Ads
బాహుబలి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునేలా చేసిన మరొక సినిమా పుష్ప. ఈ సినిమాతో అల్లు అర్జున్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఎన్నో అవార్డులు కూడా అల్లు అర్జున్ అందుకున్నారు. అంతేకాకుండా జాతీయ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ ఘనత సాధించారు.
Video Advertisement
సినిమా థియేటర్లలో విడుదల అయినప్పుడు మొదట సినిమా మీద చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ తర్వాత మెల్లగా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి చాలామంది సినిమాని పొగిడే లాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి కోరాలో ఒక వ్యక్తి ఈ విధంగా రాశారు. పుష్ప సినిమా ఎలా ఉంది అని ప్రశ్నకి జగదీష్ కోచెర్లకోట గారు ఈ విధంగా రాశారు.
ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “మనకున్న అతిపెద్ద అవలక్షణం ఏంటంటే… అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లరైతే అతనెప్పటికీ పోలీసులకి దొరక్కూడదనుకుంటాం. అదే అల్లు అర్జున్ అరివీరభయంకర పోలీసాఫీసరైతే ఆ ఎర్రచందనం స్మగ్లర్ల తాటతీసెయ్యాలని కోరుకుంటాం. అంటే మనకి అక్కడ హీరో మీద, అతగాడి రూపురేఖలమీద అమితమైన ప్రేమ. అతనికి తండ్రెవరో తెలియకపోవడం మన కంట కన్నీరు తెప్పిస్తుంది. పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతోంటే భలేభలే అనుకుంటాం. కొండారెడ్డి, మంగళం శ్రీను కూడా అలాంటి పనులే చేస్తున్నా వాళ్లెవరిమీదా కలగని జాలి, అనురాగం, ఆత్మీయభావం పుష్పరాజ్ మీదనే కలుగుతాయి.
సరిగ్గా ఇక్కడే మన సినిమా ఒక స్థాయిలో ఆగిపోతూ ఉంటుంది. సమాజంలో మనకై మనం విధించుకున్న న్యాయాన్యాయ విచక్షణలు, చట్టపరిధులు, తప్పొప్పుల చిట్టాలు అన్నీ కలిసి మనకు శతాబ్దాలకు తరబడి కొంత జ్ఞానాన్ని ప్రసాదించాయి. వాటి ఆధారంగా చూస్తే స్మగ్లింగ్ అనేది నేరం. అధికమొత్తంలో సొమ్ము తీసుకుని మనుషుల్ని చంపడం ఘోరం.
దీనికి అరవింద్ స్వామి కంటే అందమైన పేరొకటుంది. ‘ప్రొఫెషనల్ కిల్లింగ్’ అనీ! అందులోనూ యమా స్మార్ట్‌గా ఉండే మహేష్‌బాబు పాతబస్తీ సందుల్లో ఎవరో ఒకతన్ని అత్యంత లాఘవంగా కత్తితో పొడిచి తప్పించేసుకుంటోంటే మనకు గూస్‌బంప్స్ వస్తాయి. అదేపని ఏ ప్రదీప్ రావత్తో చేస్తే మన రక్తం ఉడికిపోతుంది. ‘అంత క్రూరత్వం మనుషుల్లో ఎలావుంటుందసలు?’ అనేసుకుంటాం కూడా!
సరే, ఇదంతా నా చాదస్తం అనుకుని కాసేపు పక్కనబెడదాం.
ద రైజ్…. అంటే ఒక సాధారణ దినసరి కూలీ ఒకానొక చీకటి సామ్రాజ్యానికి అధిపతిగా ఎలా ఎదిగాడన్న మూడుగంటల విపులీకరణలో మనందరికీ పుష్పరాజ్ పట్ల ఒకరకమైన అభిమానం, అతగాడి వ్యాపారంతో ఒక బంధం ఏర్పడిపోయేలా చెయ్యడంలో సుకుమార్ చాలా సుకుమారమైన సెంటిమెంటుని పండించాడు.
దాదాపు ఇటువంటి ఇతివృత్తమే ఎన్నుకుని జీషన్ కాద్రి అనే కుర్రాడు ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’ అనే కథను రాసుకుని తనదగ్గర అట్టేపెట్టుకున్నాడు. జార్ఖండ్‌లో ఉన్న ఒక చిన్నవూళ్లో జరిగే సంఘటనల ఆధారంగా తయారుచేసుకున్న కథ అది. రెండు కుటుంబాల మధ్య పగలు పెరిగి ఒకరినొకరు అంతం చేసుకునే ప్రక్రియలో ఆయా కుటుంబాల్లోని వ్యక్తులు అసాంఘిక శక్తులుగా ఎలా ఎదిగారనేదే ఇతివృత్తం.
తీరా రాసుకున్న తరవాత ఏంచెయ్యాలో తెలియలేదు. ఆనక అనురాగ్ కశ్యప్ దగ్గరకు తీసుకెళ్లి ఇస్తే అతగాడు మొత్తం చదివి దాన్ని ఐదారుగంటల సినిమాగా మలిచాడు. అయితే ప్రేక్షకులు అంతసేపు సినిమా హాల్లో కూర్చోవడం అసాధ్యమన్న ఆలోచనతో దాన్ని రెండు భాగాలుగా చేసి విడుదల చేశారు. సర్దార్ ఖాన్ మరణం వరకూ మొదటిభాగం, ఆ తరవాత ఫైజల్ ఖాన్ ఎదుగుదలంతా రెండవభాగం.
ఇందులో సర్దార్ ఖాన్ ఉత్త వెధవ. వాడు చేసేవన్నీ దారుణాలే! నాటుబాంబుల తయారీ, నాటుతుపాకీల తయారీ, దొంగతనాలు, మనుషుల్ని అతి కిరాతకంగా చంపెయ్యడాలు, ముక్కలు ముక్కలుగా నరికెయ్యడాలు, అక్రమసంబంధాల వల్ల భార్యాబిడ్డలకు దూరమవ్వడాలు, మళ్లీ కలుసుకోవడాలు… ఇలా అతగాడి చరిత్రంతా రక్తమోడుతూనే ఉంటుంది. అతని మీద మనకసలు జాలనేదే కలగదు.
రెండవభాగంలో అతని రెండోకొడుకు ఫైజల్ ఖాన్ అయిష్టంగానే రంగంలోకి దిగుతాడు. నిజానికి వాడెప్పుడూ గంజాయి మత్తులో ఉంటుంటాడు. కుటుంబంలో సంభవించే వరుస హత్యలకు ప్రతీకారంగా అతని తల్లికిచ్చిన మాటకోసం అత్యంత క్రూరుడైన డాన్‌గా మారి, అలా అంచెలంచెలుగా ఎదుగుతాడు. వీడిమీద కూడా మనకెటువంటి జాలీ, కరుణా కలగవు. దీనికి కారణం ఏమిటంటే, వాళ్లకూ కుటుంబం ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్లుంటారు. నీతులు చెబుతుంటారు. ఆ పనులన్నీ మానెయ్యమని కూడా వేడుకుంటుంటారు. అయినా వినరు.
స్వతహాగా వాళ్లు ఎటువంటి మనుషులో, వారి అవిద్య, అజ్ఞానం, క్రూరత్వం వారిని ఏ స్థాయి ఆలోచనలకు పరిమితం చేస్తాయో మాత్రమే దర్శకుడు చూపిస్తాడు. వారికి ఎటువంటి ఉన్నతమైన భావజాలాలను, ఎటువంటి మానవీయ దృక్పథాలను ఆపాదించే ప్రయత్నం చెయ్యడు. కనీసం ఒక్కటంటే ఒక్కటికూడా మంచిపని చెయ్యని ఆ తండ్రీకొడుకుల కథలో మనం ఎంతగా లీనమైపోతామంటే ఆ జార్ఖండ్ వీధుల్లో ఆ నరరూప రాక్షసుల మధ్య తిరుగుతున్నట్టే ఉంటుంది. అదంతా ఆయా పాత్రలపట్ల దర్శకరచయితలకుండే పట్టు. మొదటినుంచి చివరిదాకా వారందరూ అలాగే ప్రవర్తిస్తారు. మారరు. మారాలనీ అనుకోరు.
ఇదంతా ఆ సినిమా గొప్పదనీ, మహత్తరచిత్రరాజమనీ చెప్పే ప్రయత్నం కాదు. అందులో ఉన్నన్ని బూతులు, హింస ఇంకెక్కడా చూడం. కానీ ఆ చిత్రాన్ని మనం అలా అనుకునే చూస్తాం కాబట్టి ఏ సమస్యా ఉండదు. కానీ ఈ పుష్పరాజులు, ప్రొఫెషనల్ కిల్లర్లూ చేసేవన్నీ చేసేసి, అమ్మాయిల్తో పాటలవీ పాడేసి, పోలీసుల్ని కొట్టేసి, అవసరమైతే చంపేసి కూడా మనందరిచేతా విజిల్సేయించేస్తారు. ‘ఈ రాజ్యాంగం మీకు తుపాకీనిస్తే మాకు గొడ్డలిచ్చింది, ఎవడి వేట వాడిదం’టూ సమర్ధింపు…
సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సనే రెండు సిద్ధాంతాలనీ రంగరించి రాసుకున్న ‘దాక్కోదాక్కో మేకా’ అన్నపాటా… అడవిలో అతగాడు ఎన్ని అఘాయిత్యాలు చేసినా ఆడపిల్లల మీద మాత్రం ఎవరైనా అన్యాయం తలపెడితే సహించలేకపోవడం… ఈ సమర్ధింపులతోపాటు హిట్టైన పాటలు, కనులకింపుగా నృత్యాలు వెరసి ఈ పుష్పరాజ్ సామ్రాజ్యం మనకు కైలాసగిరి కొండమీద ఏడాదికోసారి పెట్టే పుష్పప్రదర్శనలా వర్ణశోభితంగానే కనబడుతుంది తప్ప ఎటువంటి భయాందోళనల్నీ, తరువాతి నిముషం ఏమవుతుందన్న ఉత్కంఠనీ కలిగించవు. ఎందుకంటే అక్కడున్నవాడు పుష్పరాజ్ కాదు.
అల్లు అర్జున్. అతను ప్రతి యుద్ధంలోనూ గెలిచే తీరతాడు. సరుకు కనబడకుండా దాచే తీరతాడు. అంత బరువైన దుంగల్నీ దుంపల్లా గంపకెత్తెయ్యగలడు. ప్రత్యర్ధులు ఎన్ని మారణాయుధాలతో వచ్చినా ‘కళ్లుమూసుకుని’ మట్టికరిపించెయ్యగలడు. ‘కనులు కనులను దోచాయంటే’ అనే సినిమాలో ఇద్దరు ఇంజనీరింగ్ చదివిన అత్యంత చురుకైన కుర్రాళ్లు తమ మేధాశక్తినుపయోగించి కోట్లు దొంగిలించేస్తూ ఉంటారు. అలాగే ఆ ఆడపిల్లలు కూడా. మళ్లీ వారి సమర్ధింపులు కూడా ఉంటాయి.
చివరాఖరికి వారికోసమై వెదికే పోలీసతన్ని బఫూన్‌లా చూపించేసి, ఆ నలుగుర్నీ దేశం దాటిపోయేలా చేసి మన ఇగోని ఎంచక్కా సంతృప్తి పరుస్తాడు దర్శకుడు. లాప్‌టాపుల్లో పార్టులు మార్చేయడాలు, రహస్యంగా ఫింగర్‌ప్రింట్ల సేకరణ, ఏటీఎమ్ దొంగతనాలు చేసే అందమైన దుల్కర్‌నీ, ప్రేమ పేరుతో మోసంచేసే మరింత అందమైన రీతూవర్మనీ మన ఇంట్లో పిల్లల్లా ఓన్ చేసేసుకుంటాం. అంచేత మనం సినిమా చూడాల్సిన విధానాన్ని, చూసిన పిమ్మట ఆకళింపు చేసుకోవాల్సిన పద్ధతినీ పెనుమార్చుకోవలసిన అవసరమూ, అగత్యమూ ఏర్పడ్డాయి.
కొంతకాలంక్రితం కథానాయకులు మద్యపానం చేసేవారుకారు. ఇప్పుడు చెయ్యకపోతే అతను హీరోయే కాదు. పదిహేనేళ్లక్రితం నేరగాళ్లు హీరోలుగా మారారు. అదిమొదలు బడాచోర్లు, ఇడియట్లు, జులాయిగాళ్లు తయారయ్యారు. ఇప్పుడిక స్మగ్లర్లు సైతం మన అభినందనలు అందుకునే జాబితాలో చేరిపోయారు. నిన్న టీవీలో మహాసముద్రం అనే చిత్రరాజాన్ని కాసేపు వీక్షించాను. అందులో శర్వానంద్‌తో జగపతిబాబు అంటున్నాడు… ‘సముద్రం నీవైపు చూస్తోందల్లుడూ! రా, స్మగ్లింగ్ చెయ్! నువ్వేంటో ఈ విశాఖపట్నానికి చూపించు!’ అని! ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగుతున్న ఆ ప్రసంగానికి నాకు గూస్‌బంప్సే గూస్‌బంప్స్!
ఇక కమర్షియల్ దృష్టిలో పుష్ప సంగతి:
అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా అతను పాత్రలో లీనమైపోయి, తన ఉనికిని కోల్పోవడమే కాకుండా, మన ఉనికిని కూడా మర్చిపోయేంతలా ఒదిగిపోయాడు. తిరుపతి యాస బాగా మాటాడాడు. జగదీష్‌కిచ్చిన పూర్తినిడివి కేశవ పాత్ర ఒక అద్భుతం. అతన్ని పరిశ్రమ జాగ్రత్తగా వాడుకోవాలి. రంగస్థలంలో ఆచంట మహేష్‌ని చూసినప్పుడు కూడా ఇలానే అనిపించింది. ఇలా మన తెలుగు నటుల్ని హాయిగా పరిచయం చేస్తున్న సుకుమార్‌కి మన పరిశ్రమ తప్పకుండా కృతజ్ఞురాలై ఉండాలి. హేట్సాఫ్ టు హిమ్!
రష్మిక ఉన్నంతలో బానే ప్రదర్శించింది. అదే.. నటనని! ఇక అనసూయ డిప్పకటింగేసుకుని డీగ్లామరైజ్డ్‌గా కనబడిందే తప్ప తనకెటువంటి అవకాశమూ లేని పాత్రలో వ్యర్ధమైపోయింది. సునీల్ చొక్కాలేకుండా, ఎటువంటి భేషజమూ కూడా లేకుండా చాలా సహజంగా నటించాడు. నిజంగా అతనికొక మలుపనే చెప్పాలి. అజయ్ ఘోష్ ఎలాగూ బాగా చేస్తాడు. అర్జున్ తల్లిపాత్రలో టీవీ సీరియళ్ల నటి లత బానే చేసింది. కొత్తగా కూడా ఉంది. శరణ్య, రోహిణిల రొటీన్ బారినుండి మనల్ని బయటపడేసింది.
ఫొటోగ్రఫీ విదేశీ సాంకేతికతతో విరుచుకుపడింది. తెరంతా పరుచుకునే అడవి దృశ్యాలు మన కళ్లకు పండగే నిజంగా! దేవిశ్రీ సంగీతం ఫరవాలేదు. పాటల్లో శ్రీవల్లి, ఊ అంటావా క్యాచీగా ఉన్నాయి. మిగతావన్నీ వేస్ట్. బాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. గోవిందప్పగా నటించిన శత్రుని నేనసలు గుర్తుపట్టలేదు. గెడ్డం తీసేసేటప్పటికి అతని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అతడెలాగూ చాలా మంచి నటుడు. కానీ అతణ్ణి దాదాపు గంటసేపు కనబడకుండా చేసి స్క్రీన్‌ప్లేలో పెద్ద లోపాన్ని కనబరిచారు. కారణాలు తెలీవు.
తన చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ ద్వారా ఏడాదికోసారి రాష్ట్రంలో అలజడి సృష్టించే సుకుమార్ సమంతా పాటకోసం ఈసారి ముంబైనించి గణేష్ ఆచార్యని ఎత్తుకొచ్చాడు. అతను సాధ్యమైనంత వల్గర్ డాన్స్ చేయించి తద్వారా సమంతాని అందరిచేతా తిట్టించి, విడాకులిచ్చేసి మంచిపని చేశాడని నాగచైతన్యని పొగిడించాడు. హిపోక్రెట్స్ కదా మనమంతా?
ఫహద్ ఫజిల్ ఉన్న కాసేపూ బోర్ కొట్టింది. ఆ సీన్లేవీ సరిగ్గా రాసుకోలేదనిపించింది. చాలా ఊహించుకున్నాం అతగాడు వస్తున్నాడనగానే! కానీ చప్పగా అనిపించింది. మొత్తానికి పుష్ప సినిమా కాస్త ట్రిమ్ చేస్తే చూడదగ్గ చిత్తమే! అర్జున్ శక్తి, సుకుమార్ నిబద్ధత, సమిష్టి కృషి కలిసి ఈ చిత్రానికి మంచి అవుట్‌పుట్ ఇచ్చాయి. రెండవభాగం కోసం నిరీక్షిస్తూ………..కొచ్చెర్లకోట జగదీశ్” అని రాశారు. ఏదేమైనా కూడా జగదీష్ గారు చెప్పింది నిజం అంటూ చాలామంది ఆయన కామెంట్ ని ప్రశంసించారు.
ALSO READ : సలార్ మొదట టికెట్ కొన్న ఎస్ఎస్ రాజమౌళి…
End of Article