Ads
స్వామి వివేకానంద.. ఈ పేరు వింటేనే యువకుల్లో ఉత్తేజం పొంగి పొరలుతుంది. అసాధారణ ప్రతిభ, తెలివితేటలూ, ఆధ్యాత్మిక చింతన, దేశ భక్తి, స్త్రీలపట్ల గౌరవం, సాటి వారి పట్ల ఆదరణ.. ఇలా చెప్పుకుంటూ పోతూ వివేకానంద వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి జీవితం చాలదు. ఎల్లప్పుడూ శక్తిమంతులు గా కొనసాగాలని, ఆ మనోధైర్యంతోనే జీవించాలని వివేకానంద బోధిస్తూ ఉండేవారు.
Video Advertisement
తక్కువగా అంచనా వేసుకోవద్దు..!
ఆయన బోధించిన విషయాలన్నీ నేటికీ చిరస్మరణీయాలు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు తమ శక్తిసామర్ధ్యాలనూ పరిపూర్ణం గా వినియోగించుకోవాలని స్వామి వివేకానంద సూచించేవారు. ఈ అంశాన్ని మహిళలు కూడా పరిగణన లోకి తీసుకోవాలి. భారతీయ మహిళలు కుటుంబ పాలన లో పడిపోయి తమ శక్తిసామర్ధ్యాలనూ తక్కువ గా అంచనా వేసుకుంటుంటారు. మహిళల పట్ల ఉన్న ఆంక్షలను స్వామీ వివేకానంద ఆనాడే నిరసించారు.
ఆడువారిని అమ్మా అని గౌరవిస్తాం..!
స్త్రీలకు కూడా తగిన స్వేచ్ఛను ఇస్తే.. వారు ఏమైనా సాధించగలరని స్వామి వివేకానంద బలం గా విశ్వసించేవారు. ‘బలమే జీవితం..బలహీనతే మరణం’ అంటూ ఆయన నిత్యం యువతలో స్ఫూర్తి ని రగిలిస్తూ.. ధైర్యం నూరిపోసేవారు. ఆయన మహిళలు కూడా బలవంతులే అని విశ్వసించేవారు. ఎక్కడకు వెళ్లినా ఆయన మహిళలను అమ్మా అనే సంబోధించేవారట. అయితే.. ఓ విదేశీ స్త్రీని కూడా ఆయన అలానే పిలువగా… నేను మరీ అంత పెద్ద దానిలా కనిపిస్తున్నానా అని ఆమె తిరిగి ప్రశ్నించింది. అందుకు చిరునవ్వి నవ్వి.. మా దేశం లో ప్రతి ఆడపిల్లను అమ్మా అనే సంబోధిస్తామని వివేకానంద బదులిచ్చారట. వయసు తో సంబంధం లేకుండా.. ఆడువారిని అమ్మా అని పిలుస్తూ ఆదిశక్తితో పిలుస్తామని వివరించారట.
ఇక్కడి స్త్రీలు ఆ సీతాదేవి బిడ్డలే..!
భారత మహిళలను స్వామి వివేకానంద ప్రపంచ దేశాల్లోనే ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారిగా భావించేవారు. ఇక్కడి కట్టుబాట్లను ఓర్చుకుంటూ.. సహనం తో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారిని చూసి..ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలిగే శక్తీ ఇక్కడి స్త్రీలకు ఉందని బలం గా చెప్పేవారు. అందుకు సీతాదేవిని ఉదాహరణ గా చూపించారు. ఆ తల్లి బిడ్డలే భారతీయ స్త్రీలని వివేకానంద చెప్పేవారు. ఓ సారి ఓ విదేశీ మహిళ తనను పెళ్లి చేసుకోవాలంటూ వివేకానంద ను కోరిందట.
నన్నే నీ కుమారుని గా ఎందుకనుకోకూడదు..?
ఆయనను వివాహం చేసుకుంటే అలాంటి శక్తిమంతుడైన పిల్లాడు పుడతాడని ఆశపడినట్లు చెప్పడం తో.. వివేకానంద మౌనం వహించారు. ఆ తరువాత.. అమ్మా… ఓ తల్లి గా నీవు తెలివైన పిల్లాడికి జన్మనివ్వాలని కోరుకోవడం సహజమే.. కానీ అందుకు చాలా సమయమే పడుతుంది. పుట్టిన పిల్లవాడు తెలివైన వాడు అవుతాడో లేదో కూడా మనకు తెలియదు. దానికంటే.. నన్నే నీ పుత్రుడు గా స్వీకరించు అని స్వామిజి ఆ విదేశీ మహిళను అభ్యర్ధించారు. అంతటి మహోన్నత ఔన్నత్యం కల వ్యక్తి స్వామి వివేకానంద.
అది చెప్పడానికి మనకేమి అధికారం ఉంది..?
ఓ సారి వివేకానందుని వద్దకు వచ్చిన ఓ వ్యక్తి..”వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా అని ప్రశ్నించాడు. దానికి బదులిచ్చిన స్వామి వివేకానంద అది పూర్తి గా వారి ఇష్టమని.. అది నిర్ణయించడానికి మనకేమి అధికారం ఉందని” తెలిపారు. మన దేశ మహిళలు అన్ని విషయాలపై తగిన నిర్ణయాలు తీసుకోగల సమర్థులు అని వివేకానంద పేర్కొన్నారు. వారు ఎదగడానికి, చదువుకోవడానికి మీరు పెడుతున్న అడ్డంకుల్ని తొలగించండి అంటూ వివేకానంద పేర్కొన్నారు.
End of Article