ఒక 9 సంవత్సరాల అమ్మాయి, తన తల్లి చనిపోయిందని ఆ ఫోన్ ని తిరిగి ఇవ్వమని అడుగుతున్న సంఘటన ఒకటి ప్రస్తుతం చర్చలో ఉంది. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని కుశాల్ నగర్ లోని కొడగు కి చెందిన హృతీక్ష కి తొమ్మిది సంవత్సరాలు. హృతీక్ష తల్లి, తండ్రి కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు.
హృతీక్ష తల్లి ప్రభ చికిత్స పొందుతూ మే 6 వ తేదీన మరణించారు. ప్రభకి సంబంధించిన వస్తువులను వైద్యులు కుటుంబ సభ్యులకు అందించారు. అయితే ఆ వస్తువులలో ప్రభ ఫోన్ మిస్ అయ్యింది. దాంతో ప్రభ కూతురు హృతీక్ష ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇందులో భాగంగా హృతీక్ష ఒక లేఖ రాసింది. ఆ లెటర్ లో దయచేసి తల్లి ఫోన్ ని ఎలాగైనా తిరిగి ఇప్పించండి అని, అందులో తన తల్లి ఫోటోలు, వీడియోలు ఉన్నాయని హృతీక్ష పేర్కొంది. దీనికి స్పందించిన అధికారులు మొబైల్ ఫోన్ ని వెతికి, తిరిగి ఇస్తాము అని హామీ ఇచ్చారు. ఈ సంఘటన అందరి చేత కంటతడి పెట్టిస్తోంది.