Ads
ప్రేమించడం అనేది ఒక వ్యక్తి తాను యుక్త వయసులో ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సిన పని అనే ఒక అపోహ ఉంటుంది. ఒక వయసు దాటిన తర్వాత ప్రేమించడం తప్పు అని అంటారు. ఇది సమాజంలో ఎన్నో సంవత్సరాల నుండి నాటుకుపోయిన ఒక ఆలోచన. ఒకసారి సరిగ్గా ఆలోచిస్తే అది నిజం కాదు అనే విషయం అందరికీ తెలుస్తుంది.
Video Advertisement
ముఖ్యంగా ఒకవేళ తర్వాత ఆడవారు ఎవరినైనా ప్రేమిస్తే, వారు వారి చుట్టూ ఉన్న మనుషుల నుండి సమాజం నుండి చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యను ఎదుర్కొన్న ఒక మహిళ తన కథను ఈ విధంగా చెప్పారు. ఆ కథ ఆ మహిళ మాటల్లోనే చూద్దాం.
నా పేరు లత. నాకు 46 సంవత్సరాలు. నాకు 21 సంవత్సరాలకు పెళ్లి చేశారు. తర్వాత నుంచి భర్త, అత్తమామలు లోకం అయిపోయారు. మధ్య మధ్యలో గొడవలు కూడా అవుతూ ఉండేవి. మా ఆయన నన్ను అప్పుడప్పుడు కొట్టేవారు కూడా. ఇవన్నీ మా అమ్మ వాళ్లకు చెప్తే “ఇలాంటివన్నీ సహజం. సర్దుకుపో” అన్నారు.
నేను కూడా నిజంగా ఇలాంటివన్నీ సహజం ఏమో అని ఎక్కువగా మాట్లాడలేదు. వాళ్లకి నచ్చినట్టు ఉండేదాన్ని. పెళ్లయిన రెండు సంవత్సరాలకి నాకు ఒక అమ్మాయి, ఆ తర్వాత మరో రెండు సంవత్సరాలకు ఒక అబ్బాయి పుట్టారు. కాలం అలా గడిచింది. నా స్నేహితులలో, లేదా బయట ఎవరైనా ఆనందంగా ఉన్న జంటను చూస్తే మేము ఎందుకు అలా లేము అని అనిపిస్తుంది.
నేను మాట్లాడడానికి ప్రయత్నించినా ఆయన నాతో సరిగ్గా మాట్లాడరు. నేను మరీ ఎక్కువగా మాట్లాడితే ఆయన నా మీద విసుక్కొని అక్కడినుంచి వెళ్ళిపోతారు. అలా అని అందరితో అలాగే చిరాగ్గా మాట్లాడతారా అంటే కాదు. వేరే వాళ్ళతో బాగానే మాట్లాడుతారు. నేను గట్టిగా “అసలు నేను అంటే అంత ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు?” అని మాట్లాడితే, “మా వాళ్లు బలవంతం చేస్తే చేసుకోవాల్సి వచ్చింది” అని మాట్లాడారు.
మొదట నేను ఈ విషయాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు. ఏదో కోపంలో అన్నారు ఏమో అనుకున్నాను. కానీ తర్వాత తర్వాత ఇదే నిజం అని నాకు అర్థం అయింది. ఇంక నేను ఆయనతో ఉండకూడదు అని నిశ్చయించుకున్నాను. విడాకులు తీసుకున్నాను. ఈ విడాకులు తీసుకోవడం కూడా అంత సులభంగా ఏం జరగలేదు. మా అత్త మామలతో, అలాగే మా అమ్మ వాళ్లతో పోరాడాల్సి వచ్చింది. అలా విడాకులు తీసుకొని నా పిల్లలతో నేను బయటికి వచ్చేసాను.
నా స్నేహితురాలు తన ఇంట్లోనే పై పోర్షన్ అద్దెకు ఇచ్చింది. నేను ఒక స్కూల్లో టీచర్ గా చేరాను. నా కూతురు కూడా ఉద్యోగంలో చేరింది. మా ఇద్దరి సంపాదన ఇంటికి సరిపోతుంది. స్కూల్లో నా తోటి ఉద్యోగులు అందరూ నాతో బాగా మాట్లాడేవారు. అందరూ నాకు మంచి స్నేహితులు అయ్యారు. వారిలో శేఖర్ కూడా ఒకరు. శేఖర్ కూడా దగ్గర దగ్గర నా వయసు వారే. ఆయన నా భార్య ఏదో ఆరోగ్య సమస్య వల్ల చనిపోయారట. వారికి పిల్లలు లేరు.
శేఖర్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యారు. మా స్నేహం ఇంకా పెరిగింది. ఇతరులని శేఖర్ గౌరవించే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఒకరోజు శేఖర్ కూడా తనకు నేనంటే ఇష్టమని చెప్పారు. నాకు కూడా శేఖర్ అంటే ఇష్టమే. జీవితం నాకు రెండవ అవకాశం ఇచ్చినట్టు అనిపించింది. దాంతో శేఖర్, నేను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాం.
ఇదే విషయాన్ని నేను ముందుగా నా స్నేహితురాలితో చెప్పాను. తను కొంచెం ఆశ్చర్యపోయి “మీ పిల్లలకి ముందు ఈ విషయం చెప్పు” అని చెప్పింది. నేను నా పిల్లలకి ఈ విషయాన్ని చెప్పాను. ముందు ఇద్దరు ఇష్టపడనట్టే ఉన్నారు. తర్వాత శేఖర్ తో మాట్లాడి, వాళ్లు కూడా సంతోషంగా సరే అన్నారు. ఇంక మాట్లాడవలసినది మా అమ్మ నాన్నలతో. ఇప్పుడు నేను కూడా నా నిర్ణయం నేను తీసుకునే బయటికి వచ్చాను కాబట్టి వారు నా నిర్ణయాన్ని గౌరవిస్తారు అనుకున్నాను.
కానీ అలా అవ్వలేదు. నేను ఈ మాట చెప్పగానే మా అమ్మ నన్ను కొట్టినంత పని చేసింది. నాన్న కూడా బాగానే మందలించారు. ఇదంతా కాదు అన్నట్టు ఈ విషయాన్ని నా మొదటి భర్తకు చెప్పారు. ఆయన, మా అత్తమామలు వచ్చి నన్ను తిట్టడం మొదలు పెట్టారు. పిల్లలని వారికి దూరం చేశాను అని, నా స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నాను అని, అలాగే నాకు ముందు నుంచే వేరే వ్యక్తి అంటే ఇష్టం ఉంది అని నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇదంతా చూస్తున్న నా పిల్లలు నా తరపున మాట్లాడడానికి వచ్చారు.
ఈ విషయంలో నా పిల్లలని కలగచేసుకోవద్దు అని చెప్పేసాను. ఏదైనా నేనే మాట్లాడదామని నిర్ణయించుకున్నాను. నా తల్లి తండ్రి కూడా నా గురించి ఇలా మాట్లాడడం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అసలు వీళ్ళకి నా మీద నమ్మకం లేదు అనే విషయం నాకు అర్థం అయింది. అయినా నచ్చని వ్యక్తితో విడిపోయి, ఒక నచ్చిన వ్యక్తిని చూసి ఇష్టపడితే తప్పేముంది. ఇప్పుడు నా నిర్ణయాలు నేను తీసుకోగలను. అయినా కూడా వీళ్ళు నా జీవితాన్ని ఇంకా ఎందుకు కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నారు?
ఏదేమైనా సరే నేను ఇంక సమాజం కోసం బతకదలుచుచుకోలేదు. ఎందుకంటే నా భర్త నన్ను అవమానించినప్పుడు, నేను బాధపడినప్పుడు, ఈ సమాజం నన్ను ఓదార్చడానికి కానీ, నాకు మద్దతు ఇవ్వడానికి కానీ రాలేదు. కాబట్టి ఇంక నాకు ఏది సరైన నిర్ణయం అనిపిస్తే నేను అదే అనుసరిస్తాను. ఎందుకంటే ఇప్పుడు కూడా నా హక్కు కోసం నేను పోరాడకపోతే ఇంక నా జీవితానికి అర్థం ఉండదు.
NOTE: images used in this article are just for representative purpose. But not the actual characters.
End of Article