ఒకసారి ఈ టెన్షన్ తలనొప్పులతో అప్పుడప్పుడు మళ్ళీ చిన్నవాళ్ళమైపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా ? ప్రత్యేకించి 90 లో పుట్టిన వాళ్లకి. ఆ టైం మరి అవుట్ డేటెడ్ గా ఉండదు అలాంటి అప్డేటెడ్ గా కూడా లేదు. టెక్నాలజీ అప్పుడప్పుడే మొదలైంది. కానీ దాని ప్రభావం ఆ సమయంలో ఉన్న పిల్లల మీద అస్సలు పడలేదు. ఆటలంటే వీడియో గేమ్స్ కాదు. అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఉండేవి.

అలాగే చిన్నప్పుడు తినకపోతే చేతికి ఫోన్ ఇచ్చేవాళ్ళు కాదు. అసలు చెప్పాలంటే ఆ వయసులో ఫోన్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. తినకపోతే బూచోడు వచ్చి పట్టుకువెళ్తాడు అని భయపెట్టి తినిపించే వాళ్ళు. మనం కూడా అది నమ్మేసే వాళ్ళం. అలా చిన్నప్పుడు చాలా విషయాలు నిజమేనేమో అని నమ్మేవాళ్ళం. అవి ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది కానీ చిన్నప్పుడు మాత్రం చాలా సీరియస్ గానే తీసుకున్నాం. అలాంటి కొన్ని రూమర్స్ ఇప్పుడు చూద్దాం. కింద లిస్టులో ఎంతో కొంత వరకు మీరు కూడా నమ్మినవి ఉండే ఉంటాయి.

#1. పెన్సిల్ పొట్టు ని పాలలో వేయడం

పెన్సిల్ పొట్టును పాలలో లో వేసి రెండు రోజులు పెడితే అది ఎరేజర్ అవుతుంది.ఇది నమ్మి పెన్సిల్ పొట్టు ని పడేయకుండా కంబాక్స్ (అదే కంపాస్ బాక్స్) లో దాచుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు.

#2. వాన్లో కిడ్నాపర్లు ఉంటారు

వాన్ ని చూస్తే పారిపోయే వాళ్ళం. దాంట్లో కిడ్నాపర్లు ఉంటారని. పిల్లల్ని తీసుకొని పారిపోతారు అని చెప్పేవాళ్ళు. అసలు ఈ రూమర్ ఎవరు సృష్టించారోఎవరికీ తెలీదు. ఇప్పటికీ అలాంటి వాన్ ని చూస్తే చిన్నగా ఒక తెలియని భయం వేస్తుంది.

#3. ఓ స్త్రీ రేపు రా.

ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నప్పుడు దెయ్యం అంటే భయం తో మన మీదకి వస్తుందేమోనని అది రాకుండా ఉండాలంటే ఇంటి ముందు ఓ స్త్రీ రేపు రా అని రాయాలి అని అలా రాస్తే దెయ్యం వెనక్కి వెళ్లి పోతుంది అని నమ్మేవాళ్ళు.

#4. శక్తిమాన్ నిజమే అనుకోవడం.

ఆదివారం వచ్చిందంటే మొదట శక్తిమాన్ కొంతకాలం తర్వాత పంచతంత్రం, అమృతం. ఈ సీరియల్స్ లేకుండా ఆదివారమే గడిచేది కాదు. వాటి పాటలు కూడా ఇప్పటికీ మనకు గుర్తు ఉంటాయి. శక్తిమాన్ అందరు నిజమని నమ్మి తమ్ముడు ఆపదలో ఉంటే శక్తిమాన్ వచ్చి కాపాడతాడు అని బిల్డింగ్ ల మీదకి ఎక్కడం లాంటివి చేసేవాళ్ళు.

ఇలా చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. దాంతో తర్వాత తర్వాత శక్తిమాన్ వచ్చేముందు గమనిక వచ్చేది. స్వయంగా శక్తిమాన్ క్యారెక్టర్ చేసిన ముఖేష్ ఖన్నానే వచ్చి అది కేవలం సీరియల్ మాత్రమే అని చెప్పేవారు.

#5. పండ్లు తిన్నప్పుడు విత్తనాలు తింటే కడుపులో చెట్లు మొలుస్తాయి అనుకోవడం.

సీతాఫలం రేగుపండు లాంటి వాటిలో ఉండే పెద్దపెద్ద విత్తనాలు అంటే తీసేయొచ్చు కానీ పుచ్చకాయ పపాయ ఇలాంటివి అప్పుడప్పుడూ తెలియకుండా నోట్లో కి వెళ్లిపోయేవి. అప్పుడు చెట్లు వచ్చేస్తాయి ఏమోనని భయపడేవారు ఎంత భయపడేవాళ్లో. కొంతమంది అయితే ఏడ్చేవాళ్ళు కూడా.

#6. సాలీడు కుడితే స్పైడర్ మాన్ అవుతారు.

అంతా స్పైడర్ మాన్ సినిమా మహిమ. బాగా బూజుపట్టిన అన్న గోడల దగ్గరికి వెళ్లడం. అక్కడున్న సాలీడు ని చేతి మీద వేసుకోవడం ఎప్పుడైనా ట్రై చేశారా ఇది. కచ్చితంగా చేసే ఉంటారు.

#7. చూయింగ్ గమ్ మింగితే పేగులకు చుట్టుకొని చచ్చిపోతారు

ఇది నిజమా అబద్దమా తెలీదుగానీ ఇప్పటికి కూడా ఇలా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు.

#8. అండర్ టేకర్ నిజంగానే చచ్చిపోయి బతికేవాడు

wwf చూసిన వాళ్ళకి అండర్ టేకర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఆలా సమాధి బాక్స్ లో నుండి వచ్చిన ప్రతి సారి చనిపోయి మళ్ళి బతికాడు  అనుకునేవాళ్లు . ఇపుడు అది గుర్తు తెచ్చుకుంటే ఆ మేకర్స్ ని చూసి నవ్వాలో లేదా మన అమాయకత్వం చూసి నవ్వుకోవాలో అర్ధం కాదు.

#9. నెమలి ఈకలు బుక్ లో పెట్టుకుంటే పిల్లలు పెడుతుంది

నెమలి  పిల్లల్ని పెడుతుంది . కానీ నెమలి ఈక ఎలా పిల్లల్ని పెడుతుంది  ?  అది తెలీదు కానీ నెమలి ఈక మాత్రం కచ్చితం గా పెడుతుంది. ఇంకా దానికి ఆకులు ఆహారం కూడా పెట్టాలి. అపుడే పిల్లలు పెడుతుంది. లాజిక్ ఆలోచించకండి . ఇది కనుక్కున్న ఐన్స్టీన్ లు మనమే.

#10. ఊడిపోయిన పన్ను భూమిలో పాతి పెడితే డబ్బులు వస్తాయి

అదే నిజమైతే ఈ పాటికి ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు అయ్యే వాళ్లు.

#11. దెయ్యాలు రాత్రిపూట మాత్రమే వస్తాయి. పగలు రావు.

ఎక్కడో అక్కడ ఎవరూ ఒక్కళ్ళు ఇవి కూడా నమ్మే ఉంటారు. మరి సినిమాల ప్రభావం కావచ్చు వేరే ఏదైనా కావచ్చు కానీ ఉదయం నుండి రాత్రి 9 వరకు దెయ్యాలు రావు అని రాత్రి తొమ్మిదింటి తర్వాత దెయ్యాలు వస్తాయని కొంతమంది అనుకునేవాళ్ళు.

#12. జీబూమ్బా పెన్సిల్ తో వస్తువు గీస్తే అది నిజమవుతుంది

జీబూమ్బా పెన్సిల్ ఎంతమంది గుర్తుంది. సీరియల్ కొద్ది రోజులే వచ్చినా దాని హవా మాత్రం చాలా రోజులు నడిచింది.  ఆ పెన్సిల్ ని పోలి ఉన్న పెన్సిళ్లు మార్కెట్ లోకి రావడం, ఆ సీరియల్లో హీరో ఆ పెన్సిల్ తో బొమ్మ గీస్తే నిజం అవుతుంది కదా అని మనం కూడా అలా ప్రయత్నించడం చేసే ఉంటాం.

#13. ఎండా-వానా ఒకేసారి వస్తే…ఎక్కడో కుక్కకు నక్కకు పెళ్లి అవుతుందట?

#14. సూర్యగ్రహణం అంటే సూర్యుడిని పాము మింగేయడం 

ఇలా చిన్నప్పుడు తెలిసీ తెలీక ఏవో చేస్తాం. పెద్దయిన తర్వాత చూసుకుంటే ఏంటి మనమేనా ఇవన్నీ నమ్మింది? అని అనిపిస్తుంది. కానీ చిన్నతనంలో చేసిన ఇలాంటి పనులే నవ్వుకోడానికి మనకి జ్ఞాపకాలు. పైన చెప్పిన వాటిలో మీరు కూడా ఏదో ఒకటి అయినా చేసే ఉంటారు కదా.