2 ఏళ్ల తర్వాత నా భార్య అడిగిన మొదటి కోరిక తీర్చలేకపోతున్నాను..! ఏం చేయాలో అర్థం కావట్లేదు..!

2 ఏళ్ల తర్వాత నా భార్య అడిగిన మొదటి కోరిక తీర్చలేకపోతున్నాను..! ఏం చేయాలో అర్థం కావట్లేదు..!

by Harika

Ads

సాధారణంగా చాలా మంది భార్యలు తమ భర్తలని ఎక్కువగా కోరికలు కోరుతారు అని అంటారు. “అది కావాలి”, “ఇది కావాలి” అని అడుగుతూ ఉంటారు అని, స్తోమతకు మించి ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు అని అంటారు. ఇవన్నీ చూసి నాకు పెళ్లి చేసుకోవాలి అంటేనే భయం వేసింది. అయినా కూడా వయసు పెరుగుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు బలవంతం మీద పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఎలా ఉండాలి అనే విషయాల మీద మాత్రం అవగాహన ఉంది. నా పేరు రమేష్. హైదరాబాద్ లో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్నాను.

Video Advertisement

నాకు 25 సంవత్సరాలు వచ్చినప్పటినుండి ఇంట్లో పెళ్లి గోల మొదలుపెట్టారు. కానీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి చేసుకోవాలి అంటే భయం వేసింది. అలా లాగి, లాగి నాకు కూడా 30 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. అప్పటి నుండి మా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నాకు 32 వచ్చినా కూడా పెళ్లి కాలేదు. కానీ నేను చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ లు వచ్చి, జీతం కూడా పెరిగింది. దాంతో హైదరాబాద్ లోనే ఒక ఇల్లు కొని, ఊర్లో ఉండే అమ్మానాన్నలను కూడా ఇక్కడికి తీసుకొచ్చేశాను. పెళ్లి కాలేదు అనే ఒక్క విషయం తప్ప, మిగిలిన అన్ని విషయాల్లో మేము అభివృద్ధి చెందిన తీరు చూస్తే నా మీద నాకే గర్వంగా అనిపించేది.

అలా చూసి, చూసి ఒక అమ్మాయికి నేను నచ్చాను అని పెళ్లి చూపులకు పిలిచారు. అమ్మాయి అసలు మాట్లాడలేదు. నేనేమో మాట్లాడుతూనే ఉన్నాను. అయినా కూడా ఆ అమ్మాయి ఒక్క మాట మాట్లాడలేదు. భయపడుతోందా? సిగ్గుపడుతోందా? అనే విషయం నాకు అర్థం కాలేదు. నేనేం లోపలికి తీసుకెళ్లి మాట్లాడలేదు. అందరి ముందే మాట్లాడాను. ఎందుకంటే నాకు అలా ప్రైవేట్ గా కూర్చుని మాట్లాడే అంత పెద్ద కోరికలు ఏం లేవు. తర్వాత అమ్మాయికి నేను నచ్చాను అని చెప్పడంతో నా పెళ్లి జరిగింది. నా భార్య పేరు దేవి. పెళ్లయ్యాక నాకు అర్థమైన విషయం ఏంటి అంటే దేవికి సిగ్గు ఎక్కువ.

ఎక్కువ ఎవరితో మాట్లాడదు. తనని కూడా నేను ఎప్పుడూ ఏమీ అడిగే వాడిని కాదు. అన్ని తను చెప్పకుండానే నేను అర్థం చేసుకునే వాడిని. అలా పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు అయిపోయాయి. మా రెండవ యానివర్సరీ పార్టీ రోజు అందరినీ పిలిచి, “నా భార్య నాతో ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడింది లేదు. నేను కూడా తనకి అది కావాలా? ఇది కావాలా? అని అడిగింది లేదు. అన్ని నేనే అర్థం చేసుకొని, తనకి ఏం కావాలో అది ఇస్తాను. అందుకే మేం రెండు సంవత్సరాలు చాలా సంతోషంగా ఉన్నాం” అని చెప్పాను. ఒక రోజు దేవి ముభావంగా ఉండడం నేను గమనించాను. ఆ రోజు సాయంత్రం నేను ఆఫీసు నుండి వచ్చాక కూడా తను అలాగే ఉంది. దాంతో, “ఏమయింది?” అని అడిగాను. దేవి ఏడుస్తోంది. నాకేం అర్థం కాలేదు.

నేను ఎప్పుడూ తనని ఇబ్బంది పెట్టలేదు. తను ఎందుకు బాధపడుతోంది అనే విషయం నాకు అర్థం కాలేదు. అప్పుడు దేవి మాట్లాడింది. “మొన్న యానివర్సరీ పార్టీలో నాకు ఏం కావాలో అడగలేదు అని చెప్పావు. అదేమైనా గొప్ప విషయం అనుకుంటున్నావా? ఒక్కసారైనా నాతో మాట్లాడి, నాకు అసలు ఏం కావాలి, నాకు ఏం అంటే ఇష్టం అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించావా? పెళ్లయిన కొత్తలో అంటే నాకు కూడా ఏం అర్థం కాక అడ్జస్ట్ అవ్వడానికి సమయం పట్టింది. అలా సంవత్సరం గడిచిపోయింది. రెండవ సంవత్సరంలో అయినా ఏదైనా మారుతుంది అనుకుంటే అది కూడా లేదు.”

“నీకేంటి? పొద్దున వెళ్తావు. రాత్రికి ఇంటికి వస్తావు. రోజంతా ఇంట్లో ఉండాల్సింది నేను. అసలు నేను పెళ్లికి ముందు చేసే ఉద్యోగం మానేసి ఇంట్లో ఎందుకు ఉంటున్నాను అని ఒక్కసారి అయినా అడిగావా? రోజంతా ఇంట్లో ఉండి మీ అమ్మానాన్నలని చూసుకుంటాను. ఒక్కసారైనా ఈ విషయాన్ని గుర్తించావా? నువ్వు గుర్తించవు. మీ అమ్మానాన్నలు అయితే అసలు నేను పని చేయడానికి ఉన్నట్టు చూస్తారు. నేను తిన్నానా? తినలేదా? అని అడిగే వాళ్ళే లేరు. అసలు నా ఇష్టాలే నీకు తెలియదు. ఇంక నా గురించి ఏం అడుగుతావు? పెళ్లికి ముందు మా అమ్మ నాన్నలు నా ఇష్టాలని ప్రోత్సహించలేదు.”

“పెళ్లయ్యాక అసలు నువ్వు అడగడం కూడా అనవసరం అనుకున్నావు. మీ అమ్మానాన్నలు అయితే నువ్వు వెళ్లిన తర్వాత నుండి పిల్లలు కను అని అంటూ ఉంటారు. రోజంతా ఆ మాటలు వినలేకపోతాను. నేను ఎందుకు ఉన్నాను? నా జీవితానికి ఒక కారణం లేదా? సరే, ఇవన్నీ వదిలేసి, నేను ఉద్యోగం చేసుకుందామా అని అనుకుంటే, ఇంట్లో అత్తమామలని వదిలేసి బయట తిరుగుతోంది అని నాకు ఒక పేరు పెడతారు. ఒక్కదాంట్లో సహాయం చేయవు. అసలు నాకు ఇన్ని పనులు చేయడం ఇష్టమేనా కాదా అని కూడా అడగవు. ఇంట్లో పనిమనిషి కూడా లేదు. మొత్తం పని నేనే చేస్తున్నాను.”

“ఇంక నా వల్ల ఇది కాదు. నేను నీతో వేరుగా ఉండాలి అనుకుంటున్నాను. నా ఉద్యోగాన్ని తిరిగి మొదలు పెట్టుకోవాలి అనుకుంటున్నాను. కావాలంటే మీ అమ్మానాన్నలకి దగ్గరలోనే ఇల్లు తీసుకొని ఉందాం. కానీ ఈ రెండు సంవత్సరాలు అయినట్టే తర్వాత కూడా కొనసాగితే మాత్రం మన మధ్య మనస్పర్ధలు వస్తాయి. నువ్వేంటో నాకు తెలియదు. నేనేంటో నీకు అసలే తెలియదు. ఇప్పుడైనా మనం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అంటే విడిగా ఉండాలి” అని చెప్పింది. రెండు సంవత్సరాలు అసలు మాట్లాడని భార్య ఇప్పుడు మాట్లాడింది అని ఆనందం లేదు. బాధగా అనిపిస్తోంది.

మనసులో ఇంత దాచుకుందా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను నా తల్లిదండ్రులని వదిలి వెళ్ళలేను. వాళ్లకి ఏదైనా అవసరం అయితే, వాళ్ల దగ్గర నేను లేకపోతే, లేదా దేవి కూడా లేకపోతే కష్టం అవుతుంది. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు. కానీ తన మాటలు విన్న తర్వాత మాత్రం నేను తనని అసలు అర్థం చేసుకోలేదు అని అనిపించింది.


End of Article

You may also like