేటివ్ స్టడీస్ ద్వారా ఫ్యాషన్ షో కు ఆయన కొరియోగ్రఫీ చేసారు. తిరుగు లేని ఫ్యాషన్ కెరీర్ ఆయన సొంతం. అందుకే ఫ్యాషన్ ప్రపంచం లో జస్వంత్ ను మిలింద్ సోమన్ ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తారు.
2017 లో సప్త మాత్రిక సీరియల్తో బుల్లితెరపై జస్వంత్ మెరిశారు. సినిమాల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టైం లో “ఎంత మంచి వాడవురా” సినిమాలో అవకాశం వచ్చింది. అలా నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి తెరను పంచుకున్నారు. ఈ సినిమా తరువాత మరిన్ని అవకాశాలు వస్తాయని జస్వంత్ భావిస్తున్నారు.