పౌరాణిక పాత్రలు అనగానే ప్రేక్షకులకైనా, దర్శకులకైనా ముందు గుర్తు వచ్చేది ఎన్టీఆర్. ముఖ్యంగా రాముని పాత్రలు, కృష్ణుని పాత్రలు వెయ్యడంలో ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా. పౌరాణిక పాత్రల్లో ఇరగదీస్తున్న టైం లోనే ఓ పౌరాణిక ప్రధాన చిత్రానికి ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు.
Video Advertisement
అయితే కథానాయకుడిగా మంచి ఫామ్ లో ఉన్న టైం లోనే ఓ పౌరాణిక సినిమాకు నిర్మాణ దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడంతో అప్పట్లోనే అందరు ఆశ్చర్యపోయారు. 1977 లో దానవీర శూరకర్ణ సినిమా విడుదల అయ్యింది.
ఎన్టీఆర్, కొండవీటి వెంకటకవి కలిసి ఈ సినిమాను సృష్టించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ సినిమా విడుదల అయ్యి ఇన్నేళ్లు అయినా.. “ఏమంటివి.. ఏమంటివి..” అనే డైలాగును నేటికీ సినిమాల్లో స్పూఫ్ గానో.. లేక ఆర్టిస్ట్ పెర్ఫామెన్స్ లు ఇచ్చేవారో ఈ డైలాగ్ ను చెప్తూనే ఉంటారు. మహాభారతంలోని కొంత భాగాన్ని తీసి పౌరాణిక చిత్రంగా నిర్మించారు. ఓ సంస్కృత కళాశాలకు ప్రిన్సిపల్ అయిన కొండవీటి వెంకటకవిని ఈ సినిమాకు మాటల రచయితగా ఎంచుకున్నారు.
ఆయన రాసిన సంభాషణలన్నీ ఎంతగానో ప్రేక్షకుల మన్నన పొందాయి. ఈ సినిమాలో ప్రభాకర్ రెడ్డి ధర్మరాజుగా నటించగా, హరికృష్ణ అర్జునుడిగా నటించారు. భీముడిగా సత్యనారాయణ, బాలకృష్ణ అభిమన్యుడిగా నటించారు. ఈ సినిమాలో మూడు పాత్రలలో ఎన్టీఆర్ ఒక్కరే నటించారు. అయితే చలపతి రావు అనే మరో నటుడు ఏకంగా ఐదు పాత్రలలో నటించారు. జరాసంధుడు, ఇంద్రుడు, అతిరధుని పాత్రలతో పాటు మరో రెండు అతిధి పాత్రలలో కూడా చలపతి రావు నటించారు. ఈ సినిమా నిడివి నాలుగు గంటల పదిహేడు నిముషాలు. కానీ ఇంత పెద్ద సినిమా షూటింగ్ ను కేవలం నలభై రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం.