తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ శనివారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ చికిత్స పొందుతూ ఆయన ఉదయం 9.45 గంటలకు తుది శ్వాస విడిచారు.
ఆయన వయసు 82 సంవత్సరాలు. చంద్రమోహన్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని తెలుస్తోంది. సోమవారం నాడు హైదరాబాద్‌లో చంద్రమోహన్ అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఆయన 1942లో కృష్ణాజిల్లాలోని పమిడిముక్కలలో మే 23న జన్మించారు. 1966లో రంగులరాట్నం అనే సినిమాతో చంద్రమోహన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే నంది అవార్డ్ ను అందుకున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా నటించిన చంద్రమోహన్, 175 పైగా సినిమాలలో హీరోగా చేశారు. ఆ తరువాత ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించిన ఆయన మొత్తం 932 చిత్రాలలో నటించాడు.
సెకండ్ హీరోగా, హీరోగా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా వైవిధ్యమైన క్యారెక్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల ద్వారా ఆయన తెలుగు ఆడియెన్స్ మనసులో చెరిగిపోని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కి చంద్రమోహన్‌ను లక్కీ హీరోగా చెబుతారు. ఆయన పక్కన నటించిన హీరోయిన్స్ ఆ తరువాతి కాలంలో టాప్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఏలారు. వారిలో జయప్రద, జయసుధ, శ్రీదేవి, సుహాసిని, విజయశాంతి వరకు చాలా మంది ఉన్నారు. వారంతా కెరీర్ తొలినాళ్లలో చంద్రమోహన్ తో నటించినవారే.
చంద్రమోహన్ కెరీర్ లో ఆయన నటనకు గానూ 2 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ఆయన భార్య పేరు జలంధర. మంచి రచయిత్రి. పలు కథా సంకలనాలను రాశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, మధుర మీనాక్షీ అమెరికాలో స్థిరపడింది. రెండవ కుమార్తె మాధవి డాక్టర్ చెన్నైలో స్థిరపడింది.
Also Read: “శక్తి” సినిమాలో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ..?