Ads
హీరోల ఇమేజ్‌తో సంబంధం లేకుండా కేవలం కథకు ఏది కావాలో దాన్ని మాత్రమే తెరకెక్కించే దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లోని హీరో పాత్రకు భారీ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు గట్రా ఏమి ఉండవు. ఆయన సినిమాల్లో కథే హీరో. అందుకేనేమో అవార్డులు సైతం ఆయనకు దాసోహం అవుతుంటాయి. కేవలం పోస్టర్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతారు.
Video Advertisement
ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన విడుతలై పార్ట్-1 రిలీజ్ అయింది. కమెడియన్ సూరి, విజయ్ సేతుపతి ఈ మూవీ లో ప్రధాన పాత్రల్లో నటించారు. మూడు రోజుల క్రితం రిలీజైన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రెండు రోజుల్లోనే పది కోట్ల రేంజ్ కలెక్షన్‌ను సాధించింది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని తమిళనాడులో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రం సుమారు 20 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమాకి మంచి స్పందన మాత్రమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం లభిస్తున్నాయి.
ఈ మూవీ కథ విషయానికి వస్తే.. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో ముతువేల్ అనే ప్రాంతంలోని పోలీస్ డిపార్ట్మెంట్ క్యాంపులో కుమరేషన్ (సూరి) డ్రైవర్‌గా చేరుతాడు. మక్కల్ పడై అనే అతివాద సంస్థకు చెందిన నాయకుడు పెరుమాల్ అలియాస్ వాతియార్ (విజయ్ సేతుపతి)ను పట్టుకొనేందుకు పోలీసులు కూంబింగ్ జరుపుతుంటారు.
ఇక ఆ ప్రాంతంపై గట్టిపట్టున్న సూరి పోలీసులకు సహకరిస్తుంటాడు. తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారనే కారణంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతుంటారు. కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా వాతియార్ జాడ కనుక్కొనేందుకు ఆ ప్రాంత మహిళపై పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటారు.
ఈ మూవీ లో భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తాయి. పెరుమాల్ ఆచూకీ కోసం గ్రామస్థులపై దాడులు చేయడం, గ్రామంలోని మహిళలను నగ్నంగా ఊరేగించడం పైశాచికంగా కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు గ్రామంలో జరిగే ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్‌గా నిలుస్తాయి. విజయ్ సేతుపతి అరెస్ట్ తర్వాత పార్ట్ 2కు ఇచ్చిన లీడ్, ట్విస్టు ఆసక్తికరంగా ఉంటుంది.
మాములుగానే వెట్రిమారన్ సినిమాల్లో హింస కాస్త ఎక్కువ మొతాదులోనే ఉంటుంది. ఇందులో డోస్ ఇంకొంచెం పెంచాడు. సెన్సార్ కూడా ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. ఇక పలువురు రివ్యూయర్లు కూడా సున్నిత మనస్కులు, చిన్న పిల్లలకు దూరంగా ఉండమని పేర్కొంటున్నారంటే ఈ సినిమాలో హింస ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరోవైపు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
End of Article