“ఫెయిర్ అండ్ లవ్లీ” పేరు మార్చేలా చేసిన… ఈ 22 ఏళ్ల అమ్మాయి గురించి మీకు తెలుసా?

“ఫెయిర్ అండ్ లవ్లీ” పేరు మార్చేలా చేసిన… ఈ 22 ఏళ్ల అమ్మాయి గురించి మీకు తెలుసా?

by Mohana Priya

Ads

సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉంటుందో తెలియదు కానీ అడ్వర్టైజ్మెంట్ ల ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా ఫెయిర్నెస్ క్రీముల అడ్వటైజ్మెంట్. ఒక అమ్మాయి నల్లగా ఉంటుంది. తనని చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరూ పట్టించుకోరు. అంతేకాకుండా ఉద్యోగానికి వెళితే అక్కడ కూడా తను ఏం చదివిందో తన క్వాలిఫికేషన్ ఏంటో కూడా చూడకుండా ఒక్క ముఖాన్ని చూసి తనని రిజెక్ట్ చేస్తారు.

Video Advertisement

తర్వాత ఇంటికి వచ్చి తనని తాను అద్దంలో చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తన తల్లిదండ్రులో, స్నేహితులో వచ్చి తన చేతిలో ఒక క్రీమ్ ట్యూబ్ ని పెడతారు. అప్పుడు ఆ అమ్మాయి ఆ క్రీమ్ రాసుకొని కొన్ని రోజుల్లోనే తెల్లగా అయిపోయి మళ్లీ అదే ఇంటర్వ్యూ కి వెళ్తుంది అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి షాక్ అయ్యి ఏ ముఖాన్ని చూసి అయితే అతను రిజెక్ట్ చేశాడో అదే ముఖాన్ని చూసి ఆమెకి ఉద్యోగం ఇస్తాడు.

ఒకసారి ఇలాంటి అడ్వటైజ్మెంట్ లని చూస్తే ఒక మనిషి తెల్లగా ఉంటే చాలా? అన్ని వచ్చేస్తాయా? చదువు, ఇంకా మిగిలినవి ఏమి అవసరం లేదా? అన్న అనుమానం వస్తుంది. దాంతోపాటు అప్పటికే తాము నల్లగా ఉన్నానని బాధపడే ఆడవాళ్ళకి ఇలాంటి క్రీమ్ చూస్తే తెల్లగా అవ్వచ్చు అని ఒక హోప్ వస్తుంది. దాంతో మార్కెట్లో ఆ క్రీం సేల్స్ కూడా పెరుగుతాయి.

ఇలా ఏదో కొన్ని సంవత్సరాల క్రితం అయ్యేదేమో అనుకుంటే అస్సలు కాదు. ఎన్నో సంవత్సరాల నుండి ఇలాంటి ఎన్నో ఫెయిర్ నెస్ ప్రోడక్ట్ లు వస్తూనే ఉన్నాయి. అవి అంతే ఎక్కువగా కొంటున్నారు కూడా. మన సమాజంలో ఇది తప్పు అని ప్రశ్నించే వాళ్లని పిచ్చి వాళ్ళు అంటారు. మాట కొంచెం కఠినంగా ఉన్నా ఇదే నిజం.

100 మందిలో కనీసం ఒక్కరికైనా నల్లగా ఉంటే తప్పేంటి? ఈ క్రీం వాడి తెల్లగా అవ్వాల్సిన అవసరం ఏంటి? మా వ్యక్తిత్వం మాకు లేదా? నల్లగా ఉన్నంత మాత్రాన మనుషులం కాకుండా పోతామా? మేము ఇలాగే ఉంటాం. అని అనేవాళ్ళు కచ్చితంగా ఉంటారు. కానీ వారిని మిగిలిన వాళ్ళందరూ వీళ్ళని పిచ్చి వాళ్ళ లాగా చూస్తారు. మొండి, పొగరు, ఇలా ఉంటే బతకడం కష్టం, ఇలాంటి ఎన్నో మాటలు అంటారు.

మనకి చిన్నప్పుడు ఏదైనా విషయం నాటుకు పోతే అది మనం పెరిగి పెద్దయ్యాక కూడా మన ఆలోచనల్లో నుండి పోదు. చిన్నప్పటినుండి నువ్వు నల్లగా ఉన్నావ్ అని చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు తెలిసి తెలియక వెక్కిరిస్తూ ఉంటే పెద్దయ్యాక వాళ్ళని వాళ్ళు ఇష్ట పడలేక, ఇలాంటి ఫెయిర్ నెస్ క్రీమ్ అనే ఆప్షన్ ని ఎంచుకుంటారు. ఈఫెయిర్ నెస్ క్రీమ్ అమ్మకాలు ఇప్పటి వరకు లాభాలతో కొనసాగుతోంది అంటే జనాల్లో నల్లగా ఉండొద్దు, అది తప్పు అనే భావన ఎంత లోతుగా ఉందో మీరే ఆలోచించండి.

ఇప్పుడు విషయానికొస్తే ఇందాక పైన చెప్పిన ఎడ్వర్టైజ్మెంట్ గురించి చదవంగానే అది ఏం కంపెనీ అనేది ఈ పాటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. అవును పేరులోనే ఫెయిర్ ఉన్న ఫెయిర్ అండ్ లవ్లీ. ఫేర్ అండ్ లవ్లీ ముఖాన్ని తెల్లగా చేస్తుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుండి జనాలు నమ్ముతున్న విషయం. ఇప్పుడు హఠాత్తుగా ఆ పేరు లో నుండి ఫెయిర్ అనే పదాన్ని తొలగిస్తున్నట్లు హిందుస్థాన్ యూనిలీవర్ నోటీసు విడుదల చేసింది.

కలరిజం వల్ల అవుతున్న వివాదాల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో బ్లాక్ లీవ్స్ మేటర్ అనే పేరుతో కొద్దిరోజులుగా అన్ని రంగులు సమానమే అని నినాదాలు ర్యాలీలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారతదేశంలో కూడా అన్ని రంగులు సమానమే అని చెప్పాలి అని చర్చ మొదలైంది.

బ్లాక్ లివ్స్ మ్యాటర్ అని దాదాపు అందర్ భారతీయ సెలబ్రిటీలు ఒక నల్ల రంగు ఫోటో పోస్ట్ చేయడం చూసే ఉంటారు. విచిత్రమేంటంటే ఇందులో చాలామంది అలాంటి రంగులు మార్చే ప్రోడక్ట్ లకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు. కొంత మంది ఇప్పటికీ ఉన్నారు. ఇలాంటి వాళ్లు అన్ని రంగులు సమానమే అని చెప్తుంటే వినడానికి వింతగా అనిపిస్తుంది.

మరి ఎక్కడో వేరే దేశంలో అయిన దానికి ట్విట్టర్లో పోస్ట్ లు పెట్టి, పెద్ద పెద్ద పేరాగ్రాఫ్ రాసి కలరిజం తప్పు అని చెబుతున్నారు కానీ మనదేశంలో ఫెయిర్ నెస్ క్రిములని బ్యాన్ చేయాలి అని జరుగుతున్ననిరసన లో మాత్రం ఒక్కరు కూడా మద్దతు ఇవ్వడం లేదు.

మార్పు మన నుండి మొదలవ్వాలి. వేరే ఎవరి సహాయం మనకు అవసరం లేదు అని తెలుసుకున్న చాలామంది మామూలు యువత ఫెయిర్నెస్ క్రీమ్ ప్రమోట్ చేయడం ఆపాలి అని ట్విట్టర్లోనూ, ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్ ల లోనూ తమకు తోచినట్టుగా అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగా 22 ఏళ్ల చందన హిరణ్ ఫెయిర్ నెస్ ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకురావద్దు అని ఒక పిటిషన్ రాసి ఆన్ లైన్ లో పెట్టింది. తనకు మద్దతు పలకాలంటే ఆ పిటిషన్ ను సైన్ చేయడం, వేరే వాళ్ళకి ఫార్వార్డ్ చేయడం చేయాలి.రెండు వారాల్లో దాదాపు 15,000 ఈ పిటిషన్ ను సైన్ చేశారు.

ఇలా ఈ పిటిషన్ సోషల్ మీడియా అంతా పాకి హిందుస్థాన్ యునిలీవర్ సంస్థ వరకు వెళ్ళింది. ఈ వ్యవహారం చాలా దూరం వెళ్లడంతో తాము చేస్తోంది ఎంత తప్పో గ్రహించిన హిందుస్థాన్ యూనిలీవర్ తమ ఫెయిర్ అండ్ లవ్లీ లో ఉన్న ఫెయిర్ పదాన్ని తీసేయబోతున్నట్లు ప్రకటించింది.

దాంతో ఈ ప్రయత్నం మొదలుపెట్టిన చందన ను భారతదేశం మొత్తం అభినందిస్తోంది. ఈ విషయంపై చందన మాట్లాడుతూ ” అసలు నా రంగు కి ఒక గుర్తింపు లేదు. నేనే కాదు నాతోపాటు ఇలా చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడూ సినిమాల్లో నా రంగు ఉన్న యాక్టర్ ల ని చూడలేదు. అందరూ తెల్లగా కనిపిస్తారు. పెద్ద పెద్ద మ్యాగజైన్ కవర్ల మీద కూడా అందరూ తెల్లగానే ఉంటారు. కెమెరా లో వాడే ఫిల్టర్ లలో కూడా నా రంగు ఉండదు.

ఇదే నాలో కలరిజం అనే కాన్సెప్ట్ ను నిర్మూలించడానికి నా వంతు నేను కృషి చేయాలి అనే భావన వచ్చేలా చేసింది. నాతో మెల్లగా చాలామంది కలిశారు. ఇలా కలర్ ఇంప్రూవ్మెంట్ లను ప్రమోట్ చేసే అన్ని కంపెనీల మీద నేను పిటిషన్ రాశాను. కానీ హిందుస్థాన్ యూనిలీవర్ ముందుకు వచ్చి తమ పేరులో ఉన్న ఫెయిర్ అనే పదాన్ని తొలగిస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించింది. అంత పెద్ద సంస్థ మా మాటను విని అర్థం చేసుకొని స్పందించి, తమ వంతు మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది” అని చెప్పింది.

 

చందన లాంటి ఎంతోమంది తమ రంగు వల్ల బాధ పడిన వాళ్ళు ఉంటారు కానీ సమాజం అంటే భయంతో తమ నోరు విప్పరు. వాళ్లకి తప్ప అనిపించిన విషయం తప్పు అని బయటికి చెప్పరు. సమాజం తనని ఎక్కడ అంగీకరించదో
అన్న భయం.

సమాజం సంగతి పక్కన పెడితే మనల్ని మనమే యాక్సెప్ట్ చేయలేనప్పుడు వేరే వాళ్ళు చేసినా చేయకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పటినుండి అయినా మనందరం సమాజం అనే కనిపించని వ్యక్తుల నుండి అంగీకారం ఆశించకుండా తెల్లగా ఉండడం అనేది గొప్ప కాదు నల్లగా ఉండటం అనేది తప్పు కాదు అనే విషయాన్ని తెలుసుకొని, ముందు మనం మనకి మనం నచ్చేలా ఉండాలి అని కోరుకుందాం.


End of Article

You may also like