Ads
మీకు జీవితం లో ఏదైనా సంకట స్థితి ఎదురైనా,, లేదా ఎవరి సలహా అన్నా కావాలి అనుకున్న.. దానికి సరైన ప్లాట్ ఫార్మ్ కోరా. అందులో మన ప్రశ్నలకు ఎందరో జవాబులు ఇస్తూ ఉంటారు.. మన సందేహాలను తీరుస్తూ ఉంటారు.
Video Advertisement
అలాగే కొంతకాలం కిందట కోరా లో ఒక ప్రశ్న వచ్చింది..” ఒక పేదింటి అమ్మాయికి ఒక పనికి రాని వాడితో ఐదేళ్ళ క్రితం పెళ్లి అయింది. మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఆ అబ్బాయికి భార్య, కుటుంబం అంటే లెక్క లేదు. ఇంకా పిల్లలు లేరు. పెద్ద వాళ్ళు సర్ది చెప్తూనే ఉన్నారు. అతను మారడం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎలా?” దానికి హరి గోవిందు గారు ఇలా స్పందించారు.
“ఈ ప్రశ్న కు నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. 1996 లో మా వీధిలో పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడిని. అందులో కొందరు ఆడపిల్లలకు వారి ఉన్నత చదువుల విషయంలో సలహాలు ఇచ్చే వాడిని. వారికి సహాయంగా ఉండేవాడిని. ఆ ఏరియాల్లో వుండే వారికి ఎవరికి చదువు లేదు. వారిలో ఒక అమ్మాయికి నేనే దగ్గరుండి కర్నూల్ గవర్నమెంట్ కాలేజ్ లో ఇంటర్ చేర్పించాను. తర్వాత ఆమె బీఈడీ పూర్తి చేసింది.
నేను ఉద్యోగ రీత్యా కర్నాటకలో ఉండటం వల్ల, ఎప్పుడైనా ఊరు వెళ్ళినపుడు అమ్మాయి తో మాట్లాడే వాడిని. డీయాస్సి కి ప్రయత్నం చేసేది మరోవైపు పోటీ పరీక్షలకు కూడా సిద్ధమయ్యేది. వాళ్ల ఇంట్లో చెప్పాను.. జాబ్ వచ్చాక పెళ్లి చేయండి… ఇప్పుడే వద్దు అని.ఇంత చదువు చదివిన అబ్బాయిలు వారి చుట్టాలలో లేరు అని వాపోతుంటే , నేనే సంబంధాలు చూస్తా లేండి అని చెప్పాను.
కొంత కాలం తరువాత ఒకరోజు ఫోన్, దేవుని కడప లో ఆ అమ్మాయి పెళ్లి .ఆ రోజే ముహూర్తం. అది కూడా మా అమ్మ, నన్ను పెళ్లికి పిలవలేదు అని వాళ్లకు గుర్తు చేస్తే , నాకు ఫోన్ చేశారు.ఎక్కడో నాలో ఒక చిన్న బాధ, ఇంత చేస్తే …నాకు ఒక చిన్న మాట కూడా చెప్ప లేదే అని.. అయినా ఆ అమ్మాయి బాగుంటే చాలు అని వదిలేశాను.
కొన్ని సంవత్సరాల తరువాత నేను మహానంది లో ఒక కార్యక్రమము చూసుకొని వస్తున్నాను.అప్పుడు ఫోను వచ్చింది, ఆ అమ్మాయి పురుగుల మందు తాగి, చావు బతుకుల మధ్యలో ఉందని. పెళ్లి తరువాత ఆ అమ్మాయి ని చూడ్డం కూడా అదే మొదటి సారి. అప్పుడు జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాను. అడుక్కు తినే స్థితిలో ఉంది. పీకల్లోతు అప్పులు, చదువు లేని పోరంబోకు, పచ్చి తాగుబోతు.ఇవన్నీ దాచి పెట్టి , పెళ్లి చూపులు అయిన వారం లోనే, ఎవరో చని పోతున్నారని తొందర పెట్టి పెళ్లి చేసుకున్నాడు..పెళ్ళైన సంవత్సరము లోనే అప్పుల క్రింద ఇల్లు తో సహా అన్ని పోయాయి.
ఆ అబ్బాయి తన అన్న గారి ఇంట్లో ఈ అమ్మాయిని ఉంచటం… ఇక ఆ అమ్మాయి ఆ ఇంట్లో వాళ్ళు, ఎవరు సరిగ్గా పట్టించు కోక పోవటం , కారణము వారు పేద వారే. ఇక ఆ అమ్మాయి ఎవరూ లేనప్పుడు తన బిడ్డ కు, దొంగ తనంగా కొద్దిగా అన్నం తెచ్చుకొని , తినిపించుకొని , తను పస్తు ఉండేది..భర్త ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పోతాడో తెలీదు.ఏదైనా స్కూల్ లో పని చేస్తాను అంటే అనుమానం తో బూతులు తిడుతూ కొట్టడం.
హాస్పిటల్ లో ఒకటే మాట చెప్పాను.ఆ అమ్మాయి తల్లిదండ్రులకు …”మీ అమ్మాయి చని పోయింది అనుకోండి…నేనే ఆ అమ్మాయిని చూసుకుంటాను అన్నాను….”ఎవరు తెలియని ఒక మారుమూల గ్రామములో ఇండస్ట్రీయల్ ప్రయివేటు స్కూల్ లో (ప్రియ సిమెంట్) టీచర్ గా చేరిపించాను..ఆమె భర్త తాగి , గొడ్డలి తీసుకొని వెళ్లి , ఆ అమ్మాయి ఇంట్లో గొడవ చేస్తే, మా అమ్మాయి ఎక్కడవుందో తెలీదు అని, నాలుగు దెబ్బలు తగిలించి పంపించారు..చివరికి వాడు తాగి తాగి చాలా తక్కువ రోజులలో , ఎక్కడో ఒక మురికి కుంటలో శవమై కనిపించాడు.
ఇవి జరిగి ఏడెనిమిది సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో ప్రయివేట్ స్కూల్ లో హెడ్ మాస్టర్. మీ ప్రశ్నకు నాదొకటే జవాబు, మాటలు వద్దండి… ఆ అమ్మాయి ని ఆ నరక కూపము నుండి విడిపించి, బతకడానికి దారి చూపండి.” అని చెప్పారు హరి గోవిందు గారు.
End of Article